కార్ల ధరలు పెంచనున్న మారుతీ సుజుకి

by Harish |
కార్ల ధరలు పెంచనున్న మారుతీ సుజుకి
X

దిశ, వెబ్‌డెస్క్: కొవిడ్-19 ప్రభావం ఆటో పరిశ్రమను ఇంకా వీడలేదు. ఇటీవల మెరుగైన డిమాండ్‌ను సాధిస్తున్న పరిశ్రమకు కరోనా వల్ల ఇన్‌పుట్ ఖర్చులు భారంగా మారిపోతున్నాయి. ఈ క్రమంలోనే పెరుగుతున్న ఇన్‌పుట్ ఖర్చుల ప్రతికూల ప్రభావాన్ని అధిగమించేందుకు వచ్చే ఏడాది జనవరి నుంచి వాహనాల ధరలను పెంచనున్నట్టు దేశీయ అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతీ సుజుకి ఇండియా వెల్లడించింది. గతేడాది వివిధ ఇన్‌పుట్ ఖర్చులు పెరగడం వల్ల కంపెనీ వాహనాల వ్యయం ప్రతికూలంగా ప్రభావితమైందని మారుతీ సుజుకి ఇండియా రెగ్యులేటరీ ఫైలింగ్‌లో తెలిపింది.

కాబట్టి, 2021 జనవరి నుంచి ధరల పెంపు ద్వారా అదనపు వ్యయాన్ని వినియోగదారులపై వేయడం అత్యవసరమని కంపెనీ పేర్కొంది. అయితే, ఈ ధరల పెరుగుదల వేర్వేరు మోడళ్లకు వేర్వేరుగా ఉంటుందని స్పష్టం చేసింది. ప్రస్తుతం మారుతీ సుజుకి ఎంట్రీల్ లెవల్ స్మాల్ కార్ ఆల్టో రూ. 2.95 లక్షల నుంచి మల్టీ పర్పస్ వెహికల్ ఎక్స్ఎల్ 6 రూ. 11.52 లక్షల ధరల్లో వాహనాలను విక్రయిస్తోంది. నవంబర్‌లో కంపెనీ మొత్తం దేశీయ ప్యాసింజర్ వాహనాల అమ్మకాల్లో 2.4 శాతం క్షీణతను నమోదు చేసిన సంగతి తెలిసిందే. అయితే, అదనపు వ్యయ భారాన్ని తగ్గించుకునేందుకు తాజాగా ధరల పెరుగుదలకు సిద్ధమవుతోంది.

Advertisement

Next Story

Most Viewed