ఘాటైన కవిత్వ సుగంధం... ఈ నానీలు

by Disha edit |
ఘాటైన కవిత్వ సుగంధం... ఈ నానీలు
X

కవిత్వంలో అంతర్లీనంగా భావాల పరిమళం వీస్తుంది. అదే నానీల కవిత్వంలోనయితే మరిన్ని వైవిధ్య భావపరిమళాలు గాఢంగా చుట్టుముడుతాయి. ఆదినారాయణ రాసిన నానీల్లోనయితే ఘాటైన కవిత్వ సుగంధం ఒక్కసారిగా మనల్ని అలుముకుంటుంది. ఈ 'నానీల సుగంధాల్లో' ఎక్కువగా మనిషి జీవితం చుట్టూ ఆవరించిన అనేక బాధలు, వేదనలు కనిపిస్తూ అర్థంకాని ఉక్కపోతనూ కలిగిస్తుంది. కవి పల్లె నుండి నగరానికి వలస వచ్చినా, తన మూలాలను మర్చిపోలేదనే సత్యం ఈ నానీల్లో అనుభవమవుతుంది.

పుస్తక సంపుటి తెరవగానే..

'పల్లెల్లో పలకరింపులెక్కువ బంధాలతో ముడివేసి ఆయుష్షు పోస్తారు” ఉపాధి కోసం నగరానికి వలసవచ్చిన వారి వేదన ఈ కవిలో కనిపిస్తుంది. నగర యాంత్రికతలో కొట్టుకుపోతూ క్షణమొక పోరాటంగా గడుపుతున్న ప్రతి మనిషి తన పల్లెతో ముడిపడిన బంధాలను నెమరేసుకుంటాడు. ఆదినారాయణ ఈ నానీల్లో అలాంటి జ్ఞాపకాల తలపోతలను గుర్తు చేసుకున్నాడు. అందుకే మరో నానీలో బాల్యమిత్రులను తలచుకుంటూ 'వారంతా జ్ఞాపకాల మేడ క్షణాల్లో కట్టారు' అని చిన్ననాటి స్మృతుల గాఢతను కవి వర్ణిస్తాడు. ఈ నానీల సంపుటి తెరవగానే రచయిత హృదయంలోని కన్నీటి వరద మనల్ని దుఃఖంలో ముంచెత్తుతుంది.

రోడ్లు బస్తీవాసుల కన్నీళ్లు

“వర్షం తగ్గినా రోడ్లు ఉప్పొంగుతున్నాయే! బస్తీవాసుల కన్నీళ్ళు అవి” ఎటువంటి వాతావరణ అంచనాలు, హెచ్చరికలు లేకుండానే భళ్ళున కురిసే వర్షానికి నగరం ఎంతలా అతలాకుతలమవుతుందో, సామాన్య నిరుపేదల బస్తీలు, జీవితాలు ఎలా మునిగిపోతున్నాయనే నగర వాస్తవికతను ఆరంభ నానీగా మలచుకోవడం కవి సామాజిక చైతన్యానికి నిదర్శనం. అక్కడితోనే ఆగిపోడు ఆది. తన చుట్టూ ఉద్యమిస్తున్న రైతు సమూహాన్ని చూసి కుతకుత ఉడికిపోయాడు. దేశ అభ్యున్నతికి వెన్నెముక లాంటి రైతు ప్రాధాన్యాన్ని, వర్తమాన దుస్థితిని పదునుగా వ్యాఖ్యానించాడు.

పంట పండించేది కన్నీటితో...

'పంటను రైతు నీటితో కాదు కన్నీటితో పండిస్తున్నాడు’ అంటూ వ్యవసాయం వెనుకున్న అనేక బాధామయ కష్టస్థితులను స్ఫురింపజేస్తాడు. ఈ నానీలు చదువుతుంటే కవిలోని రైతు పక్షపాతి, ప్రజా ఉద్యమవాది దర్శనమిస్తాడు. ఇటీవలి కాలంలో కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన రైతు వ్యతిరేక నల్లచట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేసిన నిబద్ధ ఉద్యమం దేశాన్ని మొత్తం కదిలించి వేసింది. తీవ్రంగా ఆలోచింపజేసింది. అటువంటి ఉద్యమాల మీద ఆదినారాయణలోని అభ్యుదయవాది కవితాగ్రహాన్ని ప్రకటిస్తూ ఈ నానీల్లో ప్రభావవంతంగా స్పందించాడు. ఈ సంపుటికి భావగాఢతను అందిస్తూ కవిపై గౌరవాన్ని కలిగిస్తాయి ఈ నానీలు. కవిలో నిరంతరం వర్తమాన జీవితం ప్రసారమవుతూ వుంటుంది. ముఖ్యంగా ప్రపంచాన్ని అతలాకుతలం చేసిన కరోనా వైరస్ చుట్టూ ఈ నానీలను తిప్పాడు. అధ్యాపకుడిగా తరగతి గదికి వీడ్కోలు చెప్పి ఇంట్లో బంధింపబడ్డాడు. ఆ స్పృహతోనే “కరోనాలో బడిగదులకు తాళం ఊపిరి గదులు అతలాకుతలం' అని కరోనా తీసుకొచ్చిన అనేక ఆవేదనలు, అనుభవాలను నానీల్లో వ్యక్తీకరించాడు.

రేపటి చరిత్రకు ఆధారాలు

నానీలు వర్తమాన సమస్యలను రికార్డ్ చేయడంలో అలర్ట్‌గా ఉంటాయి. ఏ నానీల కవితా సంపుటిని తిరిగేసినా రచనాకాలంనాటి విభిన్న రంగాల పరిణామాలన్నీ వైవిధ్య భరితంగా తెలుస్తాయి. ఒక విధంగా రేపటి చరిత్ర రచనలో ఈ నానీలు ఒక ప్రామాణిక సాహిత్య ఆధారాలుగా నిలబడుతాయి. ఆయా సందర్భాలలో ప్రజల భావోద్వేగాల సరళినీ క్రోడీకరించడంలోనూ ఈ నానీలు అనుభూతి సాధనాలుగా ఉపయోగపడుతాయి. కవిలో తన మూలాల పట్ల గౌరవాన్ని, తన జన్మకు కారకులైన తల్లిదండ్రులపై ప్రేమాభిమానాలను ఆత్మీయంగా తలచుకుంటూ “కొడుకు ఇల్లును దీపంలా వెలిగించాడు, చమురు తల్లిదండ్రులు” కవికి తల్లిదండ్రుల మీద ఉన్న అపారమైన విలువను, నేటి తరానికి ఉండవలసిన కృతజ్ఞతను తెలుపుతుంది ఈ నానీ. అలాగే తను నడిచొచ్చిన వివక్షల సామాజిక నేపథ్యాన్ని కూడా మరవలేదు. అందులోంచి స్ఫూర్తిదాయక చైతన్యాన్ని అందిపుచ్చుకుంటూనే దారితప్పుతున్న వారికి ఒక దిశానిర్ధేశాన్ని హెచ్చరికను చేస్తున్నాడు. పరామర్శకు పురిగొల్పుతాడు.

వచన కవితాధారగా వెలుగొంది

ఆదినారాయణ లోని ఈ విధమైన చింతన ఈ నానీల ఇతివృత్తానికి కొత్త టానిక్‌ని అందించాయి. ఆదినారాయణ ఈ తరం తెలుగు పరిశోధక, అధ్యాపక సమూహంలో ఉజ్వలమైన భవిష్యత్తు ఉన్నవాడు. ఒక క్రమశిక్షణతో పి.జి నుండి ఇక్కడి దాకా ప్రణాళికబద్ధంగా ఎదిగాడు. ఆచార్య కొలకలూరి ఇనాక్ గారి ఆది ఆంధ్రుడు కావ్య సౌందర్య దృక్పథమైనా, 'దళిత సాహిత్యంలో ఆత్మకథల' అంతరంగాన్నైనా ఉత్తమ స్థాయిలో పరిశోధన చేసి విశ్లేషించాడు. ఇప్పుడు ఈ నానీల్లోనూ తనలో గూడుకట్టుకొని పోయిన భావాలను కవిత్వీకరించి సాహిత్యానికి మరింత సన్నిహితుడయ్యాడు. తన కవితా సృజన నానీలతోనే ఆగిపోకుండా వచన కవితాధారగా రూపుదిద్దుకోవాలని ఆశిస్తున్నాను.

పుస్తకం: నానీల సుగంధం

రచయిత: డా. గిన్నారపు ఆదినారాయణ

వెల: రూ.100

లభ్యం: 3-1-23/23, ప్లాట్ నెం-304

రామ్ శంకర్ నగర్, ఓల్డ్ రామాంతపూర్

9949532456


సమీక్షకులు

డా.ఎస్.రఘు,

అసిస్టెంట్ ప్రొఫెసర్, ఓయూ

98482 08533

Next Story

Most Viewed