- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కథా సంవేదన: భావానుబంధాలు
ఈ మధ్య చాలాసార్లు ఏవో గుర్తుకొస్తున్నాయి. మా వేములవాడలో చిన్నప్పుడు నేను తిరిగిన సందులు గుర్తుకొస్తున్నాయి. అట్లాగే ధర్మపురిలో చదువుకుంటున్నప్పుడు బడికి ఓ చిన్న సందు నుండి వెళ్ళేవాళ్ళం. అలా వెళ్తుంటే మా బడి దగ్గర కొంచెం తీరుబడి వుండటం వల్ల ఇవి గుర్తుకొస్తున్నాయా అని అనుకునేవాన్ని. అదేం కాదు. కోర్టు పని ఒత్తిడిలో వున్నప్పుడు కూడా నేను కరీంనగర్‌లో జూనియర్ న్యాయవాదిగా ఓ ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు చిన్న ఇంట్లో కిరాయికి వుండేవాళ్ళం. ఆ ఇల్లు తరచు గుర్తుకు వచ్చేది. చివరికి ఓ రోజు ఆ ఇంటిని నేనూ మా ఆవిడా చూసి వచ్చాం.
ఇలా చూడాలని అన్పించడం నాకే వుందా? చాలా మందికి వుంటుందా అని ఆలోచిస్తే చాలా సంఘటనలు గుర్తుకువచ్చాయి. నేను కొత్తగా ఉద్యోగంలో చేరినప్పుడు మారేడ్‌పల్లిలోని జడ్జెస్ క్వార్టర్స్ లో వుండేవాళ్ళం. మా పిల్లల బాల్యం అక్కడే కొంతకాలం గడిచింది. అక్కడి క్వార్టర్‌తో వాళ్ళకి ఏవో జ్ఞాపకాలు వున్నాయి. మా అబ్బాయి ఓ సారి అమెరికా నుంచి వచ్చి ఆ క్వార్టర్స్ చూసి వచ్చాడు. పోయిన సంవత్సరం తిరుపతి వెళ్ళినప్పుడు నేను మా ఆవిడా అక్కడ మేం వున్న క్వార్టర్స్‌ని చూసి వచ్చాం. ఇప్పుడు అందులో ఎవరూ ఉండటం లేదు. పాడు పడినట్టుగా ఉంది. మా మనస్సు బాధతో మూలిగింది.
ఇలా తాము గతంలో వున్న ఇల్లుని, ప్రాంతాలని చూడటం చాలామంది చేస్తూ ఉంటారు. నేను నిజామాబాద్‌లో పని చేస్తున్నప్పుడు ఇలాంటి సంఘటనలు రెండు జరిగాయి. మొదటి సంఘటన నేను క్వార్టర్‌లో వున్నప్పుడు జరిగింది. మరో సంఘటన నేను ప్రైవేట్ ఇంట్లో ఉన్నప్పుడు జరిగింది. ఓ రోజు ఉదయం తొమ్మిదిన్నర అవుతుంది. డిక్టేషన్ ముగించి బ్రేక్‌ఫాస్ట్ చేయడానికి సిద్ధమవుతున్నాను. అప్పుడు మా అటెండర్ వచ్చి నాకన్న ముందు పనిచేసిన న్యాయమూర్తి కొడుకు వచ్చాడని చెప్పాడు. లోపలికి రమ్మనమని చెప్పాను. ఆ కుర్రవాడు వచ్చాడు. అతను నాతోపాటు హాస్టల్‌లో వున్న సీనియర్ కొడుకు. వాళ్ళ నాన్న గురించి నాలుగు ప్రశ్నలు ఆయన గురించి నాలుగు ప్రశ్నలు అడిగిన తర్వాత ఏం పని మీద వచ్చావు? ఏమైనా సహాయం కావాలా? అని అడిగాను.
'పనేం లేదు అంకుల్' ఈ క్వార్టర్ లో నాలుగు సంవత్సరాలు వున్నాం. నా చిన్నతనం ఇక్కడ గడిచింది. ఓ సారి చూసి పోదామని వచ్చాను అంతే! అన్నాడు. ఆ తరువాత ఇల్లంత కలియ తిరిగాడు. కాఫీ తాగి వెళ్ళిపోయాడు.కొంతకాలం తరువాత నిజామాబాద్ లోనే నాకు వేరే కోర్టుకి బదిలీ కావడం వలన క్వార్టర్ మారి ఓ ప్రైవేట్ ఇంటికి వెళ్లాల్సి వచ్చింది. అక్కడ కూడా ఇలాంటి సంఘటనే ఒకటి జరిగింది. ఓ రోజు ఉదయం మా అటెండర్ వచ్చి ఎవరో వచ్చారని చెప్పాడు. వివరాలు తెలుసుకుంటే అతను ఆ ఇంటిలో కొంతకాలం కిరాయికి వున్నానని చెప్పాడు. అతను వచ్చాడు. నా అనుమతితో ఇల్లంతా కలియతిరిగాడు. అతని ముఖంలో ఏవో భావాలు. థాంక్స్ చెప్పి అతను వెళ్ళిపోయిండు.
ఓ 20 సంవత్సరాల క్రితం హిమయత్‌నగర్ లో ఓ ప్లాట్ కొనుక్కున్నాను. మా పిల్లలు అక్కడే పెరిగి పెద్దవాళ్ళు అయ్యారు. 7వ తరగతి నుంచి ఇంజనీరింగ్ వరకు అక్కడే వుండి చదువుకున్నారు. ఆ ఇంటిలో కూడా వాళ్ళ బాల్యం ముడిపడి ఉంది.కాలక్రమంలో అది చిన్నగా అన్పించి, ఓ పెద్ద విల్లాలోకి మారిపోయాను. ఇల్లు ఎప్పుడు పెద్దగా అవుతుందో ఎప్పుడు చిన్నగా అవుతుందో చెప్పలేం. విల్లాకి మారిపోయిన తరువాత ఆ ఫ్లాట్ అవసరం లేదని అనిపించింది. అమ్మెద్దామని అన్పించింది.
అదే విషయం మా అబ్బాయి అనురాగ్‌తో చెప్పాను. వాడు అమెరికా నుంచి వచ్చి పది రోజులవుతోంది. 'వద్దు డాడీ! ఆ ఇంటితో మా బాల్యం ముడిపడి ఉంది అది అలాగే వుండనీ' అన్నాడు.అంతే! ఆ ఆలోచనని విరమించుకున్నాను. ఈ సంభాషణ జరిగిన రెండు రోజుల తరువాత వాడు ఆ ఫ్లాట్‌కి వెళ్ళాడు తన భార్యను తీసుకొని. వున్న క్వార్టర్ పట్ల, కిరాయి ఇంటి పట్ల ఏర్పడిన ప్రేమనే వదులుకోలేనప్పుడు, స్వంత ఇంటి మీద మమకారాన్ని ఎలా పొగొట్టుకుంటారు. భావానుబంధాలు మనిషికి ఎక్కువ. ప్రేమ గల మనుషులకి మరీ ఎక్కువ.
మంగారి రాజేందర్ జింబో
94404 83001
Also Read...
అంతరంగం: సంఘ సంస్కరణల కథల శిల్పి రేగులపాటి కిషన్ రావు
- Tags
- katha samvedana