జూలై వరకూ దేశవ్యాప్త లాక్ డౌన్..?

by vinod kumar |   ( Updated:2020-05-14 21:05:28.0  )
జూలై వరకూ దేశవ్యాప్త లాక్ డౌన్..?
X

దిశ, న్యూస్‌బ్యూరో :
తాళం తీయొద్దన్న రాష్ట్రాల మాటలకే కేంద్రం ‘తాళం’ వేస్తోంది. లాక్ డౌన్ కే సై అంటోంది. ఇకపై సడలింపులు, పొడిగింపులతో దేశంలో లాంగ్ లాక్ డౌన్ కొనసాగే అవకాశముంది.ఇప్పటికే మూడు విడతల లాక్‌డౌన్ అమలుకాగా ఈ నెల 18 నుంచి నాల్గవ విడత ఉనికిలోకి రానుంది. ఒక్కో లాక్‌డౌన్ కు అనేక సడలింపులు ఇస్తున్న కేంద్రం ఇకపై కూడా ఇదే తరహాలో మరిన్ని ఎక్కువ మినహాయింపులు ఇచ్చే అవకాశం ఉంది. మూడో విడత లాక్‌డౌన్ ముగిసేలోపు నాల్గవ విడతకు సంబంధించిన మార్గదర్శకాలు విడుదలకానున్నాయి. రైల్వే బోర్డు తాజాగా ఇచ్చిన సర్క్యులర్‌లో జూన్ 30వ తేదీ వరకు రైళ్ళ రిజర్వేషన్లు రద్దు చేస్తున్నట్లు పేర్కొనడం… దీర్ఘకాలిక లాక్‌డౌన్ ఉండొచ్చనే అనుమానాలకు బలం చేకూరుస్తోంది. నాల్గవ విడత లాక్‌డౌన్‌కు చాలా సడలింపులు ఉండొచ్చని ప్రధాని మాటల ద్వారా అర్థమైనా ప్రజా రవాణా వ్యవస్థలైన బస్సులు, రైళ్ళు, విమానాల విషయంలో మాత్రం ప్రత్యేక చర్యలే తీసుకోనున్నారు. పరిమిత సంఖ్యలోనే సేవలను కొనసాగించే అవకాశాలున్నాయి.

ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్ (ఎమర్జెన్సీస్ విభాగం) మైక్ రియాన్ రెండు రోజుల క్రితం మాట్లాడుతూ, “గతంలో హెచ్ఐవీ వైరస్ వచ్చింది. కానీ, అది అంతంకాలేదు. ఇంకా ఉనికిలోనే ఉంది. ఇప్పుడు కరోనా వైరస్ సైతం అంతే. అది అంతమైపోతుందని భావించలేం. ఒకవేళ వ్యాక్సీన్ వచ్చినా వైరస్‌ను నియంత్రించాలంటే విస్తృతమైన చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. ” అని జెనీవాలో జరిగిన మీడియా సమావేశంలో వ్యాఖ్యానించారు. మరోవైపు ప్రధాని, పలు రాష్ట్రాలు, తెలంగాణ సీఎంసహా అందరూ… “వైరస్‌తో సహజీవనం చేయాల్సిందే. మన జీవనశైలిని, అలవాట్లను మార్చుకోవాల్సిందే” అని వ్యాఖ్యానించారు. చాలా కాలం పాటు ముఖాలకు మాస్కులు ధరించడం, చేతులు శుభ్రం చేసుకోవడం, సోషల్ డిస్టెన్స్ పాటించడం లాంటివి కొనసాగించాల్సిందేనని మంత్రి కేటీఆర్ ప్రజలను మానసికంగా సిద్ధం చేసేవిధంగా వ్యాఖ్యానించారు. ఇవన్నీ దీర్ఘకాలిక లాక్‌డౌన్ అనేక రకాల సడలింపులతో కొనసాగుతుందనడానికి సంకేతాలే.

దేశంలో మొదటి దశలో కరోనా వ్యాప్తి నిరోధించడానికి ‌అమలు చేసిన పూర్తిస్థాయి లాక్‌డౌన్‌తో వైరస్ వ్యాప్తి స్పీడు తగ్గినప్పటికీ కొత్త కేసులు మాత్రం భారీ సంఖ్యలో ఇంకా నమోదవుతూనే ఉన్నాయి. వైరస్ ప్రభావం ఇప్పట్లో తగ్గేలా లేదని ప్రభుత్వాలే అంచనాకు వచ్చాయి. అందుకే వైరస్ వ్యాప్తి నివారణకు జాగ్రత్తలు చేపడుతూనే ఆర్థిక వ్యవస్థను గాడినపెట్టే నిర్ణయాలు తీసుకుంటున్నాయి. మరో మూడు రోజుల్లో మూడవ విడత లాక్‌డౌన్ ముగియనుంది. ఆ మరుసటి రోజు నుంచి అమల్లోకి వచ్చే నాల్గవ విడత లాక్‌డౌన్ ఎన్ని రోజులుంటుందో తెలియదు. కానీ, రైల్వే శాఖ మాత్రం జూన్ 30 దాకా రైలు సర్వీసులను మాత్రం రద్దుచేసింది. రైళ్ళను ఇప్పట్లో నడపాలనే నిర్ణయం తీసుకోవద్దని తెలంగాణ సీఎం కేసీఆర్ ఈ నెల 11న ప్రధాని నిర్వహించిన వీడియో సమావేశంలో విస్పష్టంగా సూచించారు.

నాల్గవ విడత లాక్‌డౌన్ ఇప్పటివరకు చూడని కొత్త నిబంధనలతో ఉండబోతుందని ప్రధాని మోడీ ప్రకటించారు. అయితే అది ఎలా ఉంటుందనేది మార్గదర్శకాలు వెలువడితేగానీ తెలియదు. ఇప్పుడు ఆరెంజ్, గ్రీన్‌జోన్‌లలో నెలకొన్న మామూలు పరిస్థితులు యథావిధిగా కొనసాగించడంతోపాటు మరికొన్ని సడలింపులు వచ్చే అవకాశం ఉంది. అయితే రాత్రి వేళల్లో మాత్రం దేశవ్యాప్తంగా కేంద్రం కర్ఫ్యూను కొనసాగించే అవకాశాలున్నట్లు రాష్ట్రాలకు సంకేతాలు అందాయి. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వాలను అప్రమత్తం చేసినట్లు తెలిసింది. కరోనా వైరస్‌కు వ్యాక్సీన్ వినియోగంలోకి వచ్చే వరకు ఏదో ఒక రూపంలో లాక్‌డౌన్ కొనసాగవచ్చన్న వార్తలు వినిపిస్తున్నాయి. అందుకే సుదీర్ఘ లాక్‌డౌన్ తప్పదనే తీరులో ప్రజలను చైతన్యపర్చేందుకు ప్రభుత్వాలు ఇకపై స్పష్టత ఇవ్వనున్నాయి.

Advertisement

Next Story