కలసి బతకలేక.. చున్నీతో ముడిపడి కలసి ‘పోయిన’ జంట

by Sumithra |   ( Updated:2021-06-29 23:33:22.0  )
కలసి బతకలేక.. చున్నీతో ముడిపడి కలసి ‘పోయిన’ జంట
X

దిశ, ఏపీ బ్యూరో : ఆ ఇద్దరు ప్రేమించుకున్నారు. పెళ్ళిబంధంతో ఒక్కటవ్వాలని అనుకున్నారు. అయితే ప్రేమికురాలు మైనర్ కావడంతో పెద్దలు తమ పెళ్లికి ఒప్పుకోరేమోనని భయపడ్డారు. పెద్దవాళ్ళు అంగీకరించకపోతే పెళ్లి జరగదని తమ కల నెరవేరదని మనోవేదనకు గురయ్యారు. కలిసి బతకలేకపోయినా కనీసం చావులోనైనా కలిసే చావలనుకున్నారు. ఇద్దరు తోటపల్లి బ్యారేజ్ వద్దకు చేరుకుని విలపించారు. చున్నీతో ఇద్దరు గట్టిగా కట్టుకుని బ్యారేజ్‌లో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ విషాద ఘటన విజయనగరం జిల్లా పార్వతీపురంలో జరిగింది. మృతదేహాలను చూసి కన్నతల్లితండ్రులు విలపిస్తున్న తీరు అందర్నీ కలచివేస్తుంది.

డీఎస్పీ శుభాష్ తెలిపిన వివరాల ప్రకారం.. బొబ్బిలికి చెందిన రాకేష్(20) అనే యువకుడు.. కురూపంకు చెందిన 16 ఏళ్ల యువతి ప్రేమించుకున్నారు. పెళ్లికూడా చేసుకోవాలనుకున్నారు. అయితే అమ్మాయి మైనర్ కావడంతో పెళ్లి జరగదని భయపడ్డారు. ఇంతలో ఓ మూడోవ్యక్తి వీరి ప్రేమ వ్యవహారంలో తలదూర్చాడు. అతడు ప్రేమజంటను ఇబ్బందులకు గురిచేస్తుండటంతో తమ పెళ్లి ఇక కలమోనని తీవ్రమనస్థాపం చెందారు. దీంతో సోమవారం మధ్యాహ్నం ఇద్దరు తోటపల్లి బ్యారేజ్ వద్దకు చేరుకొని చివరిసారిగా ఒక సెల్ఫీ వీడియో రికార్డ్ చేశారు. తమ చావుకు మౌళి అనే వ్యక్తి కారణమని చెప్పుకొచ్చారు. తమ ప్రేమ వ్యవహారాన్ని సైతం తెలిపారు.

ఎలాగూ కలిసిబతకలేమని కలిసైనా చనిపోదామనుకున్నట్లు తెలిపారు. చివరికి బ్యారేజ్ పై చెప్పులు విడిచి, రెండు మాస్కులు, బైక్ అక్కడే వదిలేసి అనంతరం ఇద్దరు ఒకరువిడిచి ఒకరు విడవకుండా చున్నీతో గట్టిగా కట్టుకున్నారు. అనంతరం బ్యారేజ్‌లో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. ప్రేమజంట వాట్సప్ స్టేటస్ చూశారు. నిజంగానే బ్యారేజ్‌లో దూకారా లేక మిస్ గైడ్ చేశారా అన్న కోణంలో విచారణ చేపట్టారు.

అయితే చివరకు బుధవారం ప్రేమజంట మృతదేహాలు బ్యారేజ్‌లో తెలాయి. ఘటనా స్థలానికి వెళ్లిన డీఎస్పీ శుభాష్ మృతదేహాలను చూసి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ప్రేమించడం తప్పుకాదని.. ఆప్రేమ గెలవదని ఆత్మహత్యకు పాల్పడటం విచారమని డీఎస్పీ అన్నారు. వారికి ఎంతో భవిష్యత్తు ఉందని ఇలా ఆత్మహత్యకు పాల్పడటం ఇద్దరు కుటుంబాల్లో తీరని శోకం నింపారని ఆవేదన వ్యక్తం చేశారు.

Advertisement

Next Story

Most Viewed