పల్లెల్లో మొలిచిన ‘‘నల్లకొడిసె వన్నెకాడు’’

by Ravi |   ( Updated:2024-07-07 18:45:19.0  )
పల్లెల్లో మొలిచిన ‘‘నల్లకొడిసె వన్నెకాడు’’
X

‘‘కవిత్వమంటే శ్వాసించే ఆలోచనలు, జ్వలించే శబ్దాలు’’ అంటాడు ఆంగ్ల కవి. 19వ శతాబ్దానికి వచ్చేనాటికి కవిత్వం పల్లెబాట పట్టింది. సామాన్య జనాలకు చేరువైంది. కవిత్వ శాస్త్రాల దారిని విడిచి సామాన్య జనుల గుండెల్లో పదిలంగా ప్రవేశించింది. వారి జ్ఞాపకాలను, గుర్తులను తవ్వితీసింది. పూజకు పనికి రాని గడ్డిపూల పరిమళానికి తలలూపింది. అక్కడి నుంచి మొలిచి వెలసిందే ఈ ‘‘నల్లకొడిసె వన్నెకాడు’’ కవిత్వ పుస్తకం. కొడిసెలలో నల్లకొడిసె, పాలకొడిసె అనే రకాలుంటాయి. నల్లకొడిసె అనే చెట్టు చాలా అరుదుగా ఉంటుంది. ఇది నిటారుగా పెరుగుతుంది. ఈ అరుదైన చెట్టును అందరికి తెలపడానికి ఈ వన్నెకాడు దానిని ఎంచుకుని కావ్య స్థాయిని పెంచాడు.

పంట పొలాల్లో ప్రాణదాత

‘‘కుక్కపిల్ల, అగ్గిపుల్ల, సబ్బుబిల్ల... హీనంగా చూడకు దేన్ని, కవితామయమేనోయి అన్నీ’’ శ్రీశ్రీ అన్నట్లుగా కవితా వస్తువులను ఎంచుకున్నాడు ఈ వర్తమాన కవి నాగిళ్ల రమేష్‌. ‘‘కవిత్వం అంటే పదాల చక్రంలో బిగిసిన అక్షరాల కూర్పు కాదు. కవిత్వం అంటే ప్రవహిస్తున్న నది నుండి విడివడి పచ్చని పంట పొలాల్లో సాగుతున్న ప్రాణదాత. చూరు నుండి నిశ్శబ్దంగా జారుతున్న చిట్టి చినుకు.’’ పెరుగు రామకృష్ణ అన్నట్లు పచ్చని పంట పొలాల నడుమ పల్లె వాతావరణంలో స్వచ్ఛమైన గాలిని ఊపిరిగా పీల్చుకోవడానికి ఆక్సిజన్‌ అవుతుంది ఈ కవిత సంపుటి.

అమ్మలు, అయ్యలు మాట్లాడే భాష

ఈ సంపుటిలో కవి ఎక్కడా కనిపించడు. మనకు మనమే ఎదురుబొదురు అవుతుంటాం. మన తల్లులు, అయ్యలు మాట్లాడే భాషనే వినిపిస్తుంది. పల్లె చిత్రాలను కళ్ళముందు చిత్రిస్తుంది. ఈ సంపుటిలో శ్రామిక జీవులు, రైతుల బతుకులు, గ్రామీణుల జీవితాలను, నమ్మకాలను వాళ్ల నుడికారాన్ని కవిత్వ స్థాయిని తీసుకెళ్లారు. చక్కగా భావాన్ని వ్యక్తీకరించారు. కవిత్వం చదువుతుంటే ఒక మనిషితో మాట్లాడుతున్నట్టు, మనసుతో మాట్లాడుతున్నట్టు అనిపిస్తుంది. గుడిసె నా బతుకు, నాకాయుషూ / నా ఊహలు పిచ్చుకగూళ్ళు కట్టుకున్నవి ఈ గుడిసెలోనే / నా ఆకటి కుండను కుక్క ముట్టకుంట / కాపాడిరది కూడా అదే/ తలదాచుకోవడానికి గుడిసెను పిచ్చుక గూడు కట్టుకున్నట్లు కట్టుకుంటారు/ అన్నం కుండను కుక్క ముట్టకుండ కాపాడింది ఆ గుడిసె. / ఇందులో కవి తన జీవితానుభవాన్ని పంచుకున్నారు. స్వయంగా తాను చూసిన దృశ్యాన్ని చిత్రించారు.

మన్ను.. ఓ కన్నీటి వర్ణమాల

మన్నే/ అతని ఆకలి ఆకాశం/ మన్నే/ తన కన్నీటి వర్ణమాల / మన్నే తన దేహం తన దేవర... మంటికి, ఒంటికి అవినాభావ సంబంధం ఉంది ఒక్క రైతుకే. అవి రెండు వేరువేరు కావు. రైతు పుట్టినప్పటినుంచి చనిపోయేవరకూ, నిద్ర లేచినప్పటి నుంచి పడుకునే వరకు తాను ఒంటరిగా మాట్లాడుకుంటడు. మట్టితో ముచ్చటించుకుంటడు. దానిపైనే తన ధ్యాసంతా, ఏ పంటవేయాలో, ఎలాంటి ఎరువులు వేయలో ఆలోచిస్తూ ఉంటాడు. ఆ మన్నే తన నింగి, నేల, పంట పండకపోయిన బాధతో, ఒకవేళ పండితే ఆనందంతో కన్నీటి వర్ణమాల అవుతాడు. ఎంతటి భావుకత ఇది. బడి పిల్లలు గుక్కపట్టి వర్ణమాలలను గట్టిగా చెబుతూ ఉంటారు. అలాంటిదే రైతు కన్నీటి వర్ణమాల ఇందులో ఎన్ని కావ్యాలనైనా రాయవచ్చు, చదువుకోవచ్చు. మన్ను కడుపుల తలకాయ బెడుత అంటూ తల్లి ఒడిలో తలపెట్టి పడుకున్న బాల్యంలా రైతు మన్ను కడుపుల తలకాయ పెట్టి తన బాల్యాన్ని తిరిగి పొందుతూ ఉంటాడు.

పల్లె పరిమళంతో గుబాళింపు

ఈ కవనమంతా పల్లె పరిమళంతో గుబాళిస్తుంది. పల్లెబాటలో పయనమైతే ఎదురయ్యే వ్యక్తులు, మాటలు, పాటలు, నుడుగులు, నమ్మకాలు అనేక దృశ్యాలు ఈ కవిత్వంలో కనిపిస్తుంది. ఇలా వరంగల్‌ ప్రాంత శ్రామిక జనుల విశ్వాసాలు, నమ్మకాలు సమగ్రంగా దీనిలో వర్ణించబడ్డాయి. ఇలాంటి కవిత పుస్తకాలు జిల్లాకు ఒకటి రావలసిన అవశ్యకత ఉంది. లేకుంటే ఇవన్నీ కనుమరుగవుతాయి. తరువాతి తరం కవులు ఈ శ్రామికుల అనుభవాలను, విశ్వాసాలను ఏ మాత్రం పట్టించుకోకుండా విలువ నివ్వకుండా కవిత్వం రాసుకుపోతుంటారు. ఇక తెలంగాణ శ్రామికుల నమ్మకాలు తరగని గనులు పాఠకుల ముందుకు ఎలా వస్తాయి? తెలంగాణ గ్రామీణ తత్వం ఎలా అర్థం అవుతుంది? ఈ వన్నెకాడుపై పరిణామానికి పూర్తి మినహాయింపు. ఇది ఒక రకంగా ఒజ్జబంతి కూడా. నాగిళ్ళ రమేష్‌ నాగలితో దున్ని, సేద్యం చేసి పల్లె యాసను, బాసను పట్టెడు గాదెలో నింపి చరిత్రలో చిరస్థాయిగా నిలిపారు. ఈ ‘‘నల్లకొడిసె వన్నెకాడి’’ని ఒకసారి స్పర్శించండి, పులకించండి. మీకు మీరు యాదికొస్తరు. పల్లె సూరువైపు తిరిగి చూస్తరు.

కవి: నాగిళ్ల రమేష్

పుస్తకం: నల్లకొడిసె వన్నెకాడు

పేజీలు: 158

వెల: రూ. 180

ప్రతులకు: 91004 82478

లభ్యం : నవోదయ, నవతెలంగాణ, ప్రజాశక్తి


సమీక్షకులు

బట్టు విజయ్ కుమార్

పరిశోధక విద్యార్థి, హెచ్‌సీయూ

95055 20097

Advertisement

Next Story

Most Viewed