కథా-సంవేదన: సల్లగుండు సత్తెమ్మ / సత్తెవ్వ

by Ravi |
కథా-సంవేదన: సల్లగుండు సత్తెమ్మ / సత్తెవ్వ
X

నా చిన్నతనంలో మా ఇంటిలో నాలుగు బర్రెలు ఉండేవి. మా ఇల్లు విశాలంగా ఉండేది. ఇంటి చుట్టుపక్కల చాలా ఖాళీ స్థలం వుండేది. ఇంటికి ఎడమ వైపున ఉన్న స్థలంలో ఓ పశువుల కొట్టాన్ని ఏర్పాటు చేశారు. బర్రెలు వుండటానికి చిన్న పందిరి లాంటి పాక ఉండేది. బర్రెలు తినే గడ్డి బయటకు రాకుండా చెక్కతో అడ్డుగోడను ఏర్పాటు చేశారు. బర్రెలు గడ్డి తిని చెల్లాచెదురు చేయకుండా ఆ చిన్న చెక్క గోడ ఉపయోగపడేది.

పచ్చగడ్డి దొరకనప్పుడు బర్రెలకు వేసేందుకు ఒకటి రెండు ఎండు గడ్డి మోపులు పశువుల కొట్టం దగ్గర వుండేవి.అవి చిన్నగా అయినప్పుడు వాటి మీద మేం పిల్లలం ఎగిరి దుంకేవాళ్లం. బర్రెల కొట్టం దగ్గర కుడితి కోసం సిమెంటుతో చేసిన రెండు హౌజ్‌లు వుండేవి. ఇలాంటివి రెండు మా ఇంటి కుడి వైపు బాదం చెట్టు పక్కన ఉన్న అశోక చెట్టు కింద కూడా వుండేవి. వంటింటి నుంచి సులువుగా గంజి నీళ్లు అందులో పోయడానికి వీలుగా వాటిని ఏర్పాటు చేశారు. రెండు బర్రెలను మా నామాల మల్లయ్య కుడితి తాగడానికి తీసుకొచ్చేది. మా పెద్దింటికి, వంటింటికి మధ్యన వున్న స్థలం దగ్గర వున్న కుడి, ఎడమ దర్వాజాలు తీసి ఉంటే రెండు బర్రెలు నేరుగా అక్కడికి వచ్చేవి.

*

మా బర్రెలు ఆరోగ్యంగా వుండి బాగా పాలు ఇవ్వడానికి మా మల్లయ్య ఆ కుడిదిలో తవుడుని, పల్లి పిండిని వేసి ఓ కట్టెతో బాగా తిప్పి వుంచేవాడు. అవి తృప్తిగా తాగి తిరిగి కొట్టంలోకి వెళ్లిపోయేవి. ఆ కుడిది తయారు చేసే విధానాన్ని చాలా ఆసక్తిగా చూసేవాళ్లం. రోజూ ఉదయం మా రాజేశ్వరుడి గుడిలో కేశన్నగారు, భూమయ్య గారు సుప్రభాతం చదివేవారు. ఆ సుప్రభాతం మొదలైనపుడో, అంతకు‌ముందో మల్లయ్య మా ఇంటికి వచ్చేవాడు. సరిగ్గా ఆ సమయానికే మా బాపు లేచి ఇంటి ముందు కచేరి తలుపు తీసేవాడు. అది పరీక్షల సమయమైతే మమ్మల్ని అప్పుడే నిద్ర లేపేవాడు మా బాపు. కష్టంగా లేచేవాళ్లం.

*

మా మల్లయ్య వంటింటిలోకి వెళ్లి రెండు పెద్ద చెంబులని తీసుకొని, ముందుగా మా పెద్ద బావి దగ్గరకు వెళ్లి గిన్నెలను కడిగి, ఒక చెంబుతో నీళ్లు తీసుకొని మా పశువుల కొట్టానికి దారి తీసేవాడు. ఆయన ఎప్పుడైనా ఆలస్యంగా వస్తే మేం కూడా కొట్టం వైపు వెళ్లి ఆయన పాలు పితకడాన్ని చూసేవాళ్లం. మొదలు బర్రెల ముందు పచ్చగడ్డిని వేసేవాడు. అవి గడ్డిని తినడంలో నిమగ్నం కాగానే పాల పొదుగులని బావి నుంచి తెచ్చిన మంచి నీళ్లతో శుభ్రం చేసి పాలు పితికేవాడు.

తెల్లని పాలు మిలమిలా మెరిసే ఇత్తడి చెంబులో పడుతుంటే ఓ గొప్ప దృశ్యాన్ని చూసిన ఫీలింగ్ కలిగేది మాకు. ఆ తరువాత ఆ పాల చెంబులని తెచ్చి వంటింటిలో పెట్టేవాడు. మా పెద్ద వదిన, మా అమ్మ వాటిని ఓ గమ్మత్తైన కుండలో పోసి దాని మీద పెట్టి కాగబెట్టేవారు. నిప్పుల మీద కాగిన పాలకు మీగడ చాలా దొడ్డుగా ఏర్పడేది. అలా కాగిన పాలను పిల్లలకి పోసేవాళ్లు. పెద్దవాళ్లు చాయ్ పెట్టుకునేది. మిగిలిన పాలను తోడుపెట్టి పెరుగు చేసేది. కనీసం రెండు బర్రెలు పిల్లలని ఈనేవి. అందుకని ఇంటిలో పాలు, పెరుగూ సమృద్ధిగా ఉండేవి.

*

దాదాపు రోజూ మీగడ పెరుగుని చితికి సల్ల తయారు చేసేది మా అమ్మ. పెరుగు, సల్ల మాకు సరిపోగా ఇంకా మిగిలేది. పదకొండు గంటల ప్రాంతంలో మా ఇంటిలో కిరాయికి వున్నవాళ్లు సల్ల కోసం మా వంటింటి దగ్గరకు వచ్చేవారు. మా అమ్మ అందరికి సల్లని పోసేది. వాడకట్టు వాళ్లకి ఎలా తెలిసిందో నాకు తెలియదు కానీ, వాళ్లు సల్ల కోసం వచ్చేవారు. వాళ్లకూ సల్ల పోసేది మా అమ్మ. దాదాపు గంటపాటు ఈ సల్ల పోసే కార్యక్రమం వుండేది.

మా బడికి సెలవులు వున్నప్పుడు ఈ సల్ల చిలకడాన్ని, ఇంటిలో వాళ్లకి, వాడకట్టువాళ్లకి పోయడాన్ని ఆసక్తిగా చూసేవాన్ని. చిన్నలు, పెద్దలు మా అమ్మ కన్నా వయస్సులో పెద్దలు సల్ల కోసం వచ్చేది. 'అమ్మా అని, అక్కా అని, అత్తా అని మా అమ్మని పలకరించేది. మా అమ్మ కన్నా పెద్దవాళ్లు బిడ్డ అని సంబోధింది. అందరిని ఏదో అడుగుతూ అమ్మ సల్లని వాళ్ల గిన్నెలలో పోసేది. సల్ల తీసుకొని కొందరు కృతజ్ఞతా పూర్వకంగా మా అమ్మ వైపు చూసేవాళ్లు. మరికొంత మంది దండం పెట్టేవాళ్లు.

*

మా అమ్మ కన్నా పెద్ద వయస్సు వున్న ఆడవాళ్లు 'సల్లగా ఉండు సత్తమ్మా' అనేవాళ్లు. ఆ దీవెనలని నవ్వుతూ స్వీకరించేది మా అమ్మ. ఇదంతా చాలా రోజులుగా గమనించిన నేను ఒకరోజు మా అమ్మని ఇలా అడిగాను అమాయకంగా. 'రోజూ కష్టపడి శ్రద్ధతో వీళ్లందరికీ సల్ల పోస్తున్నావు కదా? దీని వల్ల ఏం వస్తది?' అని. మా అమ్మ నవ్వింది.

'సల్లగా ఉండు సత్తెవ్వ, సత్తెమ్మ' అని పెద్దవాళ్లు అంటున్నారు కదా? అంత కన్నా ఇంకా పెద్ద దీవెనలు ఏమి కావాలిరా! అంది మా అమ్మ. అక్కడితో వూరుకోలేదు. మనకున్నది ఇతరులకి ఇవ్వడంలో గొప్ప సంతోషం వుంది అన్నది. అప్పుడు మా అమ్మ చెప్పిన మాటలు అంతగా అర్థం కాలేదు. వయస్సు పెరిగిన కొద్ది మా అమ్మ మాటలలోని ఆంతర్యం బోధపడసాగింది.


మంగారి రాజేందర్ జింబో

94404 83001

Advertisement

Next Story

Most Viewed