- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కథా-సంవేదన: చదవని పుస్తకాలు
చిన్నప్పటి నుంచి కథలంటే ఇష్టం. కథలు వినేవాడిని. చదివేవాడిని. మా ఇంటికి చందమామ, బాలమిత్ర ప్రతి నెలా వచ్చేవి. చదవడం అలవాటు అయిపోయిన తరువాత కథలు చెప్పమని మా అమ్మని, మా తాతని వేధించడం తగ్గిపోయింది. చందమామలోని కథలు ఎంత ఇష్టంగా వుండేవో, వడ్డాది పాపయ్య వేసిన బొమ్మలు అంతకన్నా ఇష్టంగా వుండేవి. ఆ తరువాత వివిధ దినపత్రికలలో వచ్చే ఆదివారం అనుబంధంలోని కథలని చదివేవాడిని. కొంచెం పెద్దగా అయిన తరువాత యువ మాసపత్రికలోని కధలని చదవడం మొదలు పెట్టాను.
ఆ తరువాత దొంగచాటుగా డిటెక్టివ్ నవలలు చదవడం మొదలు పెట్టాను. ఇవి ఎన్ని చదివినా చందమామ చదవడం మానలేదు. ఇంటిలో ఉన్న సాహిత్య పుస్తకాలు చదవడం మొదలు పెట్టాను. మాదిరెడ్డి, యద్ధనపూడి, అరికెపూడి నుంచి బుచ్చిబాబు, రంగాచార్యులవి చదవడం మొదలు పెట్టాను. శ్రీశ్రీ నుంచి సినారె వరకు కవిత్వం చదవడం మొదలైంది. ఇంటర్మీడియట్ చదువుతున్నప్పుడు మిత్రుడు నరేంద్రతో కలిసి 'చివరకు మిగిలేది' చలం మ్యాగజైన్స్ ఎన్నిసార్లు చదివానో గుర్తులేదు. కొన్ని పేజీలు నోటికి వచ్చేవి. ఆ విధంగా చదవడం మొదలైంది.
*
డిగ్రీ చదివేటప్పుడు కెమిస్ట్రీ క్లాస్ వున్నప్పుడల్లా లైబ్రరీలో కూర్చునేవాడిని. అప్పుడు మా కాలేజీ లైబ్రరీలో ఉన్న సాహిత్యమంతా చదివేశాను. మునిమాణిక్యం మొదలు మా కాలేజీలోనే పనిచేస్తున్న నవీన్ వరకు అన్ని రచనలూ చదివేశాను. ఆ విధంగా మొదలైన అభిరుచి కథలు, కవిత్వం రాసే దిశగా మారింది. అవి అచ్చు కావడంతో చదవడంతో బాటూ రాయడం కూడా రోజువారీ వ్యవహారం అయిపోయింది. యూనివర్సిటీకి వచ్చిన తరువాత ఆంగ్ల సాహిత్యం చదవడం అలవాటైపోయింది. అక్కడితో అయిపోలేదు. పుస్తకాలు కొనుక్కోవడం కూడా అలవాటుగా మారిపోయింది. లెక్కలేనన్ని పుస్తకాలు ఇంటినిండా చేరిపోయాయి. ఉద్యోగంలో చేరిన తరువాత పుస్తకాలు కొనడం బాగా పెరిగిపోయింది.
చదవడం మెల్లమెల్లగా తగ్గుతూ వచ్చింది. రోజూ చెప్పాల్సిన తీర్పుల ఫైలు నా సమయాన్ని ఎక్కువగా తినడం మొదలైంది. పుస్తకాలు కొనడం మాత్రం తగ్గిపోలేదు. కాస్త సమయం చిక్కితే అన్నీ చదవచ్చు అన్న ధీమాతో పుస్తకాలు కొంటూనే వచ్చాను. ఈ పుస్తకాలకు తోడు లా పుస్తకాలు, పత్రికలు, దినపత్రికల కటింగ్స్, ప్లాట్ సరిపోవడం లేదని విల్లాకు మారాను. పుస్తకాలకు ప్రత్యేక గది ఉన్నా, అవి ప్రతి గదిలో చేరిపోయేవి. రచయితలు తమవి చదవమని అడిగేవారు. చదివేది మేమిద్దరం. రచయితలు ఎంతో మంది.
*
పదవీ విరమణ తర్వాత మళ్లీ చదవడం ఎక్కువ చేశాను. అయినా, తమవి ఎప్పుడు చదువుతారని అడిగే రచయితలు ఎక్కువైపోయారు. దానికి కారణం ఉంది. ప్రతివారం జ్యుడీషియల్ అకాడమీలోనో, పోలీస్ అకాడమీలోనో క్లాసులు ఉంటాయి. వాటికి తయారు కావడంతో, చదవని పుస్తకాల సంఖ్య రోజు రోజుకీ పెరిగిపోతూ వచ్చింది. ఎంత చదివినా తరగని పుస్తకాలు. చదవనివి చదివే వరకు కొత్త పుస్తకాలు కొనవద్దని అనుకుంటాను. కానీ, మనస్సు వూరుకోదే! నెలకి ఒక్కసారన్నా పుస్తకాల షాపుకి వెళ్లాల్సిందే. కొత్త పుస్తకాలు తెచ్చుకోవాల్సిందే. వీటికి తోడు అమెజాన్ వుండనే వుంది.
ఇంటిలో వున్న పుస్తకాలు చదవడం పూర్తి అయ్యేవరకు కొత్త పుస్తకాలు కొనవద్దని ఖచ్చితంగా నిర్ణయం తీసుకోగానే మిత్రుడు నందిగం 'ఈ పుస్తకం చదివావా? చాలా బాగుంది. ఈ కథ చదివావా! చాలా బాగుంది' అంటూ ఫోన్ చేస్తాడు. అమెజాన్‌లో కొత్త పుస్తకాలు వస్తాయి. మా మిత్రుడు నా దగ్గరికి వచ్చినప్పుడు ఏదో ఓ కొత్త పుస్తకం తెస్తూనే ఉంటాడు. ఇలా కొత్త పుస్తకాలు చేరిపోతూనే వున్నాయి. ఇప్పుడు మా ఇంటిలో నేను చదివిన పుస్తకాల కన్నా చదవని పుస్తకాలే ఎక్కువ. ఈ 24 గంటలను పెంచే మిషన్ ఏదైనా ఉంటే ఎంత బాగుండు!!
మంగారి రాజేందర్ జింబో
94404 83001
- Tags
- katha samvedana