మిడ్-ఎస్‌యూవీ విభాగంలో మార్కెట్ వాటా పెంచే ప్రయత్నంలో మారుతీ సుజుకి

by Harish |
మిడ్-ఎస్‌యూవీ విభాగంలో మార్కెట్ వాటా పెంచే ప్రయత్నంలో మారుతీ సుజుకి
X

దిశ, వెబ్‌డెస్క్: దేశీయ అతిపెద్ద ప్యాసింజర్ కార్ల తయారీ సంస్థ మారుతీ సుజుకి ఇండియా(ఎంఎస్ఐ) దేశీయంగా ప్రీమియం మిడ్-సైజ్ ఎస్‌యూవీ వాహనాల మార్కెట్‌ను మరింత బలోపేతం చేసేందుకు సిద్ధమవుతోంది. ప్రస్తుతం కంపెనీ మొత్తం ప్యాసింజర్ వాహనాల విభాగంలో 50 శాతం వాటాను కలిగి ఉంది. దీన్ని మరింత విస్తరించేందుకు కొత్త చర్యలను అమలు చేయనుంది. దేశీయంగా మిడ్-ఎస్‌యూవీ విభాగంలో హ్యూండాయ్ క్రెటా, కియా సెల్టోస్ వాహనాలు ఆధిపత్యం వహిస్తున్నాయి. మారుతీ సుజుకి నుంచి ఎస్-క్రాస్ మోడల్ కారు ఈ విభాగంలో ఉన్నప్పటికీ పెద్దగా అమ్మకాలను సాధించలేకపోతోంది. ఎంట్రీ-లెవెల్ ఎస్‌యూవీ విభాగంలో మారుతీ నుంచి విటారా బ్రెజా అమ్మకాల జోరును కొనసాగిస్తున్నప్పటికీ, మిడ్-ఎస్‌యూవీ విభాగంలో కంపెనీ వెనకబడి ఉంది.

దీన్ని భర్తీ చేసేందుకు కంపెనీ ప్రణాళికను కలిగి ఉంది. ‘ఇప్పటివరకు మిడ్-ఎస్‌యూవీ విభాగంలో అనుకున్న స్థాయిలో అమ్మకాలను సాధించలేదని నమ్ముతున్నాం. రాబోయే సంవత్సరాల్లో దీన్ని మరింత పెంచుతామని’ ఎంఎస్ఐ మార్కెటింగ్ అండ్ సేల్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శశాంక్ శ్రీవాస్తవ చెప్పారు. ఎస్‌యూవీ విభాగంలో కంపెనీ మార్కెట్ వాటా 13.2 శాతం మాత్రమే ఉంది. అయినప్పటికీ ఎంట్రీ-లెవెల్ ఎస్‌యూవీ విభాగంలో కంపెనీ మార్కెట్ లీడర్‌గా ఉందని, రానున్న రోజుల్లో ప్రీమియం ఎస్‌యూవీలో మరిన్ని మార్పులు తీసుకురానున్నట్టు శశాంక్ తెలిపారు. కాగా, గత ఆర్థిక సంవత్సరంలో మారుతీ సుజుకి ప్యాసింజర్ వాహన విభాగంలో 51 శాతం వాటా నమోదు చేసింది. గ్రామీణ ప్రాంతాల్లోనూ కంపెనీ 38.5 శాతం నుంచి 41 శాతం వాటాను కంపెనీ సాధించింది.

Advertisement

Next Story

Most Viewed