కథా-సంవేదన:జవాబు తెలిసిన ప్రశ్న

by Ravi |
కథా-సంవేదన:జవాబు తెలిసిన ప్రశ్న
X

మా చిన్నప్పుడు మోచేతులకి, మోకాళ్లకి ఎప్పుడూ గాయాలుండేవి. కాస్త సమయం దొరికితే చాలు ఆడుకోవడం, ఎగరడం చేసేవాళ్ళం. ఇప్పటి పిల్లల మాదిరిగా కాదు. నేల మీద నీళ్ళ మీద మా ఆటలు ఉండేవి. స్వచ్ఛమైన గాలిని పీల్చాం. ఆరుబయట పడుకున్నం. బావి నుండి స్వచ్ఛమైన నీటిని తోడుకొని తాగాం. కాలానుగుణంగా వచ్చే పండ్లని విపరీతంగా తినేవాళ్లం. వాగు ఒడ్డున చెలిమెలు తోడి అందులో నీరు త్రాగేవాళ్లం. మా చెరువు దగ్గర నిల్చోని ఆటలు ఆడేవాళ్లం.

మా ఆటలు కొత్తగా ఉండేవి. రోజుకో కొత్త ఆటని మా మిత్రులు పుట్టించేవాళ్లు. మా చెరువు అలల మీద నుంచి ఓ మట్టి పలకని విసిరి అది ఎంత దూరం అలలని లేపుతూ వెళ్ళిందో చూసేవాళ్లం. ఒకరి తరువాత ఒకరం అలా చూసినంక పలకలని విసిరి ఆనందంతో ఎగిరేవాళ్లం. ఈ ఆటకు అభ్యాసం అవసరం. నైపుణ్యం ఇంకా ఎక్కువ అవసరం. ఆ పెంకని విసరడం వేగంగా వుండకూడదు. అట్లా అని నెమ్మదిగా వుండకూడదు. ఆ రెండింటి మధ్యగా వుండాలి. పెంకని ఎంపిక చేసుకోవడం కూడా జాగ్రత్తగా చేసుకోవాలి. అవి ఎక్కువ బరువుగా వుండకూడదు. తేలికగా వుండకూడదు. నీటి ఉపరితలం మీద స్వేచ్ఛగా జారడానికి అది వెడల్పుగా వుండాలి. బోతిగా కూడా ఉండాలి. ఆ ఆటలో ఇంత నైపుణ్యం వుంటుంది.

ఇది కాకుండా మరో ఆట వుండేది. సిగిరెట్ డబ్బాలని ఎంపిక చేసేవాళ్లం. ఎక్కువగా దొరికే సిగరెట్ కవర్లకి తక్కువ విలువ. చాలా తక్కువగా దొరికే వాటికి ఎక్కువ విలువని ఏర్పరచి, ఓ గుండారంలో పెట్టి పలుచటి రాయితో కొట్టెవాళ్లం. ఆ గుండారం నుంచి బయటకు వచ్చిన సిగరెట్ డబ్బాలను వాళ్లు తీసుకోవాలి. ముందుగా ఎవరు కొట్టాలన్నా దానికి ఓ నియమం ఉండేది. ఓ గీత గీసి అందులో రాయి వేసేవాళ్లం. ముందు ఎవరిది పడితే వాళ్లు ముందుగా కొట్టాలి. ఇట్లా ప్రతి ఆటకి ఓ నియమం వుండేది.

ఇవి మాకు ఎవరూ చెప్పే వాళ్లు కాదు. మాకు మేం ఏర్పరుచుకున్నవే. ఇలా ఒకటేమిటీ?ఇట్లా ఎన్నో ఆటలు. ప్రతి ఆటలో కొత్తదనం ఉండేది. సృజనాత్మకత వుండేది. గోలీలతో,బంతితో ఆడే ఆటల్లో రోజూ ఓ కొత్త దనాన్ని సృష్టించేవాళ్లు మిత్రులు. మా ప్రతి ఆట ప్రకృతికి దగ్గరగా ఉండేది.

మా ఆటల్లో మా బట్టలు దుమ్ముకొట్టుకొని పోయేవి. గాయాలు అయ్యేవి. ఆ గాయాల గుర్తులు లేని వాళ్లు మా కాలంలో ఎవరూ లేరంటే ఆశ్చర్యం లేదు. ఒక్కో గాయం గుర్తు ఒక్కో జ్ఞాపకాన్ని తట్టి లేపుతుంది. ఇప్పటి పిల్లలకి మట్టి తెలియదు. మోకాళ్లకి మోచేతులకి గాయాలు తెలియవు. చెరువు తెలియదు. వాగూ తెలియదు. ఒక్క మాటలో చెప్పాలంటే ప్రకృతికి దూరంగా పెరుగుతున్న పిల్లలు.

మా ఆటలు అవి మామూలువి. సాధారణమైనవి. కానీ గొప్ప జ్ఞాపకాలను మిగిల్చినవి. ఏ తరం ఆటలు ఆ తరంకి గొప్ప జ్ఞపకాలు. అయితే ఇప్పటి తరం ప్రకృతికి దూరం కావడమే ఓ బాధకరమైన విషయం. ఇంతకీ వాళ్లని ఆ విధంగా ప్రకృతికి దూరం చేసింది ఎవరు? వాళ్ల మీద పుస్తకాల బరువుని మోపింది ఎవరు? జవాబు అందరికీ తెలుసు.

మంగారి రాజేందర్ జింబో

94404 83001

Advertisement

Next Story

Most Viewed