'ప్రజల చేత ఛీ కొట్టించుకున్నారు.. మీతో మాకు పోలికేంటి?'.. ఈటల రాజేందర్ ఘాటు వ్యాఖ్యలు

by Prasad Jukanti |
ప్రజల చేత ఛీ కొట్టించుకున్నారు.. మీతో మాకు పోలికేంటి?.. ఈటల రాజేందర్ ఘాటు వ్యాఖ్యలు
X

దిశ, డైనమిక్ బ్యూరో:చీమలపుట్టలో పాములు చేరినట్టు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని బీజేపీ నేత ఈటల రాజేందర్ విమర్శించారు. అనేక స్కాములు, అవినీతి కార్యక్రమాలకు ఆ పార్టీ నెలవు అని, 40 ఏళ్లపాటు సగటు భారతీయుడు తలదించుకునే పరిస్థితి తీసుకొచ్చిన కాంగ్రెస్ పార్టీని దేశ ప్రజల చేత ఛీ కొట్టించుకున్న పార్టీ అని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో గతిలేక ప్రజలు అధికారంలోకి తీసుకొస్తే వారి డాబు, దర్పం, వసూళ్ళు మళ్లీ మొదలయ్యాయన్నారు. ఎంతకాలం ఈ దౌర్జన్యం భరించాలో అని ప్రజలు ఆందోళన చెందుతున్నారన్నారు. ఆదివారం వరంగల్, ఖమ్మం, నల్గొండ ఎమ్మెల్సీ బై పోల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా నల్గొండ జిల్లాలో బీజేపీ అభ్యర్థి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి తరపున ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సామాజిక న్యాయం పాటించిన బీజేపీకి కాంగ్రెస్ తో పోలిక ఏంటని ప్రశ్నించారు. ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీ ఇర్రలవెంట్ అని, ఆ పార్టీ గురించి ప్రజల్లో చర్చ జరగడం లేదన్నారు. కేసీఆర్ తీరును అర్థం చేసుకున్న తర్వాత ఆయన్ను గౌరవించడం అధర్మం అని, కొనసాగించడం రాష్ట్రానికి క్షేమమే కాదు అని ప్రజలు ఇంటికి పంపించారన్నారు.

కాంగ్రెస్ పార్టీ నైజం తెలిసిన వాడిని:

కాంగ్రెస్ పార్టీ నైజం తెలిసిన వాడినని ఆ పార్టీ హామీల వల్ల ఆర్థిక వ్యవస్థ తిరోగమనంలోకి వెళ్లే ప్రమాదం ఉందని ఆర్థికవేత్తలు మాట్లాడుతున్నారని హెచ్చరించారు. అమలు కానీ అనేక హామీలను కాంగ్రెస్ పార్టీ వాగ్దానం చేసింది. కానీ మోడీ దేశం ముఖ్యం అని భావించి ప్రపంచంలో దేశాన్ని మంచి స్థానంలో పెట్టాలని కృషి చేస్తున్నారని, పవర్ ఓరియెంటెడ్ కాకుండా పీపుల్స్ ఓరియెంటెడ్ పాలన అందిస్తున్నారన్నారు. అందువల్లే 10 ఏళ్ల పాలన తర్వాత కూడా ఫిర్ ఏక్ బార్ మోడీ సర్కార్ అని దేశ ప్రజలు నినదిస్తున్నారని చెప్పారు. వరంగల్, ఖమ్మం, నల్గొండ ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో మేధావులంతా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలన్నారు. ఎవరి క్యారెక్టర్ ఏమిటి? ఎవరి కమిట్మెంట్ ఏంటో చూసి ఓటు వేయాలని పిలుపునిచ్చారు. నరేంద్ర మోడీ సంకీర్ణ రాజకీయాలకు స్వస్తి పలికారని.. 1వ ఆర్థిక వ్యవస్థగా ఉన్న భారత్ ఇప్పుడు ఐదవ ఆర్థిక వ్యవస్థకు తీసుకు వచ్చారన్నారు. దీనిని మూడవ స్థానానికి తీసుకురావడమే లక్ష్యంగా మోడీ పని చేస్తున్నట్లు చెప్పారు.

ప్రజలకు బాధ వస్తే అంతిమ భారం దేవుని మీదనే ఉంటుందని ఈ విషయం కొంత మంది నాయకులు మర్చిపోతున్నారు కానీ ప్రజల విశ్వాసాన్ని గౌరవిస్తూ రామ మందిరాన్ని నిర్మించి దేశానికి అంకితం చేసిన నాయకుడు నరేంద్ర మోడీ అన్నారు. సామాజిక సమతుల్యాన్ని పాటించిన పార్టీ బీజేపీ అన్నారు. 27 మంది ఓబీసీలు, 12 మంది దళిత, 8 మంది గిరిజన ఐదు మంది మైనారిటీ మంత్రులు ఉన్న ఏకైక క్యాబినెట్ నరేంద్ర మోడీ క్యాబినెట్ అన్నారు. ఒక మహిళను ఆర్థిక మంత్రి చేసిన ఘనత మోడీదని, యూపీఏ చైర్ పర్సన్ గా సోనియా గాంధీ ఉన్న తర్వాత కూడా కాంగ్రెస్ మహిళా బిల్లును పెట్టలేకపోయింది కానీ దానిని అమలు చేసి చూపిస్తున్న నాయకుడు నరేంద్ర మోడీ అన్నారు. 33% మహిళలకు చట్టసభల్లో రిజర్వేషన్ కల్పించామమని మీకు మాకు పోలిక ఏంటని విమర్శించారు.

22వ తేదీ వరకు అక్కడే:

ఎమ్మెల్సీ ఉప ఎన్నికల ప్రచారంలో భాగాంగా ఈటల రాజేందర్ మరో నాలుగు రోజులు నల్గొండ జిల్లాలోనే మకాం వేయనున్నారు. ఈ మేరకు ఇవాళ నల్గొండ చేరుకున్న ఆయన ఈనెల 22వ తేదీ వరకు అక్కడే ఉండి ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు.

Advertisement

Next Story

Most Viewed