టీ20 వరల్డ్ కప్ కోసం టీమిండియా భారీ ప్లాన్

by Anukaran |
టీ20 వరల్డ్ కప్ కోసం టీమిండియా భారీ ప్లాన్
X

దిశ, స్పోర్ట్స్ : టీమ్ ఇండియా మేనేజ్‌మెంట్ ఇంగ్లాండ్ సిరీస్‌ను ఎలా వాడుకోవాలనుకున్నదో.. అలాగే ఉపయోగించి తమ అనుమానాలను తీర్చేసుకుంది. రెగ్యులర్ క్రికెటర్లు జట్టులో లేకపోయినా.. వారి స్థానంలో ఎవరిని ఆడిస్తే జట్టుకు ఉపయోగంగా ఉంటుందో తెలుసుకుంది. ఓపెనింగ్ జోడీని మారిస్తే వచ్చే ఫలితాలు ఎలా ఉంటాయో కూడా చూసింది. స్వదేశంలో జరుగనున్న టీ20 వరల్డ్ కప్ కోసం జట్టును ఎంపిక చేయడానికి ఈ సిరీస్‌ను ఉపయోగించుకుంటామని బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాథోడ్ సిరీస్‌కు ముందే చెప్పాడు. కీలక బౌలర్లు బుమ్రా, షమి లేరు.. మరోవైపు ఆల్‌రౌండర్ జడేజా గైర్హాజరీలో కూడా భారత జట్టు విజయాలు సాధించింది. ఓపెనింగ్ జోడీని పలుమార్లు మార్చి ప్రయోగాలు చేసింది. అవసరమైతే కెప్టెన్ కోహ్లీ కూడా ఓపెనర్‌గా రాణించగలడనే సమాధానం దొరికింది. అన్ని రకాల ప్రయోగాలకు అహ్మదాబాద్‌ను వేదికగా చేసుకుంది.

బ్యాటింగ్ ప్రయోగాలు..

ఇంగ్లాండ్‌తో జరిగిన టీ20 సిరీస్‌లో టీమ్ ఇండియా ఓపెనింగ్ జోడీ దారుణంగా విఫలమైంది. ఐదు మ్యాచ్‌లలో నాలుగు విభిన్న జోడీలను మేనేజ్‌మెంట్ పరిశీలించింది. తొలి టీ20లో రాహుల్-ధావన్, రెండో టీ20లో రాహుల్-కిషన్, మూడు, నాలుగవ టీ20లో రాహుల్-రోహిత్ కాంబినేషన్‌ను పరీక్షించింది. కేఎల్ రాహుల్ ఈ సిరీస్‌లో దారుణంగా విఫలమవడంతో చివరి టీ20కి అతడిని పక్కన పెట్టింది. బ్యాట్స్‌మాన్‌ను పక్కన పెట్టి.. సీమర్‌ను తుది జట్టులోకి తీసుకొని అందరినీ ఆశ్చర్యపరిచింది. అసలు ఎవరు ఓపెనింగ్ చేస్తారనే ఉత్కంఠత నడుమ రోహిత్‌తో కలసి కోహ్లీ ఓపెనింగ్ చేశాడు.

టీమ్ వ్యూహం ప్రకారం ఈ జోడీ 94 పరుగులు జోడించింది. అంటే రెగ్యులర్ ఓపెనర్లు విఫలమైనా కోహ్లీ ఆ బాధ్యతలు అందుకోవడానికి సిద్దంగా ఉన్నట్లు చెప్పేశాడు. ఇండియా టాప్ ఆర్డర్ చెలరేగితే మిడిల్ ఆర్డర్‌తో కూడా పని ఉండదు. అయినా అక్కడ శ్రేయస్ అయ్యర్, రిషబ్ పంత్ ఉండటం భారత జట్టు బ్యాటింగ్ బలాన్ని పెంచుతున్నది. ఒక వేళ ఇషాన్ కిషన్ ఓపెనింగ్ చేస్తే జట్టు బలం మరింతగా పెరుగుతున్నది. నెంబర్ 1 నుంచి 6 వరకు అందరూ మంచి ఫామ్‌లో ఉన్నారు.

అయితే లోయర్ మిడిల్ ఆర్డర్‌లో హార్దిక్ పాండ్యాతో పాటు రవీంద్ర జడేజా వంటి ఆల్‌రౌండర్ ఉంటే జట్టుకు మరింత మేలు జరుగుతున్నది. వాషింగ్టన్ సుందర్ టెస్టుల్లో నిరూపించుకున్నా.. టీ20 సిరీస్‌లో విఫలమయ్యాడు. బంతితో, బ్యాటుతో మెరుపులు మెరిపించలేకపోయాడు. రవీంద్ర జడేజా లేని లోటు మాత్రం ఇక్కడ తెలిసిపోయింది. ధావన్, కేఎల్ రాహుల్ ఫామ్‌లోకి రాకపోయినా.. ఇషాన్ కిషన్, సూర్యకుమార్ వంటి బ్యాకప్ టీమ్ ఇండియాకు కలసి వస్తున్నది.

బౌలింగే కీలకం..

టీ20లో వికెట్లు తీయడం ఎంత అవసరమో.. డాట్ బాల్స్ వేయడం అంత కీలకం. పరుగులు ఇవ్వకుండా కట్టడి చేయడం వల్ల ప్రత్యర్థి జట్టుపై ఒత్తిడి పెంచే అవకాశం ఉంటుంది. ఎప్పుడైతే పరుగులు రావడం కష్టమవుతుందో అప్పుడు వికెట్లు వాటంతట అవే వస్తాయి. 5వ టీ20లో భువనేశ్వర్ బౌలింగ్ గమనిస్తే అదే అర్దం అవుతున్నది. పరుగులు ఇవ్వకుండా కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో.. అతడిపై ఎటాక్ చేయబోయి జాస్ బట్లర్ వికెట్ పారేసుకున్నాడు. శార్దుల్, వాషింగ్టన్ సుందర్‌లు ధారాళంగా పరుగులు ఇస్తుండటంతో బ్యాట్స్‌మెన్ వారినే లక్ష్యంగా చేసుకుంటున్నారు. 4, 5వ టీ20లో లక్ష్యం భారీగా ఉండటం వల్ల శార్దుల్ ఠాకూర్ పరుగులు ఇచ్చినా.. విజయం సాధించగలిగాము. కానీ అన్ని సందర్భాల్లో అలా ఉండదు.

టీ20 స్పెషలిస్ట్‌లు అయిన బుమ్రా, షమీ, రవీంద్ర జడేజాలు భువనేశ్వర్‌కు తోడైతే ప్రత్యర్థులకు హడలే. అదే సమయంలో శార్దుల్, దీపక్ చాహర్, నటరాజన్, నవదీప్ సైనీ, మహ్మద్ సిరాజ్‌లు బ్యాకప్‌లో సిద్దంగా ఉన్నారు. ఒకరు విఫలమైనా మరొకరితో బౌలింగ్ బెంచ్ కట్టుదిట్టంగా ఉన్నది. కుల్దీప్, చాహల్ ఈ మధ్య పెద్దగా ప్రభావం చూపడం లేదు. అయితే యువ స్పిన్నర్ రాహుల్ చాహర్ అంచనాల మేరకు రాణించడం శుభపరిమాణం. టీ20లో ఒక స్పెషలిస్ట్ స్పిన్నర్, రవీంద్ర జడేజా ఉంటే అదనపు సీమర్‌ను తీసుకోవడానికి అవకాశం ఉంటుంది.

ఈ ప్రయోగాలన్నీ ఇంగ్లాండ్ సిరీస్‌లో చేశారు. టీ20 వరల్డ్ కప్ వరకు టీమ్ ఇండియా ఎలాంటి అంతర్జాతీయ టీ20 మ్యాచ్‌లు ఆడటం లేదు. రెండు ద్వైపాక్షిక సిరీస్‌ల కోసం బీసీసీఐ న్యూజీలాండ్, దక్షిణాఫ్రికా బోర్డులతో మంతనాలు జరుపుతున్నది. వాటికి గ్రీన్ సిగ్నల్ ఇస్తే.. టీమ్ మేనేజ్‌మెంట్ మరిన్ని ప్రయోగాలు చేసే అవకాశం ఉన్నది. ప్రస్తుతానికైతే ఇంగ్లాండ్ సిరీస్‌లో ఆడిన జట్టే టీ20 వరల్డ్ కప్ కూడా ఆడే అవకాశం ఉన్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed