- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
వలపు రాగాలు మీటిన మణిపూసలు!
తెలుగు సాహిత్యంలో నేడు కొత్త కొత్త కవితా ప్రక్రియలు కోకొల్లలుగా పుట్టుకొస్తున్నాయి. అలా వచ్చిన వాటిలో పాఠకుల మెప్పును పొంది, నిలబడినవి కొన్ని మాత్రమే. అందులో ఒకటి మణిపూసల ప్రక్రియ. ఇది అతి తక్కువ కాలంలోనే పాఠకులచే విశేష గుర్తింపును పొందినది. వడిచర్ల సత్యం రూపొందించిన ఈ లఘురూప కవితా మార్గాన్ని నేడు ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని ఎంతో మంది కవులు అనుసరిస్తున్నారు. పుస్తకాలను వెలువరిస్తున్నారు.
వర్థమాన కవి అయిన వెన్నెల సత్యం విభిన్న కవితా ప్రక్రియల్లో ఆరితేరి, తనదైన ముద్ర వేస్తూ ఎన్నో రచనలు చేస్తున్నాడు. పద్యం, నానీలు, గజల్, రెక్కలు, వచనం లాంటి అనేక ప్రక్రియల్లో అద్భుతమైన రచనలు చేసి, ప్రసిద్ధులైన సాహిత్య విమర్శకుల ప్రశంసలను సైతం అందుకున్నాడు. "స్వప్న వీణ" అనే మణిపూసల పుస్తకంతో మన ముందుకు వచ్చాడు.
ఇంతకు ముందే "వెన్నెల మణిపూసలు" పుస్తకాన్ని ప్రచురించిన సత్యం ఇప్పుడు "స్వప్న వీణ"తో సాహితీ ప్రియుల హృదయాల్లో ప్రేమలను నింపి అలరించాడు. తన ఊహల్లో ఉన్న స్వప్న సుందరిని ఆరాధించాడు. తన ఎడబాటును, విరహ వేదనను రసగుళికల వంటి మణిపూసలలో ఆవిష్కరించాడు. తన గుండెలోని బాధను చెప్పుకున్నాడు. చదువరుల హృదయాలను హత్తుకునేలా అన్ని మణిపూసలు ప్రేమ అనే ఏకైక ఇతివృత్తంతో కడు రమణీయంగా రాయడం విశేషం. మచ్చుకు కొన్ని చూద్దాం.
“ఎదురుచూపుల వెనక / ఎన్ని బాధలె చిలుక/ ఏమి నేరము జేస్తి?/ ఎందుకే నీ అలక!” నీ ఎడబాటు నేను భరించలేను. నీ రాక కొరకై ఎదురు చూస్తున్నాను. ఆ ఎదురు చూపులో ఎంతో బాధ ఉంది. నేను ఏమి నేరం చేశానని నాపై అలకబూనావు అంటూ తన కలల రాణిని ప్రశ్నించాడు.
“కదిలేటి ఆకునడిగా/ పారేటి వాగునడిగా/ నీ జాడ తెలుపమంటు/ మెరిసేటి మెరుపునడిగా!"
తన ఊహ సుందరి ఎక్కడుందో చిరునామా చెప్పమంటూ ప్రకృతిని సంబోధిస్తూ ఎంత చక్కగా ఆడిగాడో చూడండి. ఆనాడు రావణాసురుడు అపహరించిన తర్వాత సీత జాడ కోసం రాముడు అడవిలో కనబడిన ప్రతీదాన్ని అడిగిన సందర్భాన్ని సన్నివేశాన్ని ఈ మణిపూస జ్ఞప్తికి తెస్తుంది.
"గుండె లోపలి గోల/ గుర్తు పట్టవె బాల/ ఓర చూపులతోటి/ గుచ్చకే గునపాల!" అంటూ తన గుండెలో గూడు కట్టుకున్న అనంతమైన ప్రేమను గుర్తుపట్టమని వేడుకుంటాడు. ఆ హృదయంలో గునపాన్ని గుచ్చి గాయం చేయకుమని భగ్న ప్రేమికుడిగా రాసిన శైలి అమోఘం.
"ఒకసారి కనిపించు/ మమతనే కురిపించు/ మధురమౌ నీ మాట/ మృదువుగా వినిపించు!" అంటూ తన కలల సఖిని ఒక్కసారైనా కనిపించి, మృదుమధురమైన మాటలతో ప్రేమామృతాన్ని పంచమంటాడు.
"స్వప్నాల రాణివే/ సరసాల వేణివే/ నా వలపు తోటలో/ విరియు పూబోణివే!" అంటూ కలల రాణిని కవి తన ప్రేమతోటలో విరబూసే అందాల పూబోణి అంటూ ఎంతో చక్కగా అభివర్ణించాడు.
అర్థ వివరణ అవసరం లేని ఈ సరళ సుందర సంపుటికి ప్రముఖ కవులు కందుకూరి శ్రీరాములు గారు "ప్రేమమయమైన స్వప్నవీణ" పేరుతో, గంటా మనోహర్ రెడ్డి గారు"ఎన్నో వన్నెల వెన్నెల" పేరుతో రాసిన ముందుమాటలు మరింత శోభను చేకూర్చాయి. ఇలా"మణిపూసల మధురకవి" బిరుదాంకితుడైన వెన్నెల సత్యం ఆకర్షణీయమైన పద్ధతిలో అయస్కాంత ముక్కల్లాంటి మణిపూసలను లిఖించాడు. తన రచనా నైపుణ్యాన్ని ప్రదర్శించాడు. తన ఊహ సుందరిపై అవ్యాజ్యమైన చల్లని వెన్నెల ప్రేమను కురిపించాడు. "అలంకార యుక్తంగా, అలతి అలతి పదాలతో, మధురమైన భావజాలంతో జాలువారిన ఈ మణిపూసలు చదువుతున్న కొద్దీ ఇంకా చదివిస్తాయి. పాఠకుల మనస్సు లోతుల్లో స్వప్న వీణను మోగిస్తాయి" అని చెప్పడంలో ఏమాత్రం అతిశయోక్తి కా(లే)దు.
ప్రతులకు:
వెన్నెల సత్యం.
94400 32210.
పుస్తకం వెల. 30 రూ.
సమీక్షకులు
కందుకూరి భాస్కర్,
94415 57188