- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అవతార్-2 మూవీ చూస్తారా? ముందు ఈ రివ్యూ చదవండి!
క్రీస్తుశకం 2150 నాటికి భూగర్భంలో గల అన్ని వనరులూ హరించుకుపోగా,ఉనోబ్టానియం అనే విలువైన ఖనిజం మెండుగా ఉన్న పండోరా గ్రహంపై కన్నేసిన మానవుల కథ అది. ఆ గ్రహంపై నవీ అనే పేరున్న భారీ విచివూత శరీరాకృతి కలిగిన మూలవాసులు నివసిస్తారు. వీళ్లు ప్రకృతి ప్రేమికులు. అడవిపై ఆధారపడి జీవిస్తారు. కొండదేవతను ఆరాధిస్తారు. ఆ దేవత కొలువైన పర్వతక్షిశేణుల్లో ఖనిజనిల్వలున్నట్లు గుర్తించిన మానవులు వాటిని చేజిక్కించుకోవడానికి ప్రయత్నిస్తారు. నవీలను పోలిన మానవ అవతారాలను సృష్టించి ఆ గ్రహంపైకి పంపుతారు.దీంతో ఇరువర్గాల మధ్య భీకర పోరాటం జరుగుతుంది. అయితే, మానవుల టీంతో వెళ్లిన హీరో నవీ తెగకు చెందిన యువతితో ప్రేమలో పడతాడు. ప్రకృతితో ముడివడిన ఆ తెగ ప్రజల జీవనాన్ని, అస్తిత్వాన్ని గుర్తిస్తాడు.తమ స్వార్థం కోసం వారిని ఆ కొండల నుంచి తరిమేయడం అన్యాయమని భావిస్తాడు.తన పైఅధికారుల ఆజ్ఞలను ధిక్కరించి వారి పక్షాన నిలబడతాడు. ఎన్నో మలుపులు..మరెన్నో భీకరపోరాటాలు.పాణనష్టాల అనంతరం చివరకు నవీ తెగనే విజయం వరిస్తుంది. హీరోను తమలో ఒకడిగా కలుపుకున్న మూలవాసులు మానవులను భూగ్రహానికి తరిమికొడతారు. ఇదీ క్లుప్తంగా అవతార్ కథ.
ఇదంతా ఎందుకు చెప్పాల్సివచ్చిందంటే సరిగ్గా అవతార్ సినిమా కథను తలపించే కథ ఒకటి ఒరిస్సా రాష్ట్రంలోని నియాంగిరి కొండల్లో దశాబ్దకాలంగా ఆవిష్కృతమవుతున్నది. ఈ కొండల గర్భాన విరివిగా ఉన్న బాక్సైట్ నిల్వలపై లక్షన్నర కోట్ల ఆస్తులు కలిగిన బహుళజాతి సంస్థ 'వేదాంత'కంపెనీ కన్నుపడింది. ఎలాగైనా ఈ ఖనిజవనరులను చేజిక్కించుకుని మరిన్ని లక్షల కోట్లు ఆర్జించడానికి ఆ కంపెనీ పథకాలు రచించింది. 2003లో ఒరిస్సా ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకున్నది. భారీగా నిధులు వెచ్చించి పర్యావరణ ప్రభావ అధ్యయన నివేదికలను తనకు అనుకూలంగా తెప్పించుకు న్నది. ప్రజలులేని ప్రజాభివూపాయసేకరణ తతంగాన్ని నిర్వహించింది. లాబీయింగ్ చేసి చివరకు కేంద్ర పర్యావరణశాఖ నుంచి తాత్కాలిక అనుమతిని సైతం సంపాదించింది. లాంజిగఢ్ లో రెం డు వేల ఎకరాల స్థలంలో అల్యూమినియం శుద్ధి కర్మాగారాన్ని నెలకొల్పింది. ఇక నియాంగిరి కొండలపై తవ్వకాలు మొదలు కావడమే తరువాయి. అవతార్‌లో లాగా హీరో కాదు కానీ పీయూసీఎల్ తదిత ర ప్రజా సంఘాలు స్థానిక ఆదివాసుల పక్షాన నిలిచాయి. అభివృద్ధి పేరిట తమ బతుకులపై సాగుతున్న ఆక్రమణను ఎలా ఎదుర్కోవాలో తెలియక సతమతమవుతున్న డోంగ్రి యా కోందులను జాగృతం చేశాయి. వారి తరఫున సుప్రీంకోర్టుకు వెళ్లాయి. కోర్టు తాత్కాలిక స్టేను మంజూరు చేసింది. అయితే, పర్యావరణానికి చేటుచేయబోమని, పూర్తిస్థాయిలో పునరావాసం కల్పిస్తామని, స్థానికుల సంక్షేమానికి తమదే పూచీ అంటూ వేదాంత చేసిన వాదనలతో చివరకు అత్యున్న త న్యాయస్థానం ఏకీభవించింది.లాభాల్లో ఐదుశాతం వాటా ను స్థానికుల అభివృద్ధికి కేటాయించాలనే షరతుపై మైనింగ్ ను అనుమతించవచ్చంటూ 2008 ఆగస్టులో ఆదేశాలు జారీ చేసింది. కోర్టులతో అయ్యేపని కాదని ఆలస్యంగానైనా తెలుసుకున్న డోంగ్రియాలు 'నియాంగిరి సురక్షా సమితి' ని ఏర్పాటు చేసుకుని పోరాటం మొదలుపెట్టారు. నిరసనసభలు, ధర్నాలు, ఊరేగింపులు, బంద్‌లు నిర్వహించారు. వేదాంత పంపిన ఆదివాసేతర గూండాల దాడులను ఎదుర్కొంటూ ముందుకు సాగారు. వీరికి సంఘీభావంగా గ్రీన్‌కలహంది, కలహంది సచేతన్ నాగరిక్ మంచ్ వంటి పౌరసంస్థలు సైతం ఏర్పడి ఉద్యమంలో చేరాయి. పలువురు మేధావులు, సామాజిక కార్యకర్తలు, పర్యావరణ నిపుణులు రంగంలోకి దిగారు. వేదాంత తలపెట్టిన ప్రాజెక్టు అభివృద్ధికి మించి జీవన విధ్వంసాన్ని సృష్టిస్తున్నదని,పర్వావరణానికి ప్రమాదమని, భూగర్భ జలాలు అడుగంటుతాయని, జంతుజాలం నశిస్తుందని, ఇప్పటికే అల్యూమినియం కర్మాగారం వల్ల వెలువడిన కాలుష్యం, పోగుబడిన వ్యర్థపదార్థాలు ఇందుకు సాక్ష్యమని గొంతెత్తారు. ఫలితంగా అంతర్జాతీయ సమాజం స్పందించింది. మానవ హక్కుల సంస్థ ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్, సర్వైవల్ ఇంటర్నేషనల్ వేదాంత మైనింగ్ కార్యకలాపాలను వ్యతిరేకించాయి. చర్చ్ ఆఫ్ ఇంగ్లండ్ సహా బ్రిటన్‌కు చెందిన పలు వ్యాపార సంస్థలు వేదాంత నుంచి తమ షేర్లను ఉపసంహరించుకున్నాయి.
ఫలితంగా కేంద్రం దిగివచ్చింది. వేదాంత మైనింగ్ మూలంగా స్థానికంగా వాటిల్లే నష్టాన్ని అంచనా వేయడానికి ఎన్ సీ సక్సేనా నేతృత్వంలో కమిటీ వేసింది. ఈ కమిటీ 2010ఆగస్టు 16న నివేదికను సమర్పించింది. అటవీ సంరక్షణా చట్టాన్ని, అటవీ హక్కు ల చట్టాన్ని, పర్యావరణ పరిరక్షణ చట్టాన్ని,వేదాంత కంపెనీ ఉల్లంఘించిందని, రాష్ట్ర ప్రభుత్వ అధికారులు ఆ సంస్థతో కుమ్మక్కయ్యారని పేర్కొంది. నియాంగిరిలో మైనిం గ్‌వల్ల రెండు అతి పురాతన తెగల అస్తిత్వానికి ప్రమాదమేర్పడుతుందని తేల్చింది. ఈ నివేదిక ఆధారంగా వేదాంత కంపెనీకి ఇచ్చిన పర్యావరణ అనుమతులను రద్దు చేస్తున్నట్లు కేంద్ర మంత్రి జైరాంరమేష్ ప్రకటించారు. అయితే, వేదాంత తిరిగి సుప్రీంను ఆశ్రయించింది. రెండు సంవత్సరాలకు పైగా విచారణ కొనసాగిన అనంతరం 2013 ఏప్రిల్ 18న తుదితీర్పు వెలువడింది. నియాంగిరిపై మైనింగ్‌ను అనుమతించే అధికారం కేవలం స్థానికులకే ఉందని స్పష్టం చేసింది. అటవీ భూములపై, పవివూతస్థలాలపై ఆదివాసులకే యాజమాన్య హక్కులను కల్పించాలని ఆదేశించింది. మైనింగ్ అంశాన్ని పల్లిసభ(క్షిగామ్‌సభ)లకు వదిలేయాలని సూచించింది. ప్రస్తుతం ఈ గ్రామ్‌సభలు నిర్వహించే పని లో రాష్ట్ర ప్రభుత్వ అధికారులు ఉంటే, తమకు అనుకూలంగా తీర్మానాలు చేయించుకుని మైనింగ్ ప్రారంభించే ప్రయత్నాల్లో వేదాంత కంపెనీ ఉన్నది.ఇక్కడ డోంగ్రియా కోందు తెగ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. అవతార్ సినిమాలోని విచిత్ర నవీ తెగ కంటే కూడా డోంగ్రియా కోందులు విశేష జీవనవైవిధ్యాన్ని కలిగిఉన్నారు. అబూజ్‌మాడ్ గోండుల్లాగే వీరిది అతి పురాతన తెగ. ప్రొటోఆస్ట్రలాయిడ్ జాతికి చెందిన ఈ తెగను అంతరించిపోతున్న తెగగా సర్వైవల్ ఇంటర్నేషనల్ గుర్తించింది. వీళ్లు కుయి భాషను మాట్లాడుతారు. ప్రధానంగా కలహంది, కోరాపుట్, రాయగఢ జిల్లాల్లో విస్తరించివున్న నియాంగిరి కొండల్లో నివసిస్తారు. కొండలపై నివసిస్తారు కనుక వీరిని డోంగ్రియా(డోంగర్ అంటే గుట్ట)లని అర్థం. పారే సెలయేళ్ల పక్కన ఇళ్లు నిర్మించుకుంటారు కనుక ఝర్నియా(ఝరణ్ అంటే సెలయేరు)లని వ్యవహరిస్తారు. వీరి జీవనవిధానం, సంస్కృతి సంప్రదాయాలు విభిన్నమైనవి. వైవిధ్యంతో కూడుకున్నవి. ప్రకృతితో విడదీయరాని సంబంధం కలిగివున్నట్టివి. కొండవాలున పోడు వ్యవసాయం, జంతువుల, చేపల వేట, పండ్లు ఫలాల సేకరణ వీరి ఆర్థికవ్యవస్థలో ముఖ్యభాగం.మామిడి, పనస,అనాస, బత్తాయి, బొప్పాయి ఫలాలు అడవుల్లో విరివిగా లభిస్తాయి.మొన్నమొన్నటి వరకూ వీరికి బయటి మార్కెట్‌తో సంబంధమే ఉండేది కాదు. టీవీలు, బైక్‌లు,కార్లు, మొబైళ్లు తదితర ఆధునిక వస్తువులు వీరి ఇళ్లలో మచ్చుకైనా కనిపించవు. ప్రతి డోంగ్రియా గ్రామంలోనూ మండల్ (క్షిగామపెద్ద), జాని (పూజారి), బెజుని (మంవూతగాడు), బారిక్ (వార్తాహరుడు) ఉంటారు. వీరే గ్రామ వ్యవహారాలను చూసుకుంటారు. మాడ్‌గోండుల్లో లాగే వీరిలో కూడా గోటుల్ ఆచారం ఉంది. దాశాల (నివూదాశాల) గా పిలిచే ఈ కమ్యూనిటీ క్లబ్బులో పెళ్లికాని బాల బాలికలు, యువతీ యువకులూ సభ్యులుగా ఉంటారు. సభ్యుల్లో సీనియర్ అయిన ఓ అమ్మాయి లేదా అబ్బా యి దాశాలకు లీడర్లుగా వ్యవహరిస్తారు. వీరు జూనియర్లకు తెగ సంస్కృతి సంప్రదాయాలను, ఆచార వ్యవహారాలను, ఇతర లోక జ్ఞానాన్ని నేర్పుతారు.
పగలంతా తల్లిదంవూడులతోపాటు ఉండే పిల్లలు సాయం సమ యం కాగానే దాశాల వద్దకు చేరుతారు. గానా బజానా, ఆటపాటల్లో నిమగ్నమవుతారు. చివరకు అలసిపోయి ఏ రాత్రికో నిద్రిస్తారు. ఈక్రమంలో వయసు వచ్చిన యువతీ యువకుల మధ్య ప్రేమ ఏర్పడడం, సన్నిహితం కావడం అత్యంత సహజంగా జరుగుతుంది. ఇలా ఇష్టపడి ఒక్కటైన జంటలకు తెగపెద్దలు మాట్లాడి పెళ్లి చేస్తారు. అయి తే, ఒకే కుదురు/ఇంటిపేరు కలిగిన వారి మధ్య వివాహ సంబంధాలు నిషేధం. అలా గే ఇక్కడ వరకట్నం కాకుండా కన్యాశుల్కం పద్ధతి అమలులో ఉంది. వరుడే వధువు తండ్రికి నిర్ణీ త మొత్తంలో నగదు రూపేణా కానీ,వస్తువుల రూపేణా కానీ చెల్లిస్తాడు. డోంగ్రియాల వేషధారణ విచివూతంగా ఉంటుంది. పురుషులు పంచె, షర్టు ధరించగా,స్త్రీలు రంగురంగుల వస్త్రాలనేకం కలిపి కట్టుకుంటారు. స్త్రీ పురుషులిరువురూ ఆభరణాల ప్రియులే కావడం విశేషం. ముక్కుకు,చెవులకు,చేతుల కు, మెడలో ఇత్తడి, ఇండాలియం, స్టీలుతో చేసిన దండలు, కంటెలు, రింగులు, గాజులు, ముక్కుపుడకలు ధరిస్తారు. మగవాళ్లు సైతం ముక్కుపోగు పెట్టుకోవడం పెంచి క్లిప్పులు వాడడం, మెడలో దండలు వేసుకోవడం, పచ్చబొట్లు పొడిపించుకోవడం గమనార్హం.ఇక వీరి మతవిశ్వాసాలు కూడా భిన్నంగానే ఉంటాయి. వివిధ రకాల చెట్లు, జంతువుల రూపంలోనే వీరి దేవతలు ఉంటారు. పంటలు, ఫలాలు ఇచ్చే భూదేవత, ఆపదల నుంచి కాపాడే కొండదేవత ఇలా అనేక దేవతలను వీరు కొలుస్తారు. నియాం పేను (నియాం దేవుడు) ఈ తెగదైవం. ఈ నియాం పేను కొలువై ఉన్న కొండను సైతం మైనింగ్‌లో భాగంగా తవ్వేస్తారన్న విషయం డోంగ్రియాలను కలవరపరిచింది. (అవతార్ సినిమాలో సైతం ఇలాగే జరుగుతుంది)తమ ఇష్టదైవాన్ని రక్షించుకోవడానికి వాళ్లు ఏం చేయడానికైనా సిద్ధపడ్డారు.
విన్నవించారు..ఉద్యమించారు..కోర్టుకెళ్లారు..మేధావుల శరణుజొచ్చారు..చివరకు అవతార్ సినిమా తీసిన ప్రముఖ హాలివుడ్ దర్శకుడు, రచయిత జేమ్స్ కామెరాన్‌ను 'మీ అవతార్ సినిమా ఓ కల్పన కావచ్చు..కాని అది నిజం.. నియాంగిరి కొండల్లో డోంగ్రియా కోందు తెగ ప్రమాదంలో పడింది.వారి పవిత్ర పర్వతాన్ని మైనింగ్ పేరిట వేదాంత కంపెనీ సర్వనాశనం చేస్తోంది. మీరైనా కాపాడండి..!' అని విన్నవించారు.డోంగ్రియాలను ఆదుకోవడానికి దేవుడే దిగివస్తాడో లేక కామెరాన్ మరో సినిమా తీస్తాడో తెలియదు. కానీ భారత్‌లోని ప్రజాస్వామికశక్తుల ముందు మాత్రం ఓ కర్తవ్యం మిగిలివుంది. ప్రపంచీకరణ పేరిట అడవులను, సహజ వనరులను మింగేసే పాలకుల విధానాలను వ్యతిరేకించాలి.సహజ వనరులను రక్షించుకోవాలి. బహుళజాతి సంస్థలకు వ్యతిరేకంగా ఉద్యమిస్తున్న డోంగ్రియా కోందు మూలవాసులకు బాసటగా నిలవాలి.
డి మార్కండేయ