యుద్ధం

by Ravi |   ( Updated:2023-10-29 18:45:55.0  )
యుద్ధం
X

మారణ రణం

మాన భంగాలు

పిల్లల మరణాలు

రక్తపు హోలీ

చరిత్రపుటల్లో రక్తపు మరకలు

మనిషి మారలేదు

బతుకు మార్చుకోలేదు

మతాల పోరులో

మానవత్వానికి కందెన మరకలు...

అస్తిత్వాల జ్ఞానంలో

అజ్ఞాన సముద్రంలో జీవన నావ

ప్రతి సమస్యకు

బాంబులు సమాధానం కాదు

హక్కులపోరాటంలో

చావులు సమాధానం కాదు

బుద్ధమార్గం కాదనుకుంటే

గాంధీ మార్గం కాదనుకుంటే

జనంమెచ్చేది

ఆశయాలు వర్ధిల్లే మధ్యేమార్గం

అన్వేషించాలి...

నిండు గర్భిణి పొట్ట చీల్చి

నెత్తుటి పసిగుడ్డును నులిమి

వికృత నరహంతక చేష్టలు

మెచ్చుకుంటూ రాస్తారా ఎవరైనా

పరస్త్రీలను వివస్త్రలు చేసి

ఊరేగింపులు మానభంగాలు

కెమెరాలో క్లిక్ కేనా

కళ్లలో రక్తకన్నీరే

ఆ దృశ్యాల విచిత్ర చిత్రాలు

పత్రికలలో చూసారా...

మనిషిలోని రాకాసి కోర

పదును పెట్టిందెవరు

మనిషిలోని కడలిని

తుపానుగా మార్చిందెవరు

తిరుగుబాటు ధోరణి నూరిపోసిందెవరు...

అస్తిత్వ పోరాటాలు ఉండాలి

అనామకుల చావులుండరాదు

సంధి ఓ మార్గం

శాంతి ఒడంబడికలు మరో మార్గం

అన్నీకుదరనప్పుడు

యుద్ధం అనివార్యం.

- రేడియమ్

92915 27757

Advertisement

Next Story