జీహెచ్ఎంసీలో మాస్ వ్యాక్సినేషన్

by Shyam |
జీహెచ్ఎంసీలో మాస్ వ్యాక్సినేషన్
X

దిశ, తెలంగాణ బ్యూరో : జీహెచ్ఎంసీ పరిధిలోని కొవిడ్ సూపర్ స్ప్రెడర్స్ వ్యాక్సినేషన్ కోసం స్పెషల్ డ్రైవ్ చేపట్టేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. ఈ నెల 28 నుంచి పది రోజుల పాటు మాస్ వ్యాక్సినేషన్ చేయాలని జీహెచ్ఎంసీ నిర్ణయించింది. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు గ్రేటర్ పరిధిలో స్పెషల్ డ్రైవ్‌లో భాగంగా సుమారు మూడు లక్షల మందికి వ్యాక్సినేషన్ పూర్తి చేయాలని అధికారులు నిర్ణయించారు. ఇందుకు సంబంధించిన ఆదేశాలను కమిషనర్ లోకేష్ కుమార్ జారీ చేశారు. పని ప్రదేశాల్లో వారితో పాటు సూపర్ స్ర్పెడర్స్ కు వ్యాక్సినేషన్ పూర్తి చేయాలని మంగళవారం సీఎం కేసీఆర్ ఆదేశించిన నేపథ్యంలో గ్రేటర్‌లో అందుకు అవసరమైన చర్యల కోసం అధికారులు సిద్ధమవుతున్నారు. జీహెచ్ఎంసీ పరిధిలోని 30 సర్కిళ్లలో పది రోజుల పాటు స్పెషల్ మాస్ వ్యాక్సినేషన్ డ్రైవ్ చేపట్టేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.

ఇందుకు సంబంధించి జోనల్, సర్కిల్ కమిషనర్లకు జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేష్ కుమార్ పలు సూచనలు చేశారు. సర్కిల్ పరిధిలో రోజుకు వెయ్యి చొప్పున పది రోజుల్లో 30 వేల మందికి వ్యాక్సిన్ వేయనున్నారు. ఈ లెక్కన పది రోజుల్లో జీహెచ్ఎంసీ పరిధిలో మొత్తం మూడు లక్షల మందికి వ్యాక్సినేషన్ పూర్తి చేయాలని నిర్ణయించారు. సూపర్ స్ప్రెడర్స్ ను గుర్తించడంతో పాటు వ్యాక్సినేషన్ కోసం ప్రత్యేకంగా విశాలమైన గ్రౌండ్స్ లేదా స్థలాలను గుర్తించే పనిలో జీహెచ్ఎంసీ పడింది. కొవిడ్ నిబంధనలు పాటిస్తూ ప్రతీ రోజూ వెయ్యి మందికి వ్యాక్సినేషన్ చేసేందుకు అనువైన స్థలాలను ఎంపిక చేయాల్సిన బాధ్యత జోనల్ కమిషనర్లకు అప్పగించారు. వ్యాక్సినేషన్ కోసం జీహెచ్ఎంసీ, హెల్త్, పోలీస్ విభాగాలతో కలిపి బృందాలను ఏర్పాటు చేస్తున్నారు. ఆయా శాఖల సమన్వయంతో మాస్ వ్యాక్సినేషన్ పూర్తి చేసేందుకు బల్దియా అధికారులు కసరత్తు చేస్తున్నారు.

తొలి ప్రాధాన్యతలో వీరే..

కరోనా నివారణకు లాక్‌డౌన్ అమలు చేస్తున్నప్పటికీ అత్యవసర సేవలు, కొన్ని తప్పనిసరి విధులు చేసేవారికి మినహాయింపు ఉంది. ఈ నేపథ్యంలో వీరి నుంచే ఎక్కువ మందికి కరోనా వైరస్ సోకే తీవ్రత ఉన్న నేపథ్యంలో అలాంటి వారందరిని ప్రభుత్వం సూపర్ స్ప్రెడర్స్ గా గుర్తించింది. పది రోజుల స్పెషల్ డ్రైవ్ లోనూ ఈ సూపర్ స్ప్రెడర్స్ కు ప్రాధాన్యతనిచ్చి టీకాలు పూర్తి చేయాలని జీహెచ్ఎంసీ భావిస్తోంది. స్పెషల్ డ్రైవ్ లో టీకాను రైతు బజార్లు, ఫ్రూట్స్, పువ్వుల మార్కెట్లలో పని చేసేవారు, వీధి వ్యాపారులు, చేపలు, చికెన్, మాంసం విక్రయ కేంద్రాల నిర్వాహకులు, వైన్స్ సిబ్బంది, హెయిర్ కటింగ్ సెలూన్స్, ఐరన్ హార్డ్ వేర్ దుకాణాలు, కిరణా దుకాణాదారులకు వేయాలని నిర్ణయించారు. ఆయా వృత్తుల్లో ఉన్నవారిని నిత్యం ఎక్కువ మందిని కలుస్తుండటం వల్ల కొత్తవారికి వైరస్ సోకే అవకాశాలు ఉండటంతో తొలి ప్రాధాన్యతగా టీకా వేసేందుకు జీహెచ్ఎంసీ ఏర్పాట్లు చేస్తోంది.

Advertisement

Next Story