- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కథా-సంవేదన:సలహా
సరోజకి ఆమె భర్త శ్రీధర్‌తో రోజూ గొడవే. ఇద్దరి మధ్య తీవ్ర అభిప్రాయ భేదాలేమీ లేవు కానీ, రోజూ ఏదో ఒక విషయం మీద గొడవ జరుగుతూనే వుంది. అతనితో వేగలేక తల్లిదండ్రుల దగ్గరికి వచ్చింది. తండ్రికి భారం కావద్దని చెప్పి ప్రైవేట్ టీచర్‌గా చేరింది. తన ఇద్దరి కూతుళ్లని అదే స్కూల్‌లో చేర్పించింది. కరీంనగర్‌లో ఉన్నప్పుడు సరోజ పేరు మీద లోన్ తీసుకున్నాడు శ్రీధర్. ఈ డబ్బులని అతనే కట్టేవాడు. ఎప్పుడైతే సరోజ తల్లిదండ్రుల దగ్గరికి వెళ్లిపోయిందో అప్పటి నుంచి వాయిదాలు కట్టడం మానేశాడు. రికవరీ ఏజెంట్లు ఆమె తండ్రి అడ్రస్ తెలుసుకొని ఇంటికి వచ్చారు. డబ్బులు కట్టాలని బలవంతపెట్టారు. ఏం చెయ్యాలో తెలియక భర్తకి ఫోన్ చేసింది సరోజ. నాలుగు సార్లు ఫోన్ చేస్తే చివరికి ఎత్తాడు. 'లోన్ విషయం తనకేమీ తెలియదని, నీ పేరు మీద వుంది నువ్వే కట్టాలి' అని ఫోన్ పెట్టేశాడు.
*
సరోజ, ఆమె తండ్రి కలిసి మూడు వాయిదాలు కట్టేశారు. అతను పిల్లలని పట్టించుకోవడం మానేశాడు. సరోజకి ఫోన్ చెయ్యడం మానేశాడు. తన భార్య ఏ కారణం లేకుండా తనను వదిలి పెట్టిందని బంధువుల దగ్గర చెప్పడం మొదలు పెట్టాడు. ఆ విషయం సరోజకి తెలిసి బాధపడింది. శ్రీధర్‌కి చండీగఢ్ ట్రాన్స్‌ఫర్ అయ్యింది. అతని అడ్రస్ సరోజకి తెలియదు. అతడు పనిచేసే కంపెనీ మాత్రమే తెలుసు. ఫోన్ చేసి 'లోన్ నువ్వే కట్టాలని' భర్తకి చెప్పింది. అప్పటి నుంచి అతను ఫోన్ ఎత్తడం మానేశాడు. లోన్ కట్టడం సరోజకి భారంగా మారిపోయింది. ఏం చెయ్యలేని పరిస్థితి. అతని బంధువులకి చెప్పినా ఫలితం లేకపోయింది. కష్టంగా ఒక సంవత్సరం పాటు వాయిదాలు కడుతూ వచ్చింది.
*
తండ్రి సలహా మీద అతని స్నేహితుడు విక్రమ్ దగ్గరికి వచ్చింది. విషయం అంతా చెప్పింది. బ్యాంక్‌వాళ్లతో విక్రమ్ మాట్లాడాడు. అన్ని డాక్యుమెంట్ల మీద సరోజే సంతకం చేసిందని, ఆమె భర్త జామీన్ కూడా ఇవ్వలేదని చెప్పారు వారు. ఇంకా ఐదు లక్షలు కట్టాల్సి వుందని కూడా అన్నారు. అదే విషయం సరోజకి, ఆమె తండ్రికి చెప్పాడు. ఏం చెయ్యాలో తోచలేదు. అంత మొత్తం ఒకేసారి కట్టే పరిస్థితి వాళ్లకి లేదు. అందుకని తన జీతం డబ్బుల నుంచే కట్టడం కొనసాగించింది. రెండు మూడు మాసాల తరువాత సరోజ మళ్లీ న్యాయవాది విక్రమ్ దగ్గరికి వచ్చింది. కథ అంతా చెప్పి, ఏం చెయ్యాలని సలహా అడిగింది. స్నేహితుడి కూతురు కాబట్టి ఆమె చెప్పిన విషయం అంతా ఓపికగా విన్నాడు. బాగా ఆలోచించి మూడు సలహాలు ఇచ్చాడు. భర్త ఆమెను మోసం చేసి తప్పించుకుని తిరుగుతున్నాడు కాబట్టి క్రిమినల్ కేసు పెట్టాలని, అలాంటి వ్యక్తి కోసం ఒంటరిగా వుండటం సరికాదు కాబట్టి విడాకుల కోసం దరఖాస్తు చేద్దామని చెప్పాడు. అతని సలహా ఆమెకు నచ్చలేదు. ముభావంగా ఉండిపోయింది.
*
రెండు సంవత్సరాలు గడిచిపోయాయి. సరోజ విషయం మరచిపోయాడు విక్రమ్. ఒకరోజు సరోజా ఆమె భర్త విక్రమ్ ఆఫీసుకి వచ్చారు. వాళ్లిద్దరిని చూసి విక్రమ్ ఆశ్చర్యపోయాడు మూడు నెలలుగా కలిసే వుంటున్నామని చెప్పారు. ఓ ఫ్లాట్ కొన్నామని గృహ ప్రవేశానికి విక్రమ్‌ని ఆహ్వనించారు. వస్తానని చెప్పాడు. వాళ్లు వెళ్ళిపోయిన తరువాత ఆలోచనలో పడ్డాడు విక్రమ్. తన సలహా వినకపోవడమే మంచిదైందని అనుకున్నాడు. భార్యాభర్త మధ్య విభేదాలు ఎందుకు వస్తాయో, వాళ్ల అహం ఎక్కడ దెబ్బతింటుందో తెలియదని కూడా అనుకున్నాడు. వాళ్లు ఉన్న పరిస్థితిలో ఏయే చర్చలు తీసుకోవడానికి అవకాశం వుందో చెప్పాలి తప్ప, తాను అనుకున్న సలహా ఇవ్వకూడదని అనుకున్నాడు. ఏం చేయాలో ఎంపిక చేసుకోవాల్సింది వాళ్లే అనుకున్నాడు మనసులో.
మంగారి రాజేందర్ జింబో
94404 83001