మారటోరియంపై 2 వారాల్లో వివరణ కోరిన కోర్టు

by Harish |   ( Updated:2020-09-10 04:19:37.0  )
Supreme court
X

దిశ, వెబ్‌డెస్క్: లోన్ మారటోరియం అంశంలో రెండు వారాల్లోగా వివరణాత్మక అఫిడవిట్ దాఖలు చేయాలని ప్రభుత్వం, ఆర్‌బీఐలకు సుప్రీంకోర్టు ఆదేశించింది. కరోనా సంక్షోభం కారణంగా మారటోరియం ఉపయోగించుకున్న రుణ గ్రహీతలపై పడుతున్న భారాన్ని తగ్గించేందుకు తగిన నిర్ణయం తీసుకోవాలని సూచించింది. మారటోరియం కాలంలో వడ్డీ మాఫీని కోరుతూ వేసిన పిటిషన్లపై విచారణను సెప్టెంబర్ 28న తిరిగి ప్రారంభిస్తామని గురువారం సుప్రీంకోర్టు తెలిపింది.

రెండు నెలల పాటు ఖాతాలను ఎన్‌పీఏలు(నిరర్ధక ఆస్తులు)గా ప్రకటించవద్దని బ్యాంకులను కోరిన తమ ఉత్తర్వులు కొనసాగుతాయని సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. జస్టిస్ అశోక్ భూషన్ నేతృత్వంలోని ధర్మాసనం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్‌బీఐ) అనుమతించిన ఆరు నెలల మారటోరియం పొడిగించాలని కోరుతూ వేసిన పిటిషన్లను విచారించింది. వాదనలు విన్న తర్వాత, పిటిషనర్ల వాదనను రికార్డు చేసిన అనంతరం సుప్రీంకోర్టు రెండు వారాల్లోగా వివరణాత్మక అఫిడవిట్ దాఖలు చేయాలని కేంద్రాన్ని ఆదేశించింది.

అలాగే, బ్యాంకులు క్రెడిట్ రేటింగ్‌లను తగ్గించవద్దని, తదుపరి విచారణ(సెప్టెంబర్ 28) వరకు యథాతథ స్థితిని కొనసాగించాలని కోర్టు పేర్కొంది. ప్రభుత్వం తరపున వాదనలు వినిపించిన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా, కేంద్రం ఆర్‌బీఐ కంటే ఎక్కువగా చర్చలు జరుపుతున్నట్టు కోర్టుకు హామీ ఇచ్చారు.

కొవిడ్-19 కారణంగా రుణాల ఈఎంఐల చెల్లింపుల కోసం కేంద్ర ప్రభుత్వం రెండు దశల్లో ఆరు నెలల మారటోరియం అవకాశమిచ్చింది. అయితే, మారటోరియం వెసులుబాటు తీసుకున్న వారి రుణాలపై వడ్డీపై వడ్డీని వసూలు చేయనున్నట్టు బ్యాంకులు స్పష్టం చేశాయి. ఈ అంశంపై రుణగ్రహీతలు సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. మారటోరియం కాలంలో ఈఎంఐ చెల్లించని పక్షంలో వడ్డీ విధించడం రుణగ్రహీతలకు భారంగా మారుతుందని వివరించారు.

ఈ క్రమంలో గతవారం విచారణలో మారటోరియం వెసులుబాటును రెండేళ్ల వరకు పొడిగించే అవకాశముందని కేంద్రం తరపు సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా కోర్టుకు వివరించారు. అదే సమయంలో బ్యాంకులకు నష్టం వచ్చే నిర్ణయం కేంద్రం తీసుకోదని చెప్పారు. దీంతో, ఈ అంశంపై స్పష్టమైన వివరణ ఇవ్వాలని అత్యున్నత న్యాయస్థానం ప్రభుత్వాన్ని కోరింది.

Advertisement

Next Story

Most Viewed