కరోనాపై సర్కారు చర్యలను ప్రశ్నిస్తే.. అరెస్టులు

by Shyam |
కరోనాపై సర్కారు చర్యలను ప్రశ్నిస్తే.. అరెస్టులు
X

గవహతి: కరోనా సంక్షోభ కాలంలో ప్రభుత్వ చర్యలను ప్రశ్నిస్తే.. ఆ రాష్ట్ర సర్కారు సహించడం లేదు. ప్రశ్నించినవారిపై మణిపూర్ సర్కారు ఉక్కుపాదం మోపుతున్నది. ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై ప్రశ్నలు, సూచనలు చేసినా.. సీఎంపై వ్యాఖ్యలు చేసినా.. అరెస్టులకు పాల్పడుతున్నది. ఇప్పటి వరకు మణిపూర్ సర్కారు సుమారు ఐదుగురిని అదుపులోకి తీసుకున్నది. అంతెందుకు సీఎంపై కామెంట్ చేశారని ఉపముఖ్యమంత్రిపైనే వేటుపడింది.

కరోనా వ్యాప్తిని అడ్డుకునేందుకు విధించిన లాక్‌డౌన్ కాలంలో రాష్ట్ర ప్రజలందరికి ఆహారాన్ని సరఫరా చేస్తామన్న సీఎం బిరెన్ సింగ్ హామీపై డిప్యూటీ సీఎం జాయ్‌కుమార్ ఆయన వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేశారు. సీఎం హామీ నాన్‌సెన్స్ అని చేసిన కామెంట్‌తో జాయ్ కుమార్ తన కుర్చీ కిందికే నీళ్లు తెచ్చుకున్నాడు. ఏప్రిల్ 9న తనకు కేటాయించిన పోర్ట్‌ఫోలియోలన్నీ రద్దు చేస్తున్నట్టు ప్రభుత్వం ఆదేశించింది. నేషనల్ పీపుల్స్ పార్టీకి చెందిన జాయ్ కుమారి ఇది బీజేపీ కుట్ర అని ఆరోపించారు. బీజేపీ నేతలే తనతో అలా అనిపించేలా రెచ్చగొట్టారని అన్నారు. మణిపూర్‌లో బీజేపీ, నేషనల్ పీపుల్స్ పార్టీ పొత్తుపెట్టుకున్న విషయం తెలిసిందే. అయితే, ఈ వైఖరికి ఇక్కడితో ఆగిపోలేదు. రాష్ట్ర ప్రభుత్వాన్ని ముఖ్యంగా సీఎంపై వివాదాస్పద వైఖరి.. వ్యాఖ్యలు చేసిన కనీసం ఐదుగురిని రెండు వారాల్లో మణిపూర్ పోలీసులు అరెస్టు చేశారు.

ప్రెస్ రిలీజ్ చేసినందుకు అరెస్టు..

రాష్ట్ర రాజధాని ఇంఫాల్ శివారులో సాగుభూమిలో క్వారంటైన్ కేంద్రాన్ని నిర్మించాలనుకుంటున్న సర్కారు నిర్ణయాన్ని మానవ హక్కుల పరిరక్షణ కోసం పాటుపడే ఓ యూత్ ఫోరం మీడియాకు ఒక ప్రకటన విడుదల చేసింది. కొన్ని గంటల తర్వాతే హక్కుల కార్యకర్త తాఖెంచాంగ్‌బామ్ షదీష్కంతను పోలీసులు అదుపులోకి తీసుకుని అరెస్టు చేశారు. సాగు భూమి బదులు సమీపంలోని విమానాలకు సంబంధించిన స్థలాన్ని(ఎయిర్ స్ట్రిప్) వినియోగించుకోవాలని సూచించారు. ఈ ప్రకటన తర్వాత షదీష్కంతను ఏప్రిల్ 1న పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తర్వాతి రోజు ఆ సంస్థ అధ్యక్షుడు ఫజాటాన్ మాన్‌గంగ్‌నూ పోలీసులు స్టేషన్‌కు తీసుకెళ్లారు. ఆ ఎయిర్ స్ట్రిప్ డిఫెన్స్‌కు చెందినదని, డిఫెన్స్ సైట్ల గురించి ఎవ్వరికీ మాట్లాడే హక్కులుండవని ఈస్ట్ ఇంఫాల్ పోలీస్ చీఫ్ జోగేశ్చంద్ర హావోబిజం చెప్పారు.

చిక్కు తెచ్చిన ఫేస్‌బుక్ పోస్టు..

సీఎం కొవిడ్ 19 రిలీఫ్ ఫండ్‌కు ముఖ్యమంత్రి బిరెన్ సింగ్ ఎంత విరాళమిచ్చాడో ఎవరికైనా తెలుసా? అని ఇంఫాల్‌లో ప్రభుత్వ కాలేజీలో పనిచేస్తున్న విక్టర్ సింగ్ ఫేస్‌బుక్‌లో పోస్టు పెట్టాడు. దీంతో ఏప్రిల్ 1వ తేదీని అతన్ని పోలీసు స్టేషన్‌కు తీసుకెళ్లి రాత్రంతా అక్కడే ఉంచుకుని ఉదయం విడుదల చేశారు. తర్వాత పోలీసుల ఒత్తిడితో.. ఫేస్‌బుక్‌లో మరో అప్‌డేట్ పెట్టాడు. సీఎంపై తనకు ఎలాంటి తప్పుడు ఉద్దేశ్యాలు లేవని పేర్కొంటూ.. క్రితం పోస్టును డిలీట్ చేస్తునట్టు పోస్టు చేశాడు.

ఏప్రిల్ 3న మరో మానవ హక్కుల కార్యకర్త దేబాబ్రత రాయ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆయన ఫేస్‌బుక్‌లో షేర్ చేసిన పోస్టుపై ప్రశ్నించారు. కరోనా కష్టకాలంలో సీఎం వ్యక్తిగత రాజకీయాలు, కుట్ర కోసం సమయాన్ని, వనరులను వృథా చేయరాదని, అలా చేస్తే ఆ స్థాయి పదవికి తగదని పోస్టులో రాయ్ పేర్కొన్నారు. అనంతరం అదుపులోకి తీసుకున్న రాయ్‌తో.. సీఎంకు క్షమాపణలు చెబుతున్న వీడియోను చిత్రీకరించి పోలీసులు అతన్ని వదిలిపెట్టారు.

మణిపూర్‌కు చెందిన పీహెచ్‌డీ స్కాలర్ మొహమ్మద్ చింగిజ్ ఖాన్ పేరుతో ఓ పత్రికలో వ్యాసం ప్రచురితమైంది. ఈ వ్యాసం రెచ్చగొట్టేలా ఉన్నదన్న అభియోగాలతో అతన్ని పోలీసులు అరెస్టుచేశారు. గతేడాది ది పయనీర్‌లో రాసిన వ్యాసాన్ని ఇప్పుడు తాజాగా ఓ పత్రికలో అనువాదం చేసి వాడుకున్నారని, అందులోని టైటిల్ కూడా ఖాన్ పెట్టలేదని అతని బంధువులు చెప్పారు. ఈ పరిణామాలతో జర్నలిస్టుల్లోనూ సర్కారు తీరును ప్రశ్నించేందుకు భయాందోళనలకు గురవుతున్నారు. ఇప్పటికే సీఎం బిరెన్ సింగ్, ప్రధాని మోడీని విమర్శించుకుంటూ జర్నలిస్టు కిశోర్‌చంద్ర వాంగ్‌ఖేమ్‌ను జాతీయ భద్రత చట్టం కింద అరెస్టు చేయడంతోనే ఈ భయాలు పెరిగినట్టు మణిపూర్‌ జర్నలిస్టులు చెబుతున్నారు.

Tags: manipur, detained, arrests, question, covid 19, handling

Advertisement

Next Story

Most Viewed