సాహిత్యం కళల్లో సాయుధ పోరాటం..

by Ravi |
సాహిత్యం కళల్లో సాయుధ పోరాటం..
X

తెలంగాణ సాయుధ పోరాట కాలంలోనే అనేక మంది కథలు రాశారు. జీవిత చిత్రణ చేశారు. దాని సంఘర్షణా-చలనాల్ని ఆవిష్కరించారు. పొట్లపల్లి రామారావు, కాంచనపల్లి చినవెంకటరామారావు, ఆవుల పిచ్చయ్య, వట్టికోట ఆళ్వారుస్వామి, సి.వి.కృష్ణారావు, పి.వెంకటేశ్వరరావు, శారద, తుమ్మల వెంకట్రామయ్య, తెన్నేటి సూరి, ఉప్పల లక్ష్మణరావు, అట్లూరి పిచ్చేశ్వరరావు, రాంషా, ప్రయాగ, బి.ఎన్‌.రెడ్డి, ఎం.వెంకట్రావు, పర్స దుర్గా ప్రసాదరావు ఇలా ఎందరెందరో కథలు రాశారు. బహుముఖీనమైన జీవనాన్ని సంఘటనలుగా, పాఠకునికి దృశ్యం కట్టే రూపంలో చిత్రీకరించారు. ఆనాటి చారిత్రక వాస్తవికతలకు ఇవి స్పష్టమైన ప్రతిబింబాలు.

పోరాటాన్ని బయట ప్రపంచానికి చెప్పి..

ఆనాడే మఖ్దూం మొహియుద్దీన్‌, కైఫీ అజ్మీ లాంటి కవులు తెలంగాణా రైతాంగ పోరాటాన్ని ఉర్దూ కవిత్వం ద్వారా బయట ప్రపంచానికి చాటారు. ప్రముఖ బెంగాలీ కళాకారుడు, బెజవాడ పార్లమెంటరీ నియోజకవర్గపు తొలి ప్రజాప్రతినిధి అయిన హరీంద్రనాథ్ ఛటోపాధ్యాయ, తెలంగాణా పోరాటంపై ఇంగ్లీషులో రాసిన కావ్యం; నెహ్రూ-పటేల్‌ మిలటరీ దురాగతాలను బలంగా వ్యక్తం చేసింది. (దీన్ని ఆరుద్ర అనువదించారు) సుందరయ్య గారి వీర తెలంగాణా విప్లవ పోరాటం పుస్తకానికి అనుబంధంగా దీన్ని ముద్రించారు. పోరాట విరమణానంతరం కుందుర్తి రాసిన తెలంగాణా కావ్యం ఆనాటి ప్రేరణతో రాసినదే.

బెంగాలీ చిత్రకారుడు చిత్తప్రసాద్‌ తెలంగాణా జీవితాన్నీ పోరాటాన్నీ తన శక్తివంతమైన కుంచె ద్వారా అద్బుతంగా చిత్రించటం, ఆ చిత్రాలు ఒకనాటి చరిత్రకు తార్కాణాలుగా నిలవటం, తెలుగువారు చిత్తప్రసాదుని తమవాడుగా హృదయంలో పదిల పరుచుకోవటం ఇదంతా నమోదయిన చరిత్రగా వుంది. మాధవపెద్ది గోఖలే ( మా.గోఖలే ) రచయితగానే కాక చిత్రకారునిగా, శిల్పిగా కూడా ప్రసిద్ధుడు. ఆయన తెలంగాణా పోరాటంపై చిత్రాలు గీశారు. ఆనాటి అరసం, ప్రజానాట్యమండలి రచయితలూ, కళాకారులూ ఈ పోరాట చిత్రీకరణపై ప్రత్యేక శ్రద్ధ పెట్టారు.

గిరిజన జీవితాల్ని తన ఫోటోలో రూపుకట్టిద్దామని బొంబాయి నుండి బయలుదేరిన ప్రతిభావంతమైన ఫోటోగ్రాఫర్‌ నునీల్‌ జానా, పోరాటం సాగుతూండిన తెలంగాణాలోకి అడుగుపెట్టాడు. ఈనాటికీ సజీవంగా గొప్ప ఆశ్చర్యాన్ని కలిగించే స్పష్టత గల ఫోటోలు ఆయన తీశారు. తుపాకులు తమ ఎడం పక్కనే పెట్టుకుని పంక్తి భోజనాలు చేస్తున్న సాయుధ యువకులు, గెరిల్లా శిక్షణ పొందిన వీర తెలంగాణా మహిళా కార్యకర్తల ఫోటోలు నాటి ప్రజాపోరాటానికి ప్రత్యక్ష సాక్ష్యాలు. పోరాట విరమణ (1951) తర్వాత 24 సంవత్సరాలకు సుంకర సత్యన్నారాయణగారు మా భూమికి కొనసాగింపుగా గెరిల్లా నాటకం రాసి ప్రదర్శింపజేశారు.

1857 యుద్ధంతో పోల్చదగినది!

వివిధ నవలలూ, కథా సాహిత్యం, కళారూపాలు- అన్ని ప్యూడల్‌ బంధనాల నుండి రైతాంగం విముక్తి కావటమనే అంశంగానే తెలంగాణా పోరాటాన్ని చూశారు. ఆ మేరకు భూమి పంపిణీ కార్యక్రమం, సాధించిన భూమిని నిలబెట్టుకోవడానికి అనివార్య సాయుధ ప్రతిఘటనల నడుమగల అంత సంబంధాన్ని గ్రహించారు. ఆనాటి వ్యూడల్‌ వ్యవస్థకు నిజాం ప్రతిరూపమే తప్ప, నిజాం వైదొలగి మరో జనాబ్‌ పీఠమెక్కినంత మాత్రాన ప్రజల జీవితంలో మౌలిక మార్పు రాదు. ఆ విధంగా నిజాం వ్యతిరేకతకు మాత్రమే పరిమితమైన ఉద్యమం కాదది. మొత్తంగా భూస్వామ్యవ్యవస్థ వునాదులనే పెకిలించగల లోతు విస్తృతి, సామాజిక దృక్పథం ఆ పోరాటానికి వుంది. నిజాంను దింపటానికి ఒత్తిడి తేగల మేరకే ఉద్యమాన్ని నిర్వహించిన వారున్నారు. వీరికి మొత్తంగా ఫ్యూడల్‌ వ్యవస్థతో ఘర్షణలేదు. ప్రజలే దాన్ని కూలదోస్తారనే విశ్వాసం లేనివారుకూడా వున్నారు.

చరిత్రల్ని సృష్టించేది, విముక్తుల్ని సాధించేది అప్పటిదాకా బ్రిటిషువారి కిరాయి సైన్యంగా పనిచేసిన మిలటరీ బలగాలనే విశ్వాసం గల భాజపా లాంటివారూ, నిజాం రాజ్యాన్ని భారత యూనియన్లో విలీనం చెయ్యటమే తెలంగాణా విమోచన చరిత్రగా చెబుతున్నారు. వారికి వారే ఎల్‌. కె. అద్వానికి సర్దార్‌ పటేల్‌ లాంటి ఉక్కుమనిషిగా సర్జిఫికేట్‌ యిచ్చుకుని, పటేల్‌ పంపిన సైన్యం తెలంగాణాను ఆక్రమిస్తే- అదంతా తమ నాయకత్వానే జరిగిపోయినట్టు భ్రమత్మాక చరిత్రను సృష్టించే ప్రయత్నం చేస్తున్నారు.

ఇంత విస్తారమైన సృజనాత్మక సాహిత్యం- కళలలో; మతం పేరిట రజాకార్లూ, కొందరు ఆర్య సమాజ్‌ కార్యకర్తలూ ఫ్యూడల్‌ ప్రభువులైన నిజాం దేశ్‌ముఖ్లకే సేవ చేశారని దాదాపు ప్రతి నవలా స్పష్టం చేశాయి. సాధారణ రైతు-కూలీ యువజనులు ఇంత సుదీర్ఘ కాలం సాయుధంగా నిర్మాణయుత సైన్యంపై తలపడి పోరాటడమన్నది, ఈ దేశ గత చరిత్రలో ఎక్కడా లేనిది. యుద్ధాల పరిభాషలో 1857తో పోల్చదగిన యుద్ధం - విస్తృతి-లోతులలో-- తెలంగాణా ప్రజా పోరాటమే!!

ఈ పోరాటం అందుకు జరిగింది!

అనేక చారిత్రక ఒత్తిడుల నడుమ పోరాట విరమణ జరిగిందనుకున్నా అది ఏ లక్ష్యాల కోసమై సాగిందో అవి ఇంకా అసంపూర్ణంగా వుండిపోయినాయనేది స్పష్టం. విశాలాంధ్ర అయితే ఏర్పడింది గానీ ప్రజారాజ్యం రాలేదు. అందుకే సామాజిక అసమానతల్లో భాగంగా ప్రాంతీయ అసమానత్వాలు కూడా విపరీతంగా పెరిగాయి. అలాగే భూ సంస్కరణ చట్టాలు అనేకం వచ్చాయి. గానీ దున్నేవానికే భూమి లభించలేదు. ప్రపంచీకరణ యుగంలో కొత్త భూస్వామ్యం తలెత్తుతోంది.

స్వయం నిర్ణయాధికారం గల “తెలుగుజాతి” భారతదేశంలో అంతర్జాగంగా వుంటుందనుకున్నారు గానీ, సామ్రాజ్యవాదుల, ఢిల్లీ పాలకుల దయాదాక్షిణ్యాలపై ఆధారపడే కొత్త బిచ్చగాళ్ల రాజ్యం ఏర్పడుతుందని అనుకోలేదు. ఏదైనా విమర్శ అంటూ చేయవలసివుంటే...దానిపై సామాజిక కార్యకర్తలూ, సాహిత్యకారులూ దృష్టి పెట్టదలచుకుంటే... ప్రజా ఆకాంక్షలు, కలలు ఎందుకు వమ్మయినాయనే దానిపైన వుండాలి. పోరాటకాలంలోనే వెలువడిన రెండవ నవల సింహగర్జనలో కోటిరెడ్డి పాత్ర పోరాట లక్ష్యాల్ని ఇలా వివరిస్తాడు.

''ఈ పోరాటం తురకమతం రాజును దించటానికి కాదు. ఈ పోరాటం తురక జాతిని నాశనం చెయ్యటానికి కాదు. ఈ పోరాటం హిందూ రాజ్యాన్ని స్థాపించటానికి కాదు. వ్యక్తిగత కక్షలను తీర్చకోవటానికి గాదు. జమీందారు, జాగీర్జారు, దేశ్‌ముఖ్‌ బిరుదాంకితులైన భూస్వాముల విషపు కౌగిలి నుంచి భూమిని విడిపించి దున్నేవానికే దాన్ని దక్కించటానికి ఈ పోరాటం''.

తెలంగాణా పోరాటవు వారసులమని చెప్పుకునే వారంతా పై వివరణ ప్రాతిపదికగా చర్చించుకోవటం వల్ల ఎప్పటికయినా ఒక పరిష్కారం దొరుకుతుంది.

(ముగింపు వ్యాసం)

దివికుమార్

ప్రజాసాహితి కార్యవర్గ సభ్యులు

94401 67891

Advertisement

Next Story