ప్యాసింజర్ వాహనాలపై జీఎస్టీ తగ్గింపు అవసరం లేదు : మారుతీ సుజుకి

by Harish |
Business
X

దిశ, వెబ్‌డెస్క్: ప్యాసింజర్ వాహనాలపై జీఎస్టీ రేటు తగ్గింపు అవసరంలేదని, రాబోయే కొద్ది నెలలు పరిశ్రమలో డిమాండ్ బాగానే ఉంటుందని దేశీయ అతిపెద్ద కార్ల తయారీసంస్థ మారుతీ సుజుకి ఇండియా అభిప్రాయపడింది. భవిష్యత్తులో డిమాండ్ క్షీణించే పరిస్థితులు ఏర్పడితే జీఎస్టీ ఉపశమనంపై ప్రభుత్వం పునరాలోచించగలదనే నమ్మకముందని సంస్థ వెల్లడించింది. ‘సెప్టెంబర్ త్రైమాసికంలో పరిశ్రమ మెరుగైన పనితీరు కనబరించింది.

డిమాండ్ లేకపోవడమనే కారణంతో అమ్మకాలు దెబ్బతిన్నట్టు కనిపించడంలేదు. ఉత్పత్తి సామర్థ్యం పూర్తిస్థాయిలో రికవరీ అయిన తర్వాత ఒక అంచనాకు రాగలమని’ మారుతీ సుజుకి ఇండియా ఛైర్మన్ ఆర్ సి భార్గవ చెప్పారు. కాబట్టి, డిమాండ్ లేని సమయంలో తగ్గింపులను ఇవ్వడం వల్ల పరిశ్రమకు లాభదాయకం కాదని ఆయన పేర్కొన్నారు. జీఎస్టీ అవసరంలేదనే అంశంపై వివరంగా చెప్పిన ఆయన, తాము ఉత్పత్తి చేస్తున్న ప్రతిదాన్ని విక్రయిస్తున్నాం. ఒకవేళ జీఎస్టీ తగ్గితే.. డిమాండ్ మరో 30 శాతం అధికంగా మారుతుందని, ఆ స్థాయిలో ఉత్పత్తి ఉండకపోవచ్చని ఆయన తెలిపారు. సెప్టెంబర్‌తో ముగిసిన రెండో త్రైమాసికంలో మారుతీ సుజుకి మొత్తం అమ్మకాల్లో హ్యాచ్‌బ్యాక్‌ల వాటా మెరుగుపడిందని తెలిపింది. ఇటీవల డీజిల్ కార్లు లేకపోవడం వల్ల అమ్మకాలపై ఎలాంటి ప్రతికూల ప్రభావం కనిపించలేదని కంపెనీ వెల్లడించింది.

Advertisement

Next Story

Most Viewed