నేను మట్టి తాలూకు..

by Ravi |   ( Updated:2023-07-30 18:30:30.0  )
నేను మట్టి తాలూకు..
X

నాలుగు మెతుకులు నోట్లోకి వెళ్లినప్పుడల్లా

మట్టితాలూకు జ్ఞాపకాలు కళ్ళలో తిరుగుతాయి.

చెట్టువేర్లన్నీ మట్టితో మమేకమైపుడే కదా

అవనిపై ఆకలి అరుపులు అంతమయ్యేది.

ఏ జన్మల ఋణమో మట్టిది..అణువణువూ

మానవ కళల్ని రంగరించుకొని

మోస్తుంది అందరినీ.

కన్నీటిగుట్టల్ని దిగమింగుకొని...

అంబువుని తనువుపై పారిస్తూ...

కర్షకుని పాదాలనుకడుగుతూ

కన్నీటిని తుడుస్తుంది.

ఆకులన్నీ రాలి మట్టిని ముద్దాడుతున్నాయి.

పువ్వులన్ని సుగంధాల

పరిమళాన్ని అర్పిస్తున్నాయి.

అలసిపోయిన మట్టికి..

చెట్టునీడై సేదతీరుస్తుంది.

తరువు ఆకుల సందుల్లోంచి

కాంతి కిరణాలు తొంగి చూస్తున్నాయి.

మట్టి ఎదపై నుండి వీస్తుంది గాలి... పలకరిస్తూ.

పచ్చని వరిపైరులన్నీ నేలపైవాలి

మట్టికి సలామ్ చేస్తున్నయి.

మట్టి మనందరికీ బహుమతై..

బాసటై నిలుస్తుంది.

మట్టిలోంచి పుట్టిన అమృతాన్ని తాగి బతికినోల్లం.

మాకు మట్టే బంగారం...మట్టే సర్వస్వం.

పచ్చనిపందిరై పంచభక్ష

పరమాన్నాలను అందిస్తుంది

అడుగులో అడుగై తడబడినపుడు...

రానా చేతుల్తో గుండెకు హద్దుకుంటుంది.

మట్టిపై నడకను నేర్చిన వాళ్ళం.

మట్టితోనే బతికినవాళ్ళం.

బతుకు తాలూకు చివరిపేజీ

ముగిసిన తర్వాత తరువాత..

మట్టి ఎదలోనే శాశ్వత నిద్ర.

నువ్వు నేను అందరూ మట్టితాలూకే.

మట్టి రహస్యం అప్పుడు తెలుస్తుంది.

తనలో కలుపుకొని

బతుకు ముచ్చట్లు చెబుతుంది.

అంతే కదా...మనకు బతికున్నప్పుడు

జీవిత విలువెక్కడ తెలుస్తుంది.!

నేను మట్టి తాలూకు..


అశోక్ గోనె

9441317361

Advertisement

Next Story

Most Viewed