నన్ను దెబ్బతీయడానికి కుట్ర జరుగుతోంది.. CM రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు

by GSrikanth |   ( Updated:2024-04-08 15:32:29.0  )
నన్ను దెబ్బతీయడానికి కుట్ర జరుగుతోంది.. CM రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు
X

దిశ, మహబూబ్ నగర్ బ్యూరో/కోస్గి: నన్ను పదవి నుండి తప్పించేందుకు కొంతమంది తెరవెనక గూడుపుఠాణి చేస్తున్నారు. ఆ కుట్రలు అన్నింటినీ ఛేదించాలంటే మహబూబ్ నగర్ ఎంపీ అభ్యర్థి వంశీచంద్ రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. సోమవారం కొడంగల్ నియోజకవర్గ కేంద్రంలో వివిధ మండలాల సమన్వయ కమిటీ నాయకులు, సభ్యులతో ముఖ్యమంత్రి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కొడంగల్ అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రంగా ఏర్పడిన తరువాత 60 ఏళ్ల క్రితం అచ్యుతారెడ్డి ఈ నియోజకవర్గం నుండి గెలిచి మంత్రి అయ్యారు. ఆ తర్వాత ఈ నియోజకవర్గ నుండి ఏ ఒక్కరికి కూడా మంత్రిగా పనిచేసే అవకాశం దక్కలేదు. ఇన్నాళ్లకు సోనియమ్మ దీవెనలతో ఈ ప్రాంత బిడ్డ అయిన నాకు ఏకంగా ముఖ్యమంత్రి అయ్యే అవకాశం దక్కింది అని చెప్పారు. అధికారాన్ని చేపట్టిన వెంటనే కొడంగల్ నియోజకవర్గానికి మెడికల్, ఇంజినీరింగ్, వెటర్నరీ, నర్సింగ్, డిగ్రీ కళాశాలలను తెచ్చుకున్నాం. వందల కోట్ల రూపాయలతో గిరిజన తండాలకు రోడ్ల మంజూరు చేయించుకున్నాం. 4000 కోట్లతో మక్తల్-నారాయణపేట-కొడంగల్ ఎత్తిపోతల పథకాన్ని సాధించుకోగలిగాం అన్నారు.

పాలన, అభివృద్ధి సజావుగా సాగుతుంటే రేవంత్ రెడ్డిని కింద పడేయడానికి తెరవ వెనక పెద్ద ఎత్తున కుట్రలు జరుగుతున్నాయని సీఎం చెప్పారు. ఇంత అభివృద్ధి చేస్తుంటే ఈ కుట్రలు ఎందుకు జరుగుతున్నాయో మీరంతా అర్థం చేసుకోవాలని చెప్పారు. 500 రూపాయలకే సిలిండర్, ఉచిత బస్సు ప్రయాణం, 200 యూనిట్ల ఉచిత విద్యుత్తు, ఇందిరమ్మ ఇండ్లు ఇస్తున్నందుకా..? లేక మూడు నెలల్లో 30 వేల ఉద్యోగాలు భర్తీ చేసినందుకా? ఈ కుట్రలు జరుగుతున్నయి అని సీఎం ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీని ఓడించి లబ్ధి పొందాలని బీజేపీ, బీఆర్ఎస్‌లు పన్నాగాలు పన్నుతున్నాయన్నారు. ఓట్ల కోసం కులాలు, మతాల మధ్య చిచ్చు రేపేందుకు కుట్రలు జరుగుతున్నాయన్నారు. పదేళ్లుగా అధికారంలో ఉన్న మోడీ ప్రభుత్వం ఈ ప్రాంతానికి ఏం చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. ఆయన గెలిస్తే చంద్రమండలానికి రాజవుతాడా? అని రేవంత్ ప్రశ్నించారు.

జాతీయ ఉపాధ్యక్షురాలుగా ఉన్న డీకే అరుణ పాలమూరు-రంగారెడ్డికి జాతీయ హోదా తేవడానికి ఏనాడైనా ప్రయత్నించారా? చెప్పాలి అని డిమాండ్ చేశారు. కొడంగల్ నియోజకవర్గం నా గుండె చప్పుడు. ఈ ప్రాంత అభివృద్ధి నా లక్ష్యం. ఎన్నో ఆశలతో గత అసెంబ్లీ ఎన్నికలలో నన్ను 30 వేల ఓట్ల మెజారిటీతో గెలిపించారు. వచ్చే పార్లమెంటు ఎన్నికలలో ఎంపీ అభ్యర్థిగా పోటీలో ఉన్న వంశీ చంద్ రెడ్డికి నియోజకవర్గం నుండి 50 వేల మెజారిటీ ఇచ్చి సత్తా చాటాలి అని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీ అభ్యర్థి వంశీచంద్ రెడ్డి, ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్, రేవంత్ రెడ్డి సోదరుడు, కొడంగల్ నియోజకవర్గ ఇన్చార్జ్ తిరుపతి రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed