- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
తెలంగాణలో లాక్‌డౌన్.?
దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలో మళ్ళీ లాక్‌డౌన్ విధించడంపై చర్చ మొదలైంది. లాక్‌డౌన్ అవసరం లేదని, పెట్టినా ప్రయోజనం లేదని, ఇప్పుడు అమలుచేస్తున్న రాష్ట్రాల్లో కొత్త కేసులు తగ్గడం లేదని నాలుగు రోజుల క్రితం సీఎం కేసీఆర్ కుండబద్దలు కొట్టినట్లు చెప్పారు. కానీ కరోనా విజృంభిస్తున్న కారణాన్ని ప్రస్తావించిన ప్రభుత్వం లాక్‌డౌన్ విధించడంపై మంత్రివర్గ సమావేశాన్ని నిర్వహించి నిర్ణయం తీసుకోనున్నట్లు తెలిపింది. ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన ప్రగతి భవన్‌లో మంగళవారం మధ్యాహ్నం రెండు గంటలకు మంత్రివర్గ సమావేశం జరగనుంది.
ఈ సమావేశంలోనే లాక్‌డౌన్ విధించడంపై లోతుగా చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు సీఎం కేసీఆర్. ఇదే సమయంలో హైకోర్టులో కరోనా పిటిషన్‌పై మంగళవారం ఉదయం విచారణ జరగనుంది. నైట్ కర్ఫ్యూ వేళలను పెంచడం లేదా లాక్‌డౌన్‌పై నిర్ణయం తీసుకోవడంపై ప్రభుత్వానికి సూచనలు చేసినందున దీనిపై విచారణ సందర్భంగా అడ్వొకేట్ జనరల్ వివరణ ఇవ్వాల్సి ఉంటుంది.
లాక్‌డౌన్ విధించాలనే నిర్ణయం తీసుకుంటారా లేక ఇప్పుడు కొనసాగుతున్న నైట్ కర్ఫ్యూతోనే సరిపెడతారా? లేక కర్ఫ్యూ వేళలను పొడిగిస్తారా? లేక పాక్షికంగా లాక్‌డౌన్ విధిస్తారా? ఇలాంటి అనేక సందేహాలకు మంత్రివర్గ సమావేశంలో సీఎం తేల్చనున్నారు. ఏ నిర్ణయం తీసుకున్నా అది రంజాన్ పండుగ (ఈ నెల 14న) ముందు నుంచే అమలుచేస్తారా? లేక పండగ తర్వాత నుంచి అమలుచేస్తారా అనేది కూడా మంగళవారం సాయంత్రానికి స్పష్టం కానుంది. ఒకవైపు ధాన్యం కొనుగోళ్ళు ముమ్మరంగా జరుగుతున్నందున లాక్‌డౌన్ విధించడం ద్వారా పడే ప్రభావం, విధించకపోవడం ద్వారా పనులు ఆశించిన వేగంగా జరగడానికి ఉన్న అవకాశాలు తదితరాలపై కూడా మంత్రివర్గ సమావేశంలో చర్చ జరగనుంది.
సంపూర్ణమా? పాక్షికమా?
“లాక్‌డౌన్ విధించడం ద్వారా ప్రజా జీవనం స్థంభిస్తుంది. జీవనోపాధి దెబ్బతింటుంది. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ సైతం కుప్పగూలే ప్రమాదం ఉంది. లాక్‌డౌన్ విధించిన రాష్ట్రాల్లో పాజిటివ్ కేసులు తగ్గడం లేదు’’ అని మూడు రోజుల క్రితం ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యాఖ్యానించారు. అయితే కొన్ని వర్గాలు లాక్‌డౌన్ కావాలని కోరుకునే పరిస్థితులు ఉన్నాయని, విధించడం ద్వారా ఎదురయ్యే సాధకబాధకాలతో పాటు ధాన్యం కొనుగోళ్ళపై పడే ప్రభావాన్ని మంత్రివర్గ సమావేశంలో చర్చించి తదనుగుణమైన నిర్ణయాన్ని తీసుకోనున్నట్లు ప్రభుత్వం ఒక ప్రకటనలో తెలిపింది.
సమావేశంలో రెండు రకాల ప్రతిపాదనలను చర్చించనున్నట్లు సమాచారం. లాక్‌డౌన్ విధించాల్సి వస్తే పాక్షికంగా విధించడమా లేక సంపూర్ణంగానా అనేదానిపై లోతుగా చర్చించనున్నట్లు తెలిసింది. ప్రతీరోజు మధ్యాహ్నం రెండు గంటల నుంచి మరుసటి రోజు ఉదయం ఆరు గంటల వరకు లాక్‌డౌన్ తరహా ఆంక్షలను అమలుచేయాలన్నది ఒక ప్రతిపాదన. కనీసం రెండువారాల పాటు కేవలం రెండు గంటల పాటు నిత్యావసర వస్తువుల కొనుగోలుకు మాత్రమే సడలింపు ఇచ్చి సంపూర్ణంగా లాక్‌డౌన్ విధించడం రెండో ప్రతిపాదన. రంజాన్ పండుగ కంటే ముందు విధించడమా లేక తర్వాతనా అనేదానిపై కూడా చర్చ జరగనుంది.
సమిష్టి నిర్ణయం..
లాక్‌డౌన్ విధించే ప్రసక్తే లేదని సీఎం కేసీఆర్ నాలుగు రోజుల క్రితం స్పష్టంగా చెప్పినా వివిధ సెక్షన్ల ప్రజల నుంచి, రాజకీయ పార్టీల నుంచి వరుస విమర్శలు, ఆరోపణలు వినిపిస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం పునరాలోచనలో పడింది. ఈ నెల 15 తర్వాత కేసులు క్రమంగా తగ్గుతాయని ముఖ్యమంత్రి చెప్పినా ఇప్పుడు మాత్రం ‘కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో అటూ లాక్‌డౌన్‌పై పునరాలోచన చేయడం గమనార్హం. ముఖ్యమంత్రి ఏకపక్షంగా నిర్ణయం తీసుకుంటున్నారని, అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ వస్తున్న నేపథ్యంలో సమిష్టిగా చర్చల తర్వాతనే ప్రభుత్వం లాక్‌డౌన్‌పై నిర్ణయం తీసుకున్నదనే క్లారిటీకి ఇవ్వడానికి మంత్రివర్గ సమావేశం నిర్వహిస్తున్నారన్న వ్యాఖ్యలూ వినిపిస్తున్నాయి.
లాక్‌డౌన్‌తో అదనంగా ఇబ్బందులు
లాక్‌డౌన్ విధించినా, విధించకపోయినా పలు రకాల సమస్యలు తప్పేలా లేవు. లాక్‌డౌన్ విధించడం ద్వారా ప్రజా జీవనం స్థంభించిపోవడంతో పాటు వారి జీవనోపాధి దెబ్బతింటుంది. పేద కుటుంబాలకు ఆర్థిక చిక్కులు ఎదురవుతాయి. విధించకపోయినట్లయితే ప్రజల కదలికలు పెరిగిపోయి వైరస్ వ్యాప్తి విజృంభిస్తుంది. ఢిల్లీ నగరంలో రోజుకు సగటున పాతిక వేల కొత్త కేసులు నమోదైతే లాక్‌డౌన్ తర్వాత అది సగంకంటే తగ్గింది. ప్రస్తుతం ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రులపై ఎక్కువ బాధ్యత ఉండడంతో లాక్‌డౌన్ విధించడం ద్వారా ఎదురయ్యే సవాళ్ళు, ధాన్యం కొనుగోళ్ళు జరుగుతున్నందున జరిగే ఇబ్బందులు తదితరాలపై కేబినెట్ సమావేశంలో చర్చ జరగనుంది.
లాక్‌డౌన్‌తో వచ్చే ఇబ్బందులు :
– ప్రజా రవాణా నిలిచిపోవడం ద్వారా ఆస్పత్రుల్లో, మెడికల్ షాపుల్లో పనిచేసే సిబ్బంది విధులకు రావడానికి ఇబ్బందులు ఉంటాయి. ఆటోలు, సిటీ బస్సులు నడవకపోవడంతో ఆస్పత్రులు స్వంత వాహనాలను సమకూర్చాల్సి ఉంటుంది.
– నిత్యం పేషెంట్లు, ఆక్సిజన్, మందులు తదితరాల కోసం ఆస్పత్రుల అంబులెన్సులు తిరుగుతున్నందున ఇప్పుడు స్టాఫ్ కోసం వాటిని వినియోగించడంలో ఇబ్బందులు ఎదురవుతాయి.
– దుకాణాలన్నీ మూసివేయాల్సి ఉన్నందున స్టేషనరీ, కరెంటు సామాన్ల మొదలు వివిధ రకాల ఆస్పత్రుల అవసరాలకు పరికరాలను కొనుగోలు చేయడానికి ఇబ్బందులు తలెత్తుతాయి.
– టెస్టులు చేయించుకోడానికి, టీకాలు వేయించుకోడానికి ప్రజలు కేంద్రాలకు రావడానికి ఇబ్బందులు వస్తాయి.
– ఇంటి దగ్గరే మందుల్ని వాడుతూ ఐసోలేషన్‌లో ఉండే పాజిటివ్ పేషెంట్లు మెడికల్ షాపుల కోసం రోడ్లమీదకు రావడానికి ఇబ్బందులు పడాల్సి ఉంటుంది.
– ఇంటి దగ్గరే ఆక్సిజన్ సిలిండర్లను వాడుతున్న పేషెంట్ల బంధువులు కూడా రీఫిల్లింగ్ కోసం రోడ్లమీదకు రావడానికి ఇబ్బంది పడతారు.
లాక్‌డౌన్ విధిస్తే ..
– ప్రస్తుతం మాస్కుల్లేకుండా, సోషల్ డిస్టెన్స్ పాటించకుండా తిరిగేవారు వేల సంఖ్యలో ఉన్నారు. పోలీసులు ఫైన్ విధిస్తున్నా పూర్తిగా కట్టడి కావడంలేదు. దీంతో వారిని నియంత్రించాలంటే లాక్‌డౌన్ తప్పదనే అభిప్రాయం ఉంది.
– లాక్‌డౌన్ విధించడం ద్వారానే దుకాణాలు, ఆటోలు, సిటీ బస్సులు, మార్కెట్లు తదితరాల ద్వారా వైరస్ వ్యాప్తి చెందే అవకాశాలను తగ్గించడానికి వీలు కలుగుతుంది.