- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సీఎంకి తేల్చి చెప్పిన అధికారులు
దిశ, తెలంగాణ బ్యూరో:
దేశవ్యాప్తంగా మొక్కజొన్నలకు చాలా ప్రతికూల పరిస్థితులు ఉన్నాయని, ప్రస్తుత పరిస్థితుల్లో ఈ పంటను సాగుచేయడం ఏ మాత్రం శ్రేయస్కరం కాదని, అవసరానికి మించి దిగుబడి ఉన్నందున మార్కెట్‌లో కొనుగోళ్లు కూడా ఉండవని, ఎంఎస్‌పీ (కనీస మద్దతు ధర) వచ్చే పరిస్థితులు లేనే లేవని ముఖ్యమంత్రి కేసీఆర్‌కు వ్యవసాయ, మార్కెటింగ్ శాఖ అధికారులు స్పష్టం చేశారు. మక్కలను కొనడానికి ఇతర రాష్ట్రాల్లోని కోళ్ల వ్యాపారులు కూడా సిద్ధంగా లేరని, ఎట్టి పరిస్థితుల్లో మక్కల సాగు రైతుకు లాభదాయకం కాదని, నష్టం వచ్చినా పర్వాలేదనుకునే రైతులు మాత్రమే సాగు చేయాలని వీరు సీఎంకు వివరించారు.
సీఎం కేసీఆర్ వ్యవసాయ, మార్కెటింగ్ శాఖ అధికారులతో ప్రస్తుత సాగు విధానం, రానున్నకాలంలో వ్యవసాయ రంగంలో తీసుకోవాల్సిన చర్యలు తదితరాలపై ప్రగతి భవన్‌లో శనివారం సమీక్ష నిర్వహించిన సందర్భంగా మక్కల సాగుపై అధికారులు పై అంశాలను స్పష్టం చేశారు. ప్రస్తుతం దేశంలో అంతర్జాతీయ వాణిజ్య అవసరాలకు పోను సుమారు 28 కోట్ల టన్నుల నిల్వలున్నాయని, ఏటా మన దేశంలో వినియోగం కేవలం 2.42 కోట్ల టన్నులు మాత్రమేనని, కానీ, ఉత్పత్తి మాత్రం 3.53 కోట్ల టన్నుల మేర వస్తోందని వివరించారు. ఇక ఈ వానాకాలంలో దేశం మొత్తం మీద సుమారు 2.04 కోట్ల ఎకరాల్లో మక్కల సాగు ద్వారా 4.10 కోట్ల టన్నుల మేర అదనంగా మార్కెట్‌లోకి రానున్నదని, ఐదుంబావు కోట్ల టన్నుల మేర అవసరానికి మించి నిల్వ ఉంటుందని, మన వినియోగానికి రెండేండ్లకు ఇది సరిపోతుందని సీఎంకు వివరించారు.
పరిస్థితిని మరింత దిగజార్చనున్న కేంద్రం..
దేశంలోని పరిస్థితుల్లో ఇలా ఉంటే కేంద్ర ప్రభుత్వం విదేశాల నుంచి అదనంగా మరో 5 లక్షల టన్నుల మొక్కజొన్నలను దిగుమతి చేసుకోవాలని నిర్ణయం తీసుకుందని, ఇది పరిస్థితులను మరింత దిగజార్చిందని అధికారులు వివరించారు. మొక్కజొన్నలను దిగుమతి చేసుకునేటప్పుడు ప్రస్తుతం ఉన్న 50 శాతం దిగుమతి సుంకాన్ని 35 శాతం తగ్గించి కేవలం 15 శాతానికే పరిమితం చేసిందని, దీంతో మరింతగా మొక్కజొన్నలు దేశంలోకి వచ్చే ప్రమాదముందన్నారు. ఈ కారణంగా వివిధ రాష్ట్రాల్లోని మొక్కజొన్న పంటకు కనీస మద్దతు ధర లభించక రైతు తీవ్ర నష్టాల్లో కూరుకుపోయే ప్రమాదముందని వ్యవసాయరంగ, మార్కెటింగ్ శాఖ నిపుణులు సీఎంకు సూచించారు.
దిగుమతి సుంకాల తగ్గింపు..
కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలతో దేశంలో మొక్కజొన్న పంటకు కనీస మద్దతు ధర లభించే పరిస్థితులు లేకుండా పోయాయన్నారు. ‘ఎవరైనా ఎక్కడైనా పంటను అమ్ముకోవచ్చు కొనుక్కోవచ్చు’ అనే విధానాన్ని కేంద్ర ప్రభుత్వం ఇటీవల కొత్త వ్యవసాయ చట్టాల ద్వారా తీసుకొచ్చిందని, దీనికి తోడు వ్యవసాయ ఉత్పత్తులపై దిగుమతి సుంకాలను పెద్దఎత్తున తగ్గించడం, పేద రైతుల పాలిట శాపంగా పరిణమించిందన్నారు. తెలంగాణలోని మొక్కజొన్న రైతులకు సరైన ధర ఇప్పించే ఉద్దేశంతో ఇతర రాష్ట్రాల్లోని కోళ్ల పరిశ్రమ వ్యాపారులతో వ్యవసాయశాఖ చర్చలు జరిపినప్పుడు బిహార్, ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, కర్నాటక, రాజస్థాన్, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో కోళ్ల దాణా అతి తక్కువ రేటుకే దొరుకుతున్నందున, తెలంగాణ నుంచి మొక్కజొన్నలు కొనడానికి సుముఖంగా లేరని మంత్రి నిరంజన్ రెడ్డి సీఎంకు వివరించారు.
ఇలాంటి ప్రతికూల పరిస్థితుల్లో తెలంగాణ రైతాంగం యాసంగిలో మొక్కజొన్న సాగుచేస్తే తీవ్రంగా నష్టపోవాల్సి వస్తుందని అధికారులు అన్నారు. సమావేశంలో మంత్రులు నిరంజన్‌రెడ్డి, గంగుల కమలాకర్, ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్ శర్మ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, సీఎం ముఖ్యకార్యదర్శి నర్సింగరావు, కార్యదర్శి స్మితా సభర్వాల్, వ్యవసాయ శాఖ కార్యదర్శి జనార్ధన్ రెడ్డి, పౌర సరఫరాల శాఖ కమిషనర్ అనిల్ కుమార్, వ్యవసాయ యూనివర్సిటీ వీసీ ప్రవీణ్ రావు, పౌర సరఫరాల కార్పొరేషన్ చైర్మన్ మారెడ్డి శ్రీనివాస్ రెడ్డి, టెస్కాబ్ చైర్మన్ కొండూరి రవీందర్‌రావు, మార్కెటింగ్ డైరెక్టర్ లక్ష్మీబాయి పాల్గొన్నారు.