కథా-సంవేదన: స్వేచ్ఛ

by Ravi |
కథా-సంవేదన: స్వేచ్ఛ
X

ఈ కథని చాలా రోజుల క్రితం చదివాను రచయిత ఎవరో తెలియదు. మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. కథ లోకి వెళ్దాం. పట్టణం చివరలో ఉన్న అశ్రమానికి టామ్ వెళ్లాడు. తన ఆధ్యాత్మిక గురువు డ్వైర్‌ను సందర్శించాడు. కాస్సేపు మామూలు విషయాలు మాట్లాడినాడు. కొంత సమయం తరువాత ప్రజలు సంతోషంగా ఉండటానికి ఏమి కావాలి అని టామ్ తన గురువును అడిగాడు. నువ్వు ఏమనుకుంటున్నావు..డ్వైర్ తిరిగి టాం ని అడిగాడు. టామ్ ఒక్క క్షణం ఆలోచించాడు. ప్రజల కనీస అవసరాలను తీర్చినట్లయితే చాలు, జవాబు చెప్పాడు టామ్. 'కనీస అవసరాలు అంటే ఏమిటీ .. నీ ఉద్దేశం లో..' మళ్లీ ప్రశ్నించాడు గురువు.

'కనీస అవసరాలు అంటే తినడానికి కొంత తిండి, నివసించడానికి ఇంత స్థలం, వాళ్లకి హాని కలుగకుండా సురక్షితంగా వుండాలి. వాళ్లు చేయడానికి చేతి నిండా పని ఉంటే చాలు. వారిని సంతోషంగా ఉంచడానికి ఇవి సరిపోతాయని నేను భావిస్తున్నాను.' అన్నాడు టామ్. గురువు డ్వయర్ ముఖం చిట్లించాడు. టామ్ చెప్పిన విషయాన్ని గురువు అంగీకరించినట్టుగా లేదు. అంతే కాదు గురువు వెంటనే లేచి తలుపు దగ్గరకు వెళ్ళాడు, తనను అనుసరించమని తన శిష్యునికి చెప్పాడు. పెరడు వైపు తీసుకొని వెళ్లాడు. అక్కడ ఓ కోళ్ల ఫారం వుంది. నిజానికి అది కోళ్ల ఫారం కాదు. చాలా కోళ్లు వున్న ప్రదేశం అది. వాళ్లు వాటి దగ్గరికి వచ్చేసరికి, లోపల నుండి అలజడి కనిపించింది. కోళ్లు అరవడం మొదలు పెట్టాయి. తనని అక్కడికి ఎందుకు తీసుకొని వచ్చాడో టామ్‌కి అర్థం కాలేదు. టామ్ వరుసగా వున్న కోళ్లను చూశాడు, అవి అన్నీ వాటి వాటి స్వంత చిన్న పంజరాలలో బంధించబడి ఉన్నాయి

గురువు వాటి తలుపు తెరిచాడు. టామ్ ఆశ్చ్యర్యం గా చూశాడు. గురువు టామ్ వైపు చూసి, "వారికి ఆహారం ఉందా" అని అడిగాడు.

'అవును. వుంది.' చెప్పాడు టామ్ 'వాటికి నీడ ఉందా?' అని అడిగాడు గురువు 'వుంది' అని సమాధానమిచ్చాడు టామ్

'అవి పిల్లి, నక్కలు, ఇతర మాంసాహారుల నుండి సురక్షితంగా ఉన్నాయా,' అని గురువు అడిగితే 'వున్నాయి' అని చెప్పాడు టామ్.

'అవి చేయాల్సిన పని ఉందా', తిరిగి ప్రశ్నించాడు. 'అవును అవి గుడ్లు పెడతాయి.' అన్నాడు టామ్

'అవి సంతోషంగా కనిపిస్తున్నాయా.' గురువు రెట్టించాడు. దాంతో టామ్ కోళ్ళను దగ్గరగా చూశాడు. సంతోషకరమైన కోడి ఎలా ఉంటుందో అతనికి నిజంగా తెలియదు. అవి నవ్వుతున్నాయా.. కోళ్లు కూడా సంతోషంగా ఉండగలవా.. అతనికి అర్థం కాలేదు. అతను సమాధానం చెప్పేలోపు, గురువు, 'నాతో రా' అన్నాడు. గురువుని అనుసరించాడు టామ్. వారు ఆ పెరడుని విడిచిపెట్టి, మరొక వైపు ప్రయాణం చేసారు. ఓ సందులోకి నడిచారు. అది కూడా ఓ పెద్ద పెరడు. అది చాలా కోళ్లతో నిండిపెద్ద ఉంది. అవి తమ ఆహారం కోసం పెరట్లో అటూ, ఇటూ తిరుగుతూ ఉన్నాయి.

"ఈ కోళ్లు సంతోషంగా కనిపిస్తున్నాయా" అడిగాడు గురువు. ఇది వింత ప్రశ్నలా అనిపించింది టామ్‌కి. వాటిని తీవ్రంగా పరిశీలించాడు. అక్కడ ఓ భిన్నమైన వాతావరణం ఉందని అతనికి అనిపించింది. ఈ కోళ్లు మరింత సహజమైన స్థితిలో ఉన్నట్లు కూడా అనిపించింది. ఫలితంగా అవి చలాకీగా వున్న కోడిపిల్లల మాదిరిగా కనిపించాయి. 'బహుశా, సంతోషంగా వుండి వుంటాయి.' టామ్ ప్రతిస్పందించాడు. వాస్తవానికి అవి ఎంతో సంతోషంగా వున్నాయి.

'మరీ అంత జాగ్రత్తగా, అసంబద్ధంగా ఉండకు టామ్' అని గురువు అన్నాడు. టామ్ ఏమీ మాట్లాడలేదు. "ఇదిగో ఓ ముఖ్యమైన విషయాన్ని గమనించు టామ్. రెండు రకాల కోళ్లను నువ్వు చూశావు. వీటికి ఆహారాన్ని, నీడని మనం ప్రత్యేకంగా ఇవ్వాల్సిన అవసరం లేదు. మొదటివి ఒక చిన్న ప్రాంతానికి పరిమితమై ఉన్నాయి, అక్కడ వాటికి మనం చేయగలిగినదంతా చేస్తున్నాం. కానీ అవి సంతోషంగా లేవు. ఈ కోళ్లు, ఈ అందమైన పక్షులు, ప్రపంచంలోని నక్కలు మరియు గద్దలకు ఎక్కువ బహిర్గతం అయినప్పటికీ, నిజంగా వీటికి జీవించడానికి అవకాశం ఉంది. మనందరికీ మనం ఎలా జీవించాలో ఎంపిక చేసుకునే స్వేచ్ఛ ఉంది, అని గురువు చెబుతూ ఇలా కొనసాగించాడు,

'బ్యాటరీ కోళ్ళ మాదిరిగా పరిమితమైన, సురక్షితమైన ప్రదేశంలో జీవిస్తే అది జీవనం కాదు. స్వేచ్ఛగా తిరుగాడే కోళ్ల మాదిరిగా జీవించాలి. కొంచెం ప్రమాదకరమైనదని అనిపించినా ఈ ప్రపంచంలో తిరుగుతూ ఎగుడు దిగుడులను ఎదుర్కుంటూ సహజంగా జీవించాలి. చెప్పాడు గురువు. అక్కడితో వూరుకోలేదు. మళ్లీ ఇలా అన్నాడు. నువ్వు ఇంతకు ముందు ఆనందం గురించి అడిగావు కదా.. ఎలా జీవిస్తే ఆనందంగా వుంటుందో ఇప్పుడు నీకు అర్థమై వుంటుంది. నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. నువ్వు జీవించాలి. నువ్వే కాదు. ఎవరైనా అలాగే జీవించాలి.'

టామ్‌కి అర్థమైంది.

మంగారి రాజేందర్ జింబో

Advertisement

Next Story

Most Viewed