కథా-సంవేదన: ఇది పులి కథ కాదు

by Ravi |
కథా-సంవేదన: ఇది పులి కథ కాదు
X

ఈ మధ్య ఓ కథ చదివాను. నాకు బాగా నచ్చింది. మీకూ నచ్చుతుంది. చదవండి. ఒక వ్యక్తి అడవి గుండా వెళుతుండగా, ఒక కుంటి నక్క కనిపించింది. అది తనను తాను ఎలా పోషించుకుంటుంది. ఈ ఆలోచన రాగానే అతను అలోచనలో పడిపోయాడు. దాని బతుకు గురించి ఆశ్చర్యపోయాడు. సరిగ్గా అదే సమయంలో, ఒక పులి తన నోటిలో ఓ జంతువుని పట్టుకుని అక్కడికి సమీపించింది. ఆ జంతువుని పులి నిండుగా తిని మిగిలిన భాగాన్ని అక్కడే వదిలి వెళ్లిపోయింది. నక్క మెల్లిగా, కష్టంగా అక్కడికి వచ్చి ఆ మిగిలిన జంతువుని తిన్నది. దేవుడు ఈ నక్కకు ఆ విధంగా సహాయం చేసాడని ఆ వ్యక్తి అనుకుంటాడు. 'దేవుడు నక్కకు ఆ విధం గా సహాయం చేస్తే, నాకు కూడా ఆ దేవుడు సహాయం చేస్తాడు'అని ఆ మనిషి అనుకుంటాడు. అలా అనుకొని అతను ఇంటికి తిరిగి వెళ్లి, తన ఇంట్లో తలుపులు మూసుకుని, స్వర్గం నుంచి దేవుడు తనకి ఆహారం పంపిస్తాడని అనుకుంటాడు. అతను అలాగే వేచి వుంటాడు.

*

అలా ఏమీ జరగలేదు. అతను అలాగే మంచం మీద పడుకుంటాడు. నక్కకు అందించిన విధంగా దేవుడు తన కోసం ఆహారం అందిస్తాడని అతను అలాగే వేచి ఉంటాడు. వారం రోజులు గడుస్తాయి. కానీ, అతనికి స్వర్గం నుంచి ఎలాంటి ఆహారం రాదు. అతను ఆకలితో అలాగే ఉండిపోతాడు. ఏ పని చేయకుండా వారం రోజులు అట్లాగే వుండిపోతాడు. ఆకలికి అలమటించి చివరికి అతను బయటకు వెళ్లి పని చేయలేని స్థితిలోకి వెళ్లిపోతాడు. దేవుడిని తిట్టుకుంటూ వుంటాడు. అతను అలా బలహీనంగా ఉన్నప్పుడు, ఒక దేవదూత ప్రత్యక్షం అవుతాడు. ఆ దేవదూతని చూసి అతను ఇలా అడుగుతాడుజ 'నాకు పంచభక్ష పరమాన్నాలు తీసుకొని రాలేదా?'

'లేదు'అన్నాడు దేవదూత. 'ఆ నక్క కి ఇచ్చాడు కదా! నాకు ఎందుకు పంపించలేదు?'

*

'కుంటి నక్కను అనుకరించాలని ఎందుకు అనుకుంటున్నావు? ప్రపంచంలోని వికలాంగ నక్కల బాగోగులని, అలాంటి వ్యక్తుల అవసరాలను చూడడానికి భగవంతుడు వున్నాడు. నీలాంటి వాళ్ల కోసం కాదు. నీవు హాయిగా జీవించడానికి దేవుడు నీకు మంచి ఆరోగ్యాన్ని, ఇచ్చాడు. అన్ని అవయవాలను ఇచ్చాడు. శక్తి సామర్థ్యాలను ఇచ్చాడు. వాటిని ఉపయోగించుకొని నువ్వు బతకాలి. అంతే కానీ ఆ కుంటి నక్కలా కాదు. నువ్వు ఆ పులి మాదిరిగా బతకాలి. మంచం మీద నుండి లేచి, నీ పనిముట్లను తీసుకొని పులి మార్గాన్ని అనుసరించు.'అన్నాడు దేవదూత ఇదీ కథ.


మంగారి రాజేందర్ జింబో

94404 83001

Advertisement

Next Story

Most Viewed