మన్యంవాసులను చంపేస్తున్న వైరల్ ఫీవర్

by Sumithra |
మన్యంవాసులను చంపేస్తున్న వైరల్ ఫీవర్
X

దిశ, వాజేడు: వైరల్ ఫీవర్ మన్యంవాసులను వణికిస్తోంది. ఇంటికి ఒకరిద్దరి చొప్పున జ్వరంతో సతమతమవుతున్నారు. ములుగు జిల్లా వాజేడు మండలంలోని పేరూరు గ్రామంలో డెంగీ, మలేరియా వంటి విషజ్వరాలు విజృంభిస్తున్నాయి. ఒంట్లో కొంచెం సుస్తీగా ఉండడంతో ఆర్ఎంపీలను ఆశ్రయిస్తున్నారు. సకాలంలో సరైన వైద్యం అందకపోవడం, బ్లడ్ లో ప్లేట్ లెట్స్ తగ్గిపోవడంతో మృత్యువాతపడుతున్నారు. ఈ క్రమంలో నెలరోజుల క్రితం డెంగీ జ్వరంతో ఆరికిల్ల సమ్మయ్య అనే వ్యక్తి చనిపోయాడు. ఇదే గ్రామానికి చెందిన తిప్పనపల్లి అరవిందు(14) అనే బాలుడు రెండు రోజులుగా జ్వరంతో బాధపడుతూ ఆదివారం మృతిచెందాడు.

వరుసగా ఇలా జ్వరాలతో బాధపడుతూ చనిపోతుండడంతో పేరూరు గ్రామస్తులు భయాందోళనకు గురవుతున్నారు. ఇదే గ్రామంలో ఇంటికి ఒకరిద్దరు చొప్పున మంచంపట్టి మూలుగుతున్నారు. అవగాహన కల్పించేవారు లేకపోవడంతో బ్లడ్ లో ప్లేట్ లెట్స్ పడిపోయేదాకా ఆస్పత్రికి చూపించుకోవడం లేదు. మన్యం ప్రాంతంలోని గ్రామాల్లో వైద్యశిబిరాలు ఏర్పాటుచేసి డెంగీ, మలేరియా, చికునగున్యా, కరోనా వ్యాధులపై అవగాహన కల్పించడంతో పాటు ట్రీట్ మెంట్ అందించాలని స్థానికులు కోరుతున్నారు.

Advertisement

Next Story

Most Viewed