జలంధర్ రెడ్డి అలియాస్ ‘మారన్న’ లొంగుబాటు..

by  |
జలంధర్ రెడ్డి అలియాస్ ‘మారన్న’ లొంగుబాటు..
X

దిశ, దుబ్బాక : అడవుల్లో ఉంటూ ప్రభుత్వాలపై పోరాడుతున్న మావోయిస్టులు జనజీవన స్రవంతిలో కలిసిపోవాలని పోలీసులు ఎప్పటినుంచో ప్రచారం చేస్తున్నారు. ఇప్పటికే పలువురు మావోయిస్టు నేతలు, మిలీషియా సభ్యులు లొంగుబాట పట్టడం తెలిసిందే. తాజాగా, ఆంధ్రా-ఒడిశా స్పెషల్ జోనల్ కమిటీ సభ్యుడు ముత్తంగిరి జలంధర్ రెడ్డి అలియాస్ మారన్న అలియాస్ కృష్ణ (40) ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ ఎదుట లొంగిపోయాడు. 2000 సంవత్సరంలో మావోయిస్టు పార్టీలో చేరిన జలంధర్ రెడ్డి ప్రస్తుతం స్పెషల్ జోన్ కమిటీ సభ్యుడిగా ఉన్నాడు. జలంధర్ రెడ్డి 19 ఎదురుకాల్పుల ఘటనల్లో పాల్గొన్నట్టు గుర్తించారు. గతంలో అతడిపై రూ.20 లక్షల రివార్డు ప్రకటించారు. లొంగిపోయిన జలంధర్ రెడ్డి అలియాస్ మారన్నను డీజీపీ గౌతమ్ సవాంగ్ మీడియా ఎదుట ప్రవేశపెట్టారు.

అతడి గురించి మీడియాకు వివరాలు తెలిపారు. జలంధర్ రెడ్డి స్వస్థలం తెలంగాణలోని సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండలం భూంపల్లి గ్రామం అని వివరించారు. మొదట మెదక్ డిస్ట్రిక్ట్ కమిటీలో చేరాడని, అనేక పోలీస్ స్టేషన్లపై జరిగిన దాడుల్లో జలంధర్ రెడ్డి అలియాస్ మారన్న కీలకంగా వ్యవహరించాడని తెలిపారు. 2008లో సంచలనం సృష్టించిన బలిమెల ఘటనలోనూ మారన్న పాత్ర ఉందని వెల్లడించారు. ఇక, జలంధర్ రెడ్డి అలియాస్ మారన్న మాట్లాడుతూ.. మావోయిస్టు పార్టీ మునుపటిలా లేదని, ప్రజాబలం కోల్పోయిందని పేర్కొన్నాడు. అందుకే తాను జనజీవనంలోకి వచ్చేయాలని నిర్ణయం తీసుకున్నానని చెప్పాడు. ప్రభుత్వం ప్రకటించిన నూతన లొంగుబాటు విధానం ఆకర్షణీయంగా ఉందని అన్నాడు.

ఇదే విషయమై జలంధర్ తల్లిదండ్రులను వివరణ కోరగా తమకు ముగ్గురు కొడుకులని అందులో చిన్న కొడుకు 20 సంత్సరాల క్రితం కాలేజీ చేస్తున్న సమయంలో చెప్పకుండా ఇంట్లో నుంచి కనిపించకుండా వెళ్లి పోయాడన్నారు. 20 సంవత్సరాల నుండి ఎప్పుడు వస్తాడో కొడుకు ఏనంగ వస్తాడో కొడుకు అని కళ్ళల్లో వత్తులేసుకుని చూసామని అన్నారు. ఇక వస్తాడో రాడో అనే బెంగతో ఉంటున్న సమయంలో ఈరోజు కొడుకు లొంగిపోయాడని టీవీ వార్తల్లో చూస్తే ఎంతో సంతోషంగా ఉందని ఆనందం వ్యక్తం చేశారు. చివరిరోజుల్లో కొడుకును చూసే అవకాశం దక్కించినందుకు పోలీసులకు, మీడియా వాళ్లకు జలంధర్ రెడ్డి అలియాస్ మారన్న తల్లిదండ్రులు ధన్యవాదములు తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed