- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
సాహిత్య స్ఫూర్తి ప్రదాత
పడాల జోగారావు మాస్టారు మంచితనానికి ప్యాంటూ, చొక్కా తొడిగినట్టుంటారు. మధ్యతరగతి అనే మాట మనిషి రూపం దాల్చినట్టుంటారు. మంచితనానికి, మధ్యతరగతికి వీడని బంధంలాగే, ఆయనకి సమాజంతో, సాహిత్యంతో అనుబంధం. ఆ అనుబంధపు దారప్పోగులో మా ఇద్దరిదీ ఓ పీటముడి. భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఓ చివరకు వుంటే, అందులో ఇంకా చివరకు వుంటుంది శ్రీకాకుళం జిల్లా. ఆ జిల్లా చిట్టచివర మందస అనే మండలంలో అందులో కొనాకి వుండేదే సొండి పూడి అనే గ్రామం. అక్కడ అద్దె ఇంట్లో ఆయన నివాసం. భార్య, కొడుకు, కూతురు. బతుకు తెరువు కొరకు ఓ బడుగు ఉద్యోగం. కుటుంబ సమస్యలు, ఆర్థిక సమస్యలు జమిలిగా పెనవేసుకున్నా తెల్లని ఆయన ముఖంలో గాంభీర్యం చెదిరేది కాదు. రాకరాక ఎప్పుడైనా కోపం వచ్చిందా, ముఖంపై రంగమెటియా కొండల ఎరుపు ప్రతిఫలించాల్సిందే. అంతే తప్ప, తప్పిజారి పొరపాటున కూడా మాట జారి చేటు చేసేవారు కాదాయన.
అంబేడ్కరూ అవతారం అయిపోతే
‘‘ఆశయాలను తుంగలో తొక్కి, ఆయనను పూజించడం ప్రారంభిస్తే-అంబేద్కర్ కూడా బుద్ధుడిలా మరో అవతారం అయిపోతాడు’’ అని మొదటిసారి హెచ్చరించిన నిర్మొహమాటి ఆయన. అలాంటి సూటి మాటలు అనేకం ఆ చుట్టుపక్కల ఊర్లలో చాలాకాలం చక్కెర్లు కొట్టేవి. చాలా ఎక్కువ చదువుకుని, తక్కువలో తక్కువ రాసేవారు. ఆయనను రోజూ కలిసి అనేక సాహిత్య, సామాజిక చర్చలు చేసేవాడిని. నా ప్రశ్నలన్నింటికీ ఓపిగ్గా సమాధానం చెప్పేవారు. ‘మరిన్ని వివరాల కోసం ఇది చదవండి’ అని బయలుదేరినప్పుడు ఏదోక పుస్తకం చేతిలో పెట్టేవారు. నా తొలినాటి రచనలకు తొట్టతొలి విమర్శకుడాయన. ‘మనకు చేతనైనంతలో ఏదో ఒకటి చేద్దాం’ అని మొదలు పెట్టిన స్టడీ సర్కిల్ అప్పట్లో ఓ సంచలనం.
ఆనందానికీ, ఆగ్రహానికీ మధ్య
నేను దారులు వెతుక్కుంటూ హైదరాబాద్ చేరినా, మా మధ్య ‘ఉత్తర’ సంబంధాలు విరివిగా సాగాయి. పత్రికల్లో ఎక్కడ నా రచన కనబడినా తెగసంబరపడి పోయేవారు. ఆ ఉద్వేగాన్ని పుంఖాను పుంఖాలుగా అక్షరాల్లో పంచేవారు. అంతే, ఆనందం కలిగినా, ఆగ్రహం వచ్చినా ఆయన్ని పట్టలేం. అలాంటి ఓ సందర్భంలోనే తన అలవిమాలిన ఆగ్రహానికి తుది వీడ్కోలు పలికి, అందరికీ విషాదాన్ని మిగిల్చారు.
అజ్ఞాతంగా నలిగిపోయిన జీవితం
జీవితపు రథచక్రాల కింద అజ్ఞాతంగా నలిగిపోయిన, నలిగిపోతున్న ఎందరో సాధారణ పాఠకులకి ఆయనొక అసాధారణ ప్రతీక. ఎన్నెన్నో ప్రగతిశీల పార్టీలు. వాటికి-శ్రామిక, మహిళా, ఉద్యోగ, విద్యార్థి-సహా ఎన్నో విభాగాలు. వాటికి చేతనైనంతలో ఏదో చేయాలని నానా కష్టాలు పడుతూ ఏ గుర్తింపుకూ నోచుకోనివారు ఊర్లలో, గ్రామాల్లో అనేక వేలమంది వుంటారు. ఆయా విభాగాలు తరచుగానో, అప్పుడప్పుడోనో తీసుకొచ్చే పత్రికలకు కథో, కవితో, వ్యాసమో, విమర్శో రాసి-అది ప్రచురితమైతే తాము సాహిత్యానికి గొప్ప చేర్పు చేశామని గుండెలుప్పొంగించుకుని మురిసిపోయే వారు కూడా తక్కువేమీ కాదు. ప్రధాన స్రవంతి పత్రికల్లో గందరగోళపు రచనలతో తరచుగా ప్రచురణ పొందుతూ, మేథావులుగా, విశ్లేషకులుగా ప్రాచుర్యం పొందిన వారితో పోలిస్తే-చిన్నపాటి ప్రశంసకు కూడా నోచుకోని ఊర్లలోని వారి అకుంఠిత దీక్ష, నిబద్ధత, పట్టుదల ఏ రకంగా చూసినా గొప్పే.
ఆయనకే నా పుస్తకం అంకితం
అటువంటి ఎందరో అజ్ఞాతవాసులకు జోగారావు ఒక ప్రతిబింబం. కొన్నేళ్లే అయినా, ఆయన సాంగత్యం- సాహిత్యం, సామాజిక మార్పుల్లోని లోతులను తరచి చూసే మెళకువలను నేర్పింది. అక్షరం పట్ల బాధ్యతను మప్పింది. ఆయన్ని గుర్తు చేసుకోవడమంటే, గతాన్ని పదిలంగా పొదవి పట్టుకోవడమే. నడిచివచ్చిన దారిలో మైలురాళ్లను వినమ్రంగా నెమరేసుకోవడమే. అందుకే నా నాలుగో కథా సంపుటి ‘రొమాంటిక్ డాగ్’ను ఆ సదాస్మరణీయుడికి అంకితమిచ్చాను. స్ఫూర్తిప్రదాతలకు అంతకుమించి ఏమివ్వగలం?
(జనవరి 4న పడాల జోగారావు 72వ జయంతి సందర్భంగా)
దేశరాజు
99486 80009
- Tags
- Padala Jogarao