నడిగడ్డలో కరోనా కలవరం?

by vinod kumar |   ( Updated:2020-04-24 03:52:23.0  )
నడిగడ్డలో కరోనా కలవరం?
X

దిశ, మహబూబ్ నగర్: పకడ్బందీ చర్యలు చేపట్టినా ప్రజాప్రతినిధులకు, జర్నలిస్టులకు కూడా కరోనా సోకడంతో నడిగడ్డ అధికారులు, ప్రజాప్రతినిధుల్లో భయం మొదలైంది. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో భాగమైన మహబూబ్‌నగర్‌లో 11 కేసులు, వనపర్తి-0, నాగర్ కర్నూల్ లో -2, నారాయణపేట -1 కేసు నమోదయ్యాయి. కానీ, జోగుళాంబ గద్వాల జిల్లాలో కరోనా కేసుల సంఖ్య 45కు చేరింది. సరిగ్గా నెల రోజుల క్రితం ఒకే ఒక్క కరోనా కేసు నిర్ధారణ అయ్యింది. మర్కజ్ ఘటనతో జిల్లాలో బయటపడిన కరోనా కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతూ వస్తోంది. జిల్లాలో ఇప్పటికే కరోనా బారిన పడి ఇద్దరు మృత్యువాత పడగా నలుగురు కోలుకుని ఇళ్ళకు చేరుకున్నారు. ఇంకా 38 మంది గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన జాబితాలో రెడ్ జోన్‌లో గద్వాల ప్రాంతం ఉన్న నేపథ్యంలో జిల్లాలో కరోనా ప్రభావిత ప్రాంతాలను గుర్తించి ప్రజలు ఎవ్వరూ బయటకు రాకుండా అధికారులు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నారు. అదే సమయంలో పలువురు ప్రజాప్రతినిధులను కూడా అధికారులు హోంక్వారెంటైన్ చేశారు. కరోనా ప్రభావం కొంత తగ్గుముఖం పడుతుందనుకుంటున్న సమయంలోనే ఒక మాజీ కౌన్సిలర్ అంత్యక్రియలు జరిగిన ఘటన జిల్లాలోమరోమారు బాధితులు పెరగడానికి కారణమైంది. ఈ ఘటన తరువాత సుమారు 20 మంది వరకు బాధితుల సంఖ్య పెరగడం పలు అనుమానాలకు తావిస్తోన్నది. ముందు నుండే వీరికి కరోనా సోకిందా లేక ఇక్కడి నుంచే దీని ప్రభావం పెరిగిందా అనే విషయంపై అధికారులు ఎటూ తేల్చలేకపోతున్నారు.

ఒకే కుటుంబానికి చెందినవారు..

గడిచిన మూడు రోజుల్లో గద్వాలలో ఏకంగా 14 కేసులు నమోదు అవ్వగా ఒక గురువారం నాడే 10 కేసులు నమోదు కావడం గమనార్హం. వీరిలో ఐదుగురు ఒకే కుటుంబానికి చెందిన వారు కాగా అందులో ముగ్గురు 10 సంవత్సరాల లోపు పిల్లలు ఉండడం ఆందోళన కలిగిస్తున్న విషయం. జిల్లా ప్రభుత్వ ఆసుప్రతిలో పనిచేస్తున్న ల్యాబ్ టెక్నీషియన్‌తోపాటు ఒక జర్నలిస్ట్‌కు కూడా కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. దీంతో ప్రస్తుతం ఈ ల్యాబ్ టెక్నీషియన్ కుటుంబ సభ్యులతోపాటు జర్నలిస్ట్ కుటుంబ సభ్యులను అధికారులు క్వారెంటైన్‌కు తరలించారు. మరో ఆరుగురు జర్నలిస్టులను కూడా క్వారెంటైన్‌కు తరలించిన విషయం తెలిసిందే. అదే సమయంలో వీరు గడిచిన వారం రోజులుగా ఎవ్వరెవ్వరిని కలిశారు.. ఎక్కడెక్కడా తిరిగారు.. ఇలా అనేక విషయాలపై అధికారులు ఆరా తీస్తున్నారు. ఇప్పటి వరకు నమోదైన కేసుల విషయాలను పరిశీలిస్తే గద్వాల పట్టణంలోనే 30 కేసులు నమోదు అవ్వగా అయిజ మండలంలో 6 కేసులు, రాజోళిలో 4, శాంతినగర్ లో 3, అలంపూర్ లో 1 కేసు నమోదు అయినట్లు అధికారుల లెక్కలు చెబుతున్నాయి.

బార్బర్‌కు కరోనా అని తేలడంతో…

తాజా ఘటనలో ఒక బార్బర్ కూడా కరోనా పాజిటివ్ అని తేలడంతో అతని షాపులో కటింగ్ చేయించుకున్న వారందరిలో భయం మొదలైంది. మర్కజ్ వెళ్ళి వచ్చిన వారికి కటింగ్ చేయడం వల్ల అతనికి కరోనా సోకిందని అధికారులు గుర్తించారు. ఇతని నుండి ఎవ్వరెవ్వరికి సోకిందోనని తెలుసుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. జిల్లాలో కరోనా నియంత్రణ కోసం ఉమ్మడి జిల్లా కలెక్టర్ గా పనిచేసిన రోనాల్డ్ రోస్‌ను రాష్ట్ర ప్రభుత్వం గద్వాలకు ప్రత్యేక అధికారిగా నియమించింది. గడిచిన రెండు రోజులుగా ఆయన జిల్లాలో మొదటి నుంచి చోటుచేసుకున్న పరిస్థితులపై అధ్యయనం చేస్తూ అధికారులను సమన్వయం చేస్తున్నారు. మర్కజ్ ఘటనతోపాటు సరిహద్దు ప్రాంతమైన కర్నూల్ జిల్లాకు చెందిన పలువురు వైద్యం నిమిత్తం ఈ ప్రాంతానికి రావడం వల్లే కరోనా జిల్లాలో విస్తరించడానికి ప్రధాన కారణంగా అధికారులు భావిస్తున్నారు. దీంతో జిల్లాకు వచ్చే అన్ని దారులను మూసేశారు.

Tags: mahabubnagar, corona, journalists, politicians, officers

Advertisement

Next Story

Most Viewed