మధ్యప్రదేశ్ సంక్షోభం..కాంగ్రెస్ స్వయం కృతాపరాధం!

by Shamantha N |   ( Updated:2020-03-11 00:57:19.0  )
మధ్యప్రదేశ్ సంక్షోభం..కాంగ్రెస్ స్వయం కృతాపరాధం!
X

మధ్యప్రదేశ్‌లోని కాంగ్రెస్ ప్రభుత్వం సంక్షోభంలో కూరుకుపోయింది. ఇప్పటికే ఆ పార్టీ ఎమ్మెల్యేలు 21 మంది రాజీనామా చేశారు. మరో నలుగురు కూడా రాజీనామా చేసే ఆలోచనలో ఉన్నట్టు సమాచారం. వీరంతా యువనేత జ్యోతిరాదిత్య సింధియా మద్దతుదారులు. ఆయన కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన మరుక్షణమే ఆ ఎమ్మెల్యేలు కూడా రాజీనామా బాటపట్టారు. ఈ పరిణామాలతో మధ్యప్రదేశ్ ప్రభుత్వం అస్థిరతకు లోనైంది. ఇందుకు ప్రధాన కారణం కాంగ్రెస్ పార్టీ స్వయంకృతాపరాధం అని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. యువనేత సింధియాను పట్టించుకోకపోవడం..సీఎం కమల్‌నాథ్, మాజీ సీఎం దిగ్విజయ్‌సింగ్‌లు కలసి ఆయన్ని రాజకీయంగా అణచివేయడానికి ప్రయత్నించడం ప్రస్తుత స్థితికి కారణంగా తెలుస్తోంది.

2018, నవంబర్‌లో మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. నాలుగుసార్లు ఎంపీ, కేంద్ర మాజీమంత్రి అయిన జ్యోతిరాదిత్య సింధియా ఎన్నికల ప్రచారంలో భాగంగా కాలికి బలపం కట్టుకుని రాష్ట్ర వ్యాప్తంగా తిరిగారు. పార్టీ కోసం కష్టపడటమే కాకుండా విజయానికి దోహదపడ్డారు. 230 స్థానాలకుగాను కాంగ్రెస్‌ పార్టీ 114 సీట్లలో విజయం సాధించింది. బీజేపీకి 109 సీట్లు, బీఎస్పీకి రెండు, ఎస్పీకి 1, నలుగురు ఇండిపెండెంట్లు గెలిచారు. మ్యాజిక్ ఫిగర్‌కు ఒక్క సీటు వెనుకంజలో కాంగ్రెస్ నిలిచింది. బీఎస్పీ, ఎస్పీ, ఇండిపెండెంట్ల మద్దతుతో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ముందుకు వచ్చింది. యువనేత జ్యోతిరాదిత్య సింధియా ముఖ్యమంత్రి అవుతారని అందరూ భావించారు. కానీ, కాంగ్రెస్ కోటరీ రాజకీయంతో అనూహ్యంగా 74 ఏండ్ల కమల్‌నాథ్ ముఖ్యమంత్రి అయ్యారు. ఆ సమయంలోనే సింధియా అసంతృప్తి వ్యక్తం చేయగా ఏఐసీసీ నేత రాహుల్ గాంధీ సముదాయించారు. యువనేతవు కాబట్టి భవిష్యత్తులో అవకాశం వస్తుందని హామీ ఇచ్చారు.

సీఎం స్థానం ఆశించి భంగపాటుకు గురైన జ్యోతిరాదిత్య సింధియాను ఆ తర్వాత పార్టీ పట్టించుకోలేదు. రాజస్థాన్‌లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి మరో యువనేత సచిన్ పైలెట్ ఎంతో శ్రమిచ్చారు. అయితే, అక్కడ సీఎంగా అశోక్ గెహ్లాట్ నియమితులయ్యారు. సచిన్ పైలెట్‌కు డిప్యూటీ సీఎంగా అవకాశం దక్కింది. కానీ, అలాంటి అవకాశం మధ్యప్రదేశ్‌లో సింధియా దక్కలేదు. అంతేకాకుండా సీఎంగా ఉన్న కమల్‌నాథే పీసీసీ చీఫ్‌గా వ్యవహరించడం కొసమెరుపు. అటు ముఖ్యమంత్రి పదవి దక్కగా, ఇటు డిప్యూటీ సీఎంగా అవకాశమూ రాక, పీసీసీ చీఫ్ పదవిని కూడా కట్టబెట్టకపోవడంతో సింధియా అసహనానికి గురయ్యారు. పార్టీలో సీనియర్ల వ్యవహారశైలిపై బాహాటంగానే విమర్శలు చేస్తూ వచ్చారు. 2019 ఆగస్టులో కేంద్ర ప్రభుత్వం 370 అధికరణం రద్దు చేసి, జమ్ము, కశ్మీర్‌ను రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా చేసింది. దీన్ని కాంగ్రెస్ వ్యతిరేకించగా జ్యోతిరాదిత్య సింధియా మాత్రం బీజేపీ నిర్ణయాన్ని సమర్థించారు. అలా తన అసంతృప్తిని వ్యక్తం చేస్తూ వచ్చిన ఆయన సమయం చిక్కగానే తిరుగుబాటు చేశారు.

రాజ్యసభ చిచ్చు..
ఇటీవల రాజ్యసభ సభ్యుల ఎన్నికకు నోటిఫికేషన్ విడుదలైంది. మధ్యప్రదేశ్‌ నుంచి కొత్తగా ముగ్గురు సభ్యులు పెద్దల సభకు ఎన్నికయ్యే అవకాశం ఉంది. ఆ రాష్ట్ర అసెంబ్లీలో బలాల ప్రకారం చూస్తే కాంగ్రెస్, బీజేపీ చెరొకటి సులువుగా గెలిచే అవకాశం ఉంది. మరొకటి సమీకరణాలను బట్టి ఎవరు గెలుస్తారో చెప్పే అవకాశం లేదు. ఇక్కడే కాంగ్రెస్ పార్టీలో సంక్షోభం మొదలైంది. సింధియా ఎదుగుదల ఇష్టం లేని సీఎం కమల్‌నాథ్, మాజీ సీఎం దిగ్విజయ్ సింగ్ ఒక్కటయ్యారు. సులువుగా గెలిచే అవకాశం ఉన్న స్థానానికి అభ్యర్థిగా డిగ్గి రాజా పేరును ఖరారు చేశారు. గెలిచే అవకాశం లేని స్థానానికి సింధియా పేరును ప్రతిపాదించారు. అప్పటికే అసంతృప్తితో ఉన్న జ్యోతిరాదిత్యకు ఈ పరిణామం ‘పుండు మీద కారం చల్లినట్టుగా’ అయింది. ఇక కాంగ్రెస్ పార్టీలో తనకు భవిష్యత్తు ఉండదని భావించిన ఆయన తిరుగుబాటు జెండా ఎగురవేశారు. తన మద్దతుదారులైన ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించడం ద్వారా అటు సీఎం కమల్‌నాథ్‌కు గుణపాఠం చెప్పడం, మరోవైపు బీజేపీ ద్వారా రాజ్యసభకు, ఆ తర్వాత కేంద్ర క్యాబినెట్‌లో వెళ్లే అవకాశం ఉండటంతో తన దారి తాను చూసుకున్నారు.

మధ్యప్రదేశ్‌లో పరిణామాలు కాంగ్రెస్ అధిష్టానానికి తెలియనివి కావు. పైగా గాంధీ కుటుంబానికి జ్యోతిరాదిత్య సన్నిహితుడు కూడా. సీఎం కమల్‌నాథ్, సింధియాకు మధ్య తొలి నుంచీ సఖ్యత లేని విషయం తెలిసిందే. దీనికి డిగ్గి రాజా ఆజ్యం పోస్తూ వస్తున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో అత్తెసరు మెజార్టీతో నెట్టుకొస్తున్న కమల్‌నాథ్ సర్కారుకు ఎప్పటికైనా ముప్పు పొంచి ఉంటుందన్న విషయాన్ని ఢిల్లీ పెద్దలు గ్రహించలేకపోయారా? లేదా తెలిసీ ఊరుకున్నారా అర్థం కాని పరిస్థితి. ఈలాంటి పరిస్థితుల్లో ఏనాడూ మధ్యప్రదేశ్‌ నేతల మధ్య సయోధ్య కోసం ఆ పార్టీ నేతలు దృష్టి సారించిన దాఖలాలు లేవు. ఇప్పటికే అధ్యక్ష సంక్షోభం ఎదుర్కొంటున్న కాంగ్రెస్‌ పార్టీకి మధ్యప్రదేశ్ పరిణామాలు పట్టకపోవడం పెద్దగా ఆశ్చర్యం కలిగించదు. అందుకు తగిన ఫలితం ఇప్పుడు అనుభవించాల్సి వచ్చింది.

Advertisement

Next Story

Most Viewed