కారు ఆపినందుకు ఏఎస్ఐ చేతిని నరికేశారు

by Shamantha N |
కారు ఆపినందుకు ఏఎస్ఐ చేతిని నరికేశారు
X

ఛండీగడ్: పంజాబ్‌లో దారుణం జరిగింది. లాక్‌డౌన్ నిబంధనలు అమలు చేస్తూ డ్యూటీలో ఉన్న పోలీసులపై కొందరు వ్యక్తులు దాడులకు తెగబడ్డారు. పటియాలా జిల్లాలోని సనార్ సమీప కూరగాయల మార్కెట్ దగ్గర ఈ రోజు ఉదయం ఈ ఘటన చోటుచేసుకుంది. మార్కెట్ దగ్గర గేట్లు, బారికేడ్లు అడ్డంగా పెట్టి పోలీసులు.. వాహనాదారుల నుంచి లాక్‌డౌన్ పాస్‌లను తనిఖీ చేస్తూ పంపిస్తున్నారు. ఈ క్రమంలోనే నలుగురు నుంచి ఐదుగురు ప్రయాణిస్తున్న కారును ఆపి పాస్‌లకోసం అడిగారు పోలీసులు. కానీ, వారు పాస్‌లు చూపించకపోవడమే కాదు.. ఎదురుగా పెట్టిన బారికేడ్లను ఢీకొట్టారు. కారు ఆపి కిందికి దిగి వీరంగం సృష్టించారు. సాంప్రదాయ ఆయుధాలతో పోలీసులపై దాడి చేశారు. ఓ ఏఎస్ఐ చేతిని నరికేశారు. మరో ఆరుగురు పోలీసులను గాయపరిచారు. అనంతరం అక్కడి నుంచి పరారయ్యారు. కిచ్రి సాహిబ్ గురుద్వారాలోకి వెళ్లి తలదాచుకునే ప్రయత్నం చేశారు. లోపల నుంచి తుపాకీ పేలిన శబ్దం రావడంతో వారి వెంటే వచ్చిన పోలీసులు అప్రమత్తమై గురుద్వారాలోనికి ఎంటర్ అయ్యారు. అనంతరం అక్కడి నుంచి ఒక మహిళ సహా తొమ్మిది మందిని పోలీసులు అరెస్టు చేశారు. ఆ గ్రామ పెద్దలతో సంప్రదించి గురుద్వారా పరిసరాల్లోని ఇళ్లల్లో ఆయుధాలున్నాయోమోనని పోలీసులు తనిఖీలు చేశారు. కాగా, కొన్ని కత్తులు, అక్రమ ఆయుధాలు, పెట్రోల్ బాంబులు, కార్ట్‌రిడ్జులను స్వాధీనం చేసుకున్నట్టు పోలీసులు వివరించారు. అంతేకాదు, ఆరు కిలోల ‘భాంగ్’ స్వాధీనం చేసుకున్నట్టు పటియాలా ఐజీ జతిందర్ ఔలాఖ్ తెలిపారు.

Tags: punjab, chopped off, police, group, nihangs, crime, lockdown, passes, gurdwara, bhang

Advertisement

Next Story

Most Viewed