- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
టీఆర్ఎస్ నేత హత్యతో సంచలనం
దిశ, క్రైమ్ బ్యూరో : రాష్ట్రంలో పోలీసులకు, మావోయిస్టులకు మళ్లీ అంతర్యుద్ధం మొదలైంది. తెలంగాణ సరిహద్దు ప్రాంతంలో చోటు చేసుకున్న మూడు వేర్వేరు ఎన్‌కౌంటర్లలో ఎనిమిది మంది మావోయిస్టులు మరణించారు. మావోయిస్టులు సైతం ప్రజా కోర్టులు నిర్వహించి ఇన్ఫార్మర్లు, కోవర్టులు, రహస్య ఏజెంట్ల పేరుతో పలువురిని ఖతం చేశారు. మరో అడుగు ముందుకు వేసి రాజకీయ నాయకు లనూ టార్గెట్ చేస్తున్నారు.
ములుగు జిల్లా వెంకటాపురం మండలం నూగూరు (అలుబాక) గ్రామంలో టీఆర్ఎస్ నాయకుడు భీమేశ్వరరావును ఆదివారం ఇలాగే చంపేశారు. సరిగ్గా వారం రోజుల క్రితం డీజీపీ మహేందర్ రెడ్డి ఉన్నతస్థాయి సమావేశాన్ని నిర్వహించిన ప్రాంతానికి పది కిలోమీటర్ల దూరంలోనే మావోయిస్టులు టీఆర్ఎస్ నాయకుడిని హతమార్చడం పోలీసు వర్గాల్లో కలవరం సృష్టిస్తోంది.
పదేపదే చెప్పుకున్నా…
తెలంగాణలో గత పదేళ్లుగా తుపాకీ మోతలు లేవు. ఈ దశలో ఏజెన్సీ ఏరియాలో మళ్లీ అలజడి మొదలైంది. తెలంగాణలో నక్సల్స్ ఆనవాలు కూడా లేకుండా చేశామని పదే పదే చెప్పుకున్న నేపథ్యంలో మావోయిస్టుల కదలికలు పోలీసులకు సవాల్‌గా మారాయి. దీంతో భారీ స్థాయిలో మావోయిస్టుల ఏరివేతకు శ్రీకారం చుట్టారు. గత నెలలో ఉమ్మడి ఆదిలాబాద్, ములుగు, చర్ల ప్రాంతాలతోపాటు గోదావరి పరీవాహక సరిహద్దు ప్రాంతం అంతా డీజీపీ హెలిక్యాప్టర్ ద్వారా పర్యటించారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఐదు రోజులు మకాం వేశారు. స్థానిక పోలీసు అధికారులు, సిబ్బందిలో ఆత్మస్థైర్యం నింపి, సూచనలు, సలహాలు అందజేశారు.
ఇన్ఫార్మర్ల వ్యవస్థను మరింత పటిష్టం చేసుకోవాలని ఆదేశించారు. ఈ సమావేశం అనంతరం ఎన్‌కౌంటర్లో ఇద్దరు మా వోయిస్టులు మరణించారు. అంతకు ముందు రెండు సంఘటనలలో ఆరుగురు చనిపోయారు. డీజీపీ ఈ నెల నాలుగున ములుగు జిల్లా వెంకటాపురంలో పర్యటించారు. ఉన్నతస్థాయి పోలీసు అధికారులతోపాటు ఛత్తీస్ గఢ్ రాష్ట్రానికి చెందిన ప్రత్యేక పోలీసు అధికారులతోనూ సమావేశమయ్యారు. మావోయిస్టుల ఏరివేతకు జాయింట్ ఆపరేషన్ చేయాలని నిర్ణయించుకున్నారు.
చురుకుగా మావోయిస్టులు…
మావోయిస్టుల ప్రభావం విపరీతంగా ఉన్న సమయంలోనూ ఒక డీజీపీ స్థాయి అధికారి ఏజెన్సీ ఏరియాలో ఐదు రోజులు మకాం వేసిన సందర్భాలు లేవనే చెప్పాలి. ఒకే అంశంపై మూడు మార్లు పర్యటించిన దాఖలాలు కూడా లేవు. మావోయిస్టుల ఉనికే లేకుండా చేయాలని రెండు ప్రభుత్వాలు కంకణ బద్ధులై పనిచేస్తున్న తరుణంలో మావోయిస్టులు సైతం తమ ప్రాబల్యాన్ని చాటుకోవడం విశేషం. ప్రజలకు వ్యతిరేకంగా ఉంటున్నందున, పార్టీకి నష్టం చేస్తున్నందున 25 మందిని ప్రజా కోర్టులో శిక్షించినట్టు మావోయిస్టు పార్టీ దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ ఓ ప్రకటనలో తెలిపింది.
తాజాగా నూగూరు గ్రామానికి చెందిన టీఆర్ఎస్ నాయకుడు బీమేశ్వరరావు (బీసు) ను అర్థరాత్రి నేరుగా ఇంటికెళ్లి చంపడం యావత్తు రాష్ట్రమంతా హాట్ టాపిక్ గా మారింది. పలువురు నాయకులు అధికార పార్టీలో ఉంటూ ప్రజలను దోచుకుంటున్నారని, వెంటనే తమ పదవులకు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. లేదంటే, మిగతా వారికీ ఇదే గతి పడుతోందని ఓ లేఖను రాసి వదిలి వెళ్లడం సంచలనంగా మారింది. ఈ ప్రాంతాన్ని పూర్తి బందోబస్తులో ఉంచాలని నిర్ణయించినా, భీమేశ్వరరావు ఘటన పోలీసుల వైఫల్యాన్ని స్పష్టం చేస్తోంది.
మకాం మార్చుకోండి…
వెంకటాపురం మండలంలో జరిగిన ఘటనతో మరికొందరు అధికార పార్టీ నాయకులకు నక్సల్స్ టార్గెట్ ఉందని స్పష్టమవుతోంది. రాజకీయ నాయకులు రిమోట్ ఏరియాలో తిరగొద్దంటూ పోలీసులు చెబుతున్నారు. సర్పంచ్ స్థాయి నుంచి మంత్రిస్థాయి వరకూ జాగ్రత్తలు పాటించాలని కోరుతున్నారు. ఎలాంటి పర్యటనలు పెట్టుకోకపోవడమే మేలంటున్నారు. అత్యసరంగా ఏదైనా కార్యక్రమానికి వెళ్లాల్సి వస్తే.. పోలీసులకు సమాచారం అందిస్తే భద్రత కల్పిస్తామని అంటున్నారు. లేదంటే హైదరాబాద్ నగరానికి మకాం మార్చుకోవాలని హెచ్చరిస్తున్నారు. యుద్ధ వాతావరణాన్ని తలపిస్తున్నఈ తరుణంలో ఎప్పుడు ఏం జరుగుతుందో అంటూ ప్రజలు తీవ్ర భయాందోళనల మధ్య గడుపుతున్నారు.