కొడుకును విడిచిపెట్టాలని స్టేషన్‌లో తండ్రి సూసైడ్ అటెంప్ట్

by Sumithra |
కొడుకును విడిచిపెట్టాలని స్టేషన్‌లో తండ్రి సూసైడ్ అటెంప్ట్
X

దిశ, ఆర్మూర్: మాక్లూర్ పోలీసు స్టేషన్‌లో ఓ వ్యక్తి ఆత్మహత్యకు యత్నించాడు. పోలీసు స్టేషన్ పరిధిలోని రాంచంద్రాపల్లి గ్రామానికి చెందిన దొడ్డిండ్ల పోశెట్టి కుటుంబానికి, అదే గ్రామానికి చెందిన కట్కం శంకర్ కుటుంబానికి మధ్య కొన్నేళ్లుగా తగాదాలున్నాయి. ఓ స్థలం విషయంలో ఇరు కుటుంబాలకు సంబంధించిన కేసు కోర్టులో పెండింగ్‌లో ఉంది. కేసు పరిష్కారమయ్యే వరకు సదరు వివాదాస్పద స్థలంలో ఇరు వర్గాల వారు ఎలాంటి పనులు చేయవద్దని హెచ్చరికలు ఉన్నాయి. అయినప్పటికీ కట్కం శంకర్ కుమారుడు కట్కం తిరుపతి.. సదరు స్థలంలో సిమెంట్ వర్క్ చేస్తుండగా దొడ్డిండ్ల పోశెట్టి తన సెల్ ఫోన్‌లో వీడియో తీశాడు.

ఇది గమనించిన తిరుపతి కోపంగా వచ్చి పోశెట్టితో గొడవకు దిగాడు. సెల్ ఫోన్ లాక్కొని వెళ్లిపోతుండగా, పోశెట్టి కొడుకు అరవింద్ వారించాడు. విషయం పోలీసుల దాకా వెళ్లింది. పోలీసులు అరవింద్‌ను ఠాణాకు తీసుకెళ్లారు. ఇది తెలిసుకున్న పోశెట్టి పోలీసు స్టేషన్‌కు వెళ్లి తన కొడుకును ఎందుకు తీసుకొచ్చారని ప్రశ్నించాడు. తన కొడుకును ఇంటికి పంపించాలని లేకపోతే తాను చనిపోతానంటూ వెంట తెచ్చుకున్న కలుపు నివారణ మందు తాగేశాడు. దీంతో ఎస్సై రాజారెడ్డి పోలీసు వాహనంలో పోశెట్టిని జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ దవాఖానకు తరలించారు. ప్రస్తుతం పోశెట్టికి ప్రాణాపాయం ఏమీ లేదని, కోలుకుంటున్నాడని వైద్యులు చెప్పారని గ్రామస్తులు తెలిపారు.

Advertisement

Next Story