- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
నా సాహిత్య పాఠ్యపుస్తకాలు..
37 వ హైదరాబాద్ పుస్తక ప్రదర్శన నిర్వాహకులు డిసెంబర్ 23 సాయంత్రం నన్ను మీకు నచ్చిన, మెచ్చిన ప్రభావితం చేసిన పుస్తకం గురించి మాట్లాడమని కోరినారు. ఈ విషయం గురించి గత వారం రోజులుగా యోచిస్తున్నాను. దేశంలో అత్యవసర పరిస్థితి తర్వాత ఒక సామాజిక బాధ్యత ఉన్న కవిగా, రచయితగా కన్నుతెరిచిన వాడిని.
నేను సిరిసిల్ల పౌర గ్రంథాలయం, సినారే అంతేవాసి హనుమాజీపేట నివాసి కనపర్తి సార్ ఇంటి గ్రంథాలు, జక్కని వెంకట రాజం సార్ తెప్పించే నెలనెలా వార ప్రత్యేక సంచికలు నా పఠనా స్థలాలు. అంతే కాకుండా మిక్కిలి ప్రభావితం చేసిన నిజాం వెంకటేశం సార్ సిరిసిల్లకు వచ్చినప్పుడల్లా తెచ్చి ఇచ్చే అప్పటికే పేరు ప్రఖ్యాతి గల కవులు, రచయితల పుస్తకాలు ఇలా ఎన్నెన్నో గ్రంథాలు చదివిన సోయితో నేను కవిగా రచయితగా గత ఐదు దశాబ్దాలుగా కొనసాగుతున్నా ఎన్నడూ ఇలాంటి అంశం గురించి మాట్లాడవలసి వస్తుందనుకోలేదు.
నూనె దీపం వెలుతురులో చదువు
నాలో బీజ ప్రాయంలో ఉన్న సాహిత్య జిజ్ఞాసతో రోజు పొద్దున్న పనికి పోయి వచ్చి సాయంత్రం పుస్తకం తెచ్చుకొని మా మానేరు వాగులో చదివే వాడిని. కొన్ని పుస్తకాలు నన్ను కన్నీటి పర్యంతం చేస్తే మరికొన్ని పుస్తకాలు అనేక ప్రశ్నలు నా ముందు నిలిపినాయి. మా ఊరు తంగళ్ళపల్లి మానేరు ఇవతలి వైపు ఉంటే, అవుతలి ఒడ్డుకు సిరిసిల్ల ఉంటది. మధ్యలో వాగు మాత్రమే అడ్డంగా ఉండేది. ఆ రోజుల్లో అంటే 1970 దశకం చివరలో మా ఇంట్లో కరెంటు ఉండేది కాదు. గ్యాస్ నూనె ఎక్క దీపం వెలుతురులో ఒకే దఫా ఎన్నెన్నో పుస్తకాలు కళ్లలో వత్తులు వేసుకుని చదివాను. మంచి చెడ్డ పుస్తకాలు అనేకం చదివి అందులో నుంచి మంచి సాహిత్య పుస్తకాలను ఎన్నిక చేసుకోవాల్సి వచ్చేది. ఒకానొక సందర్భంలో 40 కిలోమీటర్ల దూరంలో ఉన్న గ్రామానికి చెందిన మిత్రుడు చెప్పగా ఆ ఊరుకి సైకిల్ మీద పోయి పుస్తకం తెచ్చుకొని అధ్యయనం చేసిన రోజులూ ఉన్నాయి. ఎక్క దీపం పొగ ముక్కులోకి పోయే నల్లని మసిని తుడుచుకొని చదువుకున్న కాలం అది.
నా సాహితీయానంలో వాళ్లే మైలురాళ్లు..
ఇప్పుడు 50 ఏళ్ల వెనక్కి తిరిగి చూసుకుంటే, నా సాహిత్య వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దిన వారిని తలుచుకోవాల్సిందే మరి. అప్పుడు పత్రికలు విజయవాడ నుండి వస్తుండేది. ఆంధ్రప్రభ ఆదివారం, సోమవారం సాహిత్య పేజీల కోసం సిరిసిల్ల పెద్ద మోరి పక్కన ఉండే మోచీ మల్లయ్య డబ్బా చూరుకు నాకోసం చెక్కి ఉంచేవాడు. ఇకపోతే ఆంధ్రజ్యోతి ఆదివారం, సోమవారం సాహిత్య సంచికలు బ్రదర్స్ టైలర్ నరసయ్య షాప్‌లో ఎక్కడో ఒకచోట నాకోసం దాచి పెట్టేవాడు. బస్టాండులో పేపర్లు అమ్మే లక్ష్మీ రాజం వేప చెట్టు కింది డబ్బా దగ్గర కొంచెం కొంచెం చూసి చూడనట్టు చదువుకోనిచ్చేవాడు. ఇట్లా చెప్పుకుంటూ పోతే పైసా కూడా నా జేబులో లేని రోజుల్లో నా సాహిత్య వ్యక్తిత్వ వికాసం దారిలో మైలురాళ్ల లాంటి సామాన్యులు చాలామందిని యాది చేసుకోవలసి ఉంటుంది. నాకు బుద్ధి తెలిసిన తర్వాత వాళ్ల కాళ్లకు మొక్కుదామంటే వాళ్లలో కొందరు ఇప్పుడు శాశ్వతంగా లేరు. వాళ్ళ జ్ఞాపకాలు తడి తడిగా ప్రతిరోజు ఇప్పటికీ నన్ను పట్టి కుదిపి కదిపి వేస్తున్నాయి.
నన్ను సానబెట్టిన పుస్తకాలు, రచయితలు..
గురజాడ, శ్రీపాద సుబ్రమణ్య శాస్త్రి చలం రాజేశ్వరి ఓ పువ్వు పూసింది కథలో అనితర సాధ్యమైన వాక్యాలు, శ్రీ శ్రీ మహాప్రస్థానం, గోపీచంద్ అసమర్ధుని జీవయాత్ర రావిశాస్త్రి భూషణం కథలు బుచ్చిబాబు చివరకు మిగిలేది. రచయిత్రులు పత్రికల్లో సీరియళ్లు రాస్తున్న కాలం. కాళోజీ, వరవరరావు, దాశరధి, సి నారాయణ రెడ్డి, గద్దర్, శివసాగర్ మొదలైనవారి కవిత్వం, వారు పోయిన కొత్త పోకడలు, సాహిత్యంలో నెలకొల్పిన తమవైన సొంత మార్గాలు, నిర్మించిన విలక్షణమైన దారుల పాదముద్రలు చాలా ఉన్నాయి. గాంధీ జీవిత చరిత్ర, నెహ్రూ ఇందిరకు రాసిన లేఖలు, బుద్ధుడు, పూలే, అంబేద్కర్ చింతనలు, పుచ్చలపల్లి సుందరయ్య, బద్దం ఎల్లారెడ్డి, రావి నారాయణరెడ్డి తదితరుల జీవిత చరిత్రలు తరిమెల నాగిరెడ్డి రాసిన 'తాకట్టులో భారతదేశం', పౌరాణిక భాగోతాలు, హరికథలు, పటం కథలు, తోలుబొమ్మలాటలు, గోత్రాల నరసయ్య చుట్టూ రేకుల మధ్య వేసే నాటకాలు... ఇలా చెప్పుకుంటూ పోతే అనేక మంది కవులు రచయితలు వారి వారి పుస్తకాలు నన్ను నేను సాన పట్టుకోవడానికి ఎంతో తోడ్పాటును అందించాయి. అత్యంత ప్రభావితం చేశాయి.
మార్క్సిజం ప్రసరించిన కొత్త కాంతి
ఇవన్నీ ఒక ఎత్తు అయితే సామాజిక తాత్విక అధ్యయన గ్రంథాలు మరొక ఎత్తు. మార్క్స్ లెనిన్‌లు కమ్యూనిస్టు మేనిఫెస్టో, పెట్టుబడిదారీ విధానం అదనపు విలువ, కార్మికులు రైతులు యజమానులు లాభనష్టాల తీరుతెన్నులను అరటిపండు ఒలిచి చేతిలో పెట్టినట్టు చూపిన తీరు నా సాహిత్య ప్రయాణానికి తెలివిడికి చేకూర్పు. నా చీకటి వెలుగుల దారిలో సరికొత్త కాంతులను ప్రసరింప చేశాయి. ఇవీ రేఖామాత్రంగా నా సాహిత్య యాత్రలో అధ్యయనానికి సంబంధించిన విషయీవిషయాలు.
ఉద్యమాలు నేర్పిన జాగరూకత
నా చుట్టూ ఉన్న నా స్థలకాలాల సమాజం మనుషులు ఎగుడు దిగుళ్లు, ఎత్తు పంపులు కన్నీళ్లు కష్టాలు సంతోషాలు దిగులు వలసలు నా సాహిత్య వివేచనకు మిక్కిలి దోహదకారిగా పని చేశాయని ఇప్పుడు అనిపిస్తున్నది . అంతే కాకుండా నా చుట్టూ పక్కల ఉత్తర తెలంగాణలో ఉవ్వెత్తున ఎగిసిపడుతున్న ఉద్యమాలు పోరాటాలు ఆరాటాలు ఆకాంక్షలు లక్ష్యాలు తృణప్రాయంగా ప్రాణాలను ప్రజల కోసం అర్పించే త్యాగాలు నా సాహిత్య నిమ్నోన్నతాలలో నిరంతరం నన్ను జాగరూకతతో మెలిగేలా చేశాయి.
ప్రజలే సాహిత్య జీవగర్రలు
తీరా నా ఈ 70వ వయస్సు పడిలో సుదీర్ఘకాలం వెనుతిరిగి చూసుకుంటే, సమీక్షించుకుంటే పుస్తకాల కన్నా ఎక్కువగా... నన్ను మెచ్చిన, నచ్చిన ప్రభావితం చేసిన గ్రంథాల కంటే ఎక్కువగా నిచ్చెన మెట్ల సమాజంలో శ్రమ జీవన సౌందర్యాన్ని నింపుకొన్న తేజోవంతమైన మనసులు నన్ను మిక్కిలి అత్యంత ప్రభావితం చేసి నన్ను ఎల్లకాలం సాహిత్య ప్రవాహంలో కొనసాగేలా చేశాయి. నిశ్చయంగా ప్రజలు, సమాజమే సాహిత్య పాఠ్యపుస్తకాలు, జీవగర్రలు అనిపిస్తున్నది, తోస్తున్నది.
(హైదరాబాద్ పుస్తక ప్రదర్శనలో ప్రభావితం చేసిన గ్రంథం గురించిన నా ప్రసంగం)
-జూకంటి జగన్నాథం
94410 78095