- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పెళ్లయ్యి పదేళ్లయిందిగా..
దిశ, కథా స్రవంతి: “ఈ చీరలో నేను ఎలా ఉన్నానండి?” అని మెలికలు తిరుగుతూ భర్తను అడిగింది కొత్త చీర కట్టుకున్న భాగ్యలక్ష్మి.
కాఫీ తాగుతూ పేపర్ చదువుతున్న సూర్యం తల పైకెత్తి ఆమెను ఓసారి చూసి “బాగుంది” అని చెప్పి మళ్లీ తలను పేపర్ లో దూర్చాడు.
“సరిగా చూడకుండానే చెప్తారేంటండీ.. చదివిన పేపర్‌నే పది సార్లు చదువుతారు కానీ కాసేపు నన్ను చూడడానికి మాత్రం ఇంట్రెస్ట్ ఉండదు మీకు” అంటూ రుసరుసలాడింది భాగ్యలక్ష్మి.
“అబ్బా… ఉదయాన్నే నీ నస ఏంటే బాబు నాకు” తల పట్టుకున్నాడు సూర్యం.
“అంతేలేండి.. పెళ్లయ్యి పదేళ్లు అయిందిగా.. నేనేం మాట్లాడినా మీకు నస లాగే ఉంటుంది. పెళ్లయిన కొత్తల్లో అయితే ‘భాగ్యం.. నీ పలుకు మధురం నీ మౌనం తట్టుకోలేదు నా హృదయం’ అంటూ కవితలు చెప్పేవారు” అంటూ పైట కొంగుతో కళ్ళూ, ముక్కూ తుడుచుకుంది భాగ్యలక్ష్మి.
“ఇప్పుడు నన్నేం చేయమంటావో చెప్పు” అన్నాడు సూర్యం కోపాన్ని అణుచుకుంటూ..
“పెళ్లయిన కొత్తల్లో నేను ఏ చీర కట్టుకున్నా.. ‘భాగ్యం.. నువ్వు కట్టుకోవడం ఆ చీర చేసుకున్న భాగ్యం’ అనేవారు. ఇప్పుడు మీకు నచ్చిన రంగు చీర కట్టుకోని చూపించినా.. ఏదో మొక్కుబడిగా ‘బాగుంది’ అంటున్నారు.. అయినా ఇలా కాకా ఎలా అంటారులెండి.. పెళ్లయ్యి పదేళ్లు అయిందిగా” అంది భాగ్యం సాగదీస్తూ.
తల గోడకేసి కొట్టుకోవాలనిపించినా… కంట్రోల్ చేసుకున్నాడు సూర్యం.
“భాగ్యం.. చేసిన రచ్చ చాలు .. ఆకలిగా ఉంది తినడానికి ఏమైనా పెట్టు” అని ఇలా అన్నాడో లేదో చిటికెలో పాయసంతో ప్రత్యక్షమైంది భాగ్యలక్ష్మీ
క్షణాలలో పాయసం అంతా తాగేసి… ఖాళీ కప్పుని భార్య చేతిలో పెట్టాడు సూర్యం.
అక్కడే నిమిషం పాటూ మౌనంగా నుంచున్న భాగ్యలక్ష్మి మళ్లీ మొదలు పెట్టింది..
“పెళ్లయిన కొత్తల్లో అయితే..
‘భాగ్యం.. నీ చేతి వంట అద్భుతం
నువ్వు మంచినీళ్ళు ఇచ్చినా.. నాకవి అమృతంతో సమానం’ అనేవారు.. ఇప్పుడు నా చేత్తో చేసిన పాయసం పెడితే.. లొట్టలు వేసుకుంటూ తాగారే కానీ.. బాగుంది అని ఒక్కమాట అన్నారా?? ఆ.. ఎందుకంటారులెండి.. పెళ్లయ్యి పదేళ్లయిందిగా” అంది భాగ్యలక్ష్మి మూతి ముడుస్తూ..
తిక్కరేగిన సూర్యం కోపంతో ఊగిపోతూ “ఏంటే ఇందాకట్నుంచి.. పదేళ్లు పదేళ్లు అని చంపుతున్నావ్… ” అంటూ మధ్యలో ఏదో గుర్తొచ్చినవాడిలాగ ఆగిపోయాడు సూర్యం.. కాసేపటి తరువాత అన్నాడు “అవునూ.. మన పెళ్లయ్యి తొమ్మిదేళ్లే కదా అయింది.. ఇందాకటి నుండి పదేళ్లయింది అంటున్నావేంటి?” అన్నాడు భార్యతో..
“హ్మ్మ్.. మీరు పదేళ్లు పదేళ్లు అంటూ ఆగిపోయి ఏదో ఆలోచిస్తుంటే.. గుర్తురావాల్సినది గుర్తొచ్చిందేమో అనుకున్నాను.. అయినా మీకెందుకు గుర్తొస్తుందిలెండి.. ఈ రోజుతో మన పెళ్లయ్యి పదేళ్లయిందిగా” అంది భాగ్యలక్ష్మి మూతి తిప్పుకుంటూ.
అప్పుడు గుర్తొచ్చింది సూర్యంకి ఈ రోజు వారి పెళ్లిరోజని.
“ఓహో.. ఇది నాకు గుర్తుచేయడానికేనా ఇందాకటినుండి పరోక్షంగా అన్ని మాటలు మాట్లాడావు.. అదేదో నేరుగా చెప్పేయొచ్చు కదా. ఆడవారి మాటలకు.. అర్థాలే వేరులే.. అని ఊరికే అనలేదు మన పెద్దలు” అనుకున్నాడు సూర్యం మనసులో..
“హ్హహ్హహ్హ.. అయ్యో పిచ్చి భాగ్యం.. నాకు నిజంగా ఈ రోజు మన పెళ్లిరోజని గుర్తులేదనుకున్నావా?? సరదాగా నిన్ను ఆటపట్టించడానికి అలా నటించానంతే.. నీకోసం గిఫ్ట్ కూడా తీసుకున్నాను.. వెళ్లి తీసుకొస్తాను” అని చెప్పి బెడ్రూమ్ లో కి వెళ్లి “హమ్మయ్యా భలే కవర్ చేశాను” అనుకోని మనసులోనే సంబరపడ్డాడు సూర్యం.
అక్కడే ఉన్న తన ఆఫసు బ్యాగ్ లో నుండి గిఫ్ట్ ప్యాక్ తీసుకెళ్ళి భార్య చేతిలో పెట్టాడతను.
దాన్ని చూడగానే భాగ్యలక్ష్మి కళ్ళు మెరిశాయి.. అది చూసి నవ్వుకోసాగాడు సూర్యం..
సూర్యం ఆఫీసులో అతని కొలీగ్ అయిన టీనా జాబ్ కి రిసైన్ చేసి ఆఫసు నుండి వెళ్లిపోతూ ఆమె టీం లోని వారందరికీ గిఫ్ట్స్ ఇచ్చి వెళ్ళింది.
ఇప్పుడు సూర్యం అతని భార్యకు ఇచ్చింది ఆ గిఫ్ట్ ప్యాకే.
దాంట్లో ఏముందో అతను కూడా చూడలేదు.. అతనంటే టీనా కి చాలా అభిమానం ఉండడం వలన మంచి బహుమతే ఇచ్చి ఉంటుందిలే అనే ధీమాతో ప్యాక్ ఓపెన్ కూడా చేయకుండానే అతని భార్యకు ఇచ్చాడు సూర్యం.
భాగ్యలక్ష్మి గిఫ్ట్ ప్యాక్ ఓపెన్ చేసింది.. అందులో సిగరెట్ వెలిగించుకునే లైటర్ తో పాటు ఒక సిగరెట్ ప్యాకెట్ కూడా ఉంది. దాంట్లో ఒక చిన్న పేపర్ కూడా ఉంది. ఆ పేపర్ లో ఇలా రాసి ఉంది.
” నీకేం గిఫ్ట్ ఇవ్వాలో నాకు తోచలేదు.. నువ్వేన్నోసార్లు చెప్పావు కదా నీకు నీ పెళ్ళాం కంటే కూడా ఇవంటేనే ఇష్టమని.. అందుకే వీటినే గిఫ్ట్ గా ఇస్తున్నాను”..
భాగ్యలక్ష్మీ అది చదవడం పూర్తి చేసి తల పైకెత్తెసరికి అక్కడనుండి మెల్లగా జారుకున్నాడు సూర్యం.
– సాయి స్రవంతి