ధిం ధిం ధిమ్మారే.. ధూంధాం మేడారం

by Shamantha N |
ధిం ధిం ధిమ్మారే.. ధూంధాం మేడారం
X

సియా ఖండంలోనే అతిపెద్ద గిరిజన జాతర విశిష్టతను తెలిపే పాట ‘ధిం ధిం ధిమ్మారే ధిం ధిం ధిమ్మారే దిమ్మతిరిగిపోయే దరువే మారోరే.. మేడారం కుంభమేళా దేఖోరే’ అంటూ ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రమంతా మారుమోగుతోంది. తనకే సొంతమైన పల్లె గొంతుతో జానపదాలను సైతం సినీ పాటలతోపాటు పోటీలో నిలబెడుతున్న ‘మంగ్లీ’ మరోసారి ఈ పాటతో మ్యాజిక్ చేసింది. తనేకాక ఇటీవలే సంక్రాంతి పాటతో వెలుగులోకొచ్చిన అచ్చమైన తెలంగాణ పల్లెగొంతు ‘కనకవ్వ’ ఈ పాటలో అణువణువునా సహజత్వాన్ని నింపింది.

ఆదివాసీ అమరుల జాతర గురించి అందమైన పల్లె పదాల్లో.. మూలవాసుల మన్యం జాతర గురించి ముచ్చటగొల్పే రీతిన చిత్రీకరించిన ‘మేడారం జాతర’ పాట వింటే జాతరకు పోవాలనే ఉత్సాహం రెట్టింపవుతోంది. సమ్మక్క, సారలమ్మల వీరత్వాన్ని తెలుపుతూనే.. వనదేవతలుగా భక్తుల కోరికలను తీర్చడంలో ఆ తల్లీబిడ్డల ప్రత్యేకతను చాటిచెబుతోంది ఈ పాట. జాతర దారిలో భక్తుల కాళ్లను కడిగే చెలిమెలు, అలసట తెలియని చెట్ల నీడలు.. కొండకోనల్లో డోలు దెబ్బలు, ధింసా గుస్సాడి నృత్యాల గురించి వివరిస్తూ సమాచారంతోపాటు సంబురాన్నీ తనలోనే నింపుకుంది.. ఈ పాట ఎటువంటి కృత్రిమ హంగులకు తావు లేకుండా పిల్లపాపలు, కోడిపిల్లలతో తెలంగాణ ప్రజలు జాతరకు పోయే తీరును కండ్లకు కట్టినట్టు తీర్చిదిద్దారు.

ఇదేకాక ఇలాంటి ఎన్నో పాటలతో తెలంగాణ సాహిత్య కుసుమాలు సామాజిక మాధ్యమాల ద్వారా తమ విస్తృతిని పెంచుకుంటూ ఈ నేల మట్టి పరిమళాలను యూట్యూబ్ వేదికగా నలుదిక్కులా వెదజల్లుతూ తెలంగాణ పాటకు పబ్బతి పడుతున్నారు. యశ్‌పాల్ రాసిన ఈ మేడారం జాతర పాటకు చరణ్ అర్జున్ స్వరకల్పన చేయగా.. మంగ్లీ, కనకవ్వ, చరణ్ అర్జున్‌లు గాత్రమందించారు. కాగా దాము రెడ్డి దర్శకత్వం, అప్పి రెడ్డి నిర్మాణంలో మైక్ టీవీ ద్వారా ఇటీవలే విడుదలైన ఈ పాట యూట్యూబ్‌లో ఇతర జాతర పాటలను తోసిరాజని అత్యధిక వ్యూస్‌తో దూసుకుపోతోంది.

Advertisement

Next Story

Most Viewed