- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కథా-సంవేదన: శివుడి ఆజ్ఞ
రెండు రోజులు కాశీలో ఉండి గయకు బయల్దేరారు కృష్ణమోహన్ అతని భార్య ప్రభావతి. కాశీ, గయ చూడాలని చాలా కాలం నుంచి వున్నా అతనికి 60 సంవత్సరాలు వచ్చేవరకు ఆ కోరిక తీరలేదు వాళ్లకి. గయలో ఒకరోజు ఉండిపోయారు. దర్శనాలు, అపక్రియలు పూర్తి చేసుకొని మరునాడు మధ్యాహ్నం భోజనం చేసి కాశీకి బయల్దేరారు. మార్గ మధ్యంలో బుద్ధగయలో ఆగారు. బద్ధుడు కూర్చున్న రావి చెట్టు దగ్గర కూర్చున్నారు. అన్నింటిని చూశారు. తన్మయత్వం చెందారు. కదలాలని అన్పించలేదు.
అక్కడి నుంచి కష్టంగా నాలుగున్నర ప్రాంతంలో కాశీకి పయనమయ్యారు. కొంతసేపు వాళ్ల ప్రయాణం బాగానే జరిగింది. ఆ తరువాత వాళ్ల కారు ఆగిపోయింది. కొంతసేపు చూసి కారుని రోడ్డు పక్కకు తీసుకొని ఆపాడు డ్రైవర్. ముందు వందలాది వాహనాలు, వెనక వందలాది వాహనాలు కదులుతున్న జాడ కన్పించలేదు. కొద్దిసేపు ఇద్దరూ అటూ ఇటూ తిరిగివచ్చి మళ్లీ కారులో కూర్చున్నారు. బిహార్-ఉత్తరప్రదేశ్ బార్డర్ దగ్గర ఏదో గొడవ జరిగి రోడ్‌కు అడ్డంగా ఓ నాలుగు వాహనాలని నిలిపివేశారు. ఫలితంగా అన్ని వాహనాలూ అటూ, ఇటూ నిలిచిపోయాయి. వేరే మార్గాల కోసం కొంతమంది డ్రైవర్లు అన్వేషిస్తున్నారు. కొంతమంది ఆ మార్గం గుండా వెళ్లడానికి ప్రయత్నం చేస్తున్నారు.
రాత్రి ఎనిమిది దాటింది. కొంత చలి మొదలైంది. కారు దగ్గర ఒక చిన్న హోటలు ఉంది. అది అంత శుభ్రంగా లేదు. కృష్ణమోహన్ టీ తాగాడు. ఆయన భార్య తాగలేదు. ఆ టీ కొట్టు చుట్టూ ప్రయాణికులు టీ తాగుతూ, చపాతీలు తింటూ వేచి చూస్తున్నారు. వాహనాలు కదులుతున్న జాడ ఏ మాత్రం కన్పించలేదు. వీరు చేసేదేమీ లేక కారులో కూర్చోని హైదరాబాద్‌లో ఉన్న పిల్లలతో మాట్లాడుతూ వున్నారు. 'కొంతమంది డ్రైవర్లు వేరే మార్గాల ద్వారా వెళ్తున్నారు కదా? మనం కూడా అలా వెళ్దామా?'అడిగాడు కృష్ణమోహన్ డ్రైవర్ని.
వద్దుసార్! పోలీసులు వచ్చారు. ఈ రాష్ట్రం వాళ్లు వచ్చారు. మన రాష్ట్రం వాళ్లు వచ్చారు. ఇంకో అరగంట, గంటలో రోడ్ క్లియర్ కావొచ్చు అన్నాడు హిందీలో. డ్రైవర్ మంచివాడు. కోర్టువాళ్లు పంపించిన డ్రైవర్ కాబట్టి ఇంకాస్త మర్యాదగా వున్నాడు. చేసేది ఏమీ లేక ఇద్దరూ మౌనంగా వుండి పోయారు. ఏమన్నా తీసుకుంటారా సార్? అడిగాడు డ్రైవర్. ఏం వున్నాయి? ఏమీ లేవు సార్ అన్నీ అయిపోయాయి. ఎగ్స్ వున్నాయి. ఆమ్లెట్ వేసి ఇస్తాడు. చెప్పనా! అడిగాడు డ్రైవర్. భార్య వైపు చూశాడు కృష్ణమోహన్.
తాను ఏమీ తీసుకోనని చెప్పింది. కారులో వున్న బిస్కెట్ పాకెట్లు ఎప్పుడో అయిపోయాయి. కాశీ యాత్ర పూర్తి అయ్యేవరకు ఎలాంటి నాన్ వెజిటేరియన్ తీసుకోవద్దని ఆమె అభిప్రాయం. కొంత ఆకలిగా వుందని చిన్ని రోడ్ సైడ్ హోటల్ అంత శుభ్రంగా అనిపించకపోయినా ఆమ్లెట్ తిన్నాడు కృష్ణమోహన్. ఇంకా వాహనాలు కదలడం లేదు. రాత్రి పది దాటింది. ఇంకో గంట సమయం సులువుగా పట్టేట్టు వుంది. వాళ్ల ఫ్లయిట్ తెల్లవారి పది గంటలకు ఆ విషయంలో ఆదుర్దా లేదు.
ప్రభావతికి షుగర్ ఉంది. అప్పుడెప్పుడో గయలో తిన్నది. మరింకేమీ తీసుకోలేదు. కార్లో పళ్లూ అవి వుంటాయి. కానీ, ఈ సారి ఏమీ లేవు. ఐదు గంటల వరకు కాశీలో వుంటారని వాళ్లు అనుకున్నారు. రకరకాల కారణాల వల్ల రాత్రి పది దాటింది. చేరేవరకు ఏ రెండో మూడో అవుతుంది. అదే చిన్న హోటల్లో రెండు ఆమ్లెట్లు వేయించాడు డ్రైవర్ ఆమె పరిస్థితి చూసి. ఆ సమయంలో ఆమ్లెట్ అయినా దొరికినందుకు సంతోషపడ్డాడు కృష్ణమోహన్.దేవుడికి దండం పెట్టి ఆ ఆమ్లెట్ ని తినడం మొదలు పెట్టింది ప్రభావతి.
గయలో కోడి గుడ్డుని వదిలిపెట్టలేదు. కానీ, తినదల్చుకోలేదు. అక్కడ ఆమెకు ఇష్టమైన పనస తొనలని వదలిపెట్టింది. హైదరాబాద్ వెళ్లే వరకు ఆమ్లెట్ కానీ, నాన్ విజిటేరియన్ కానీ తినదల్చుకోలేదు. కానీ తప్పలేదు. శివుని ఆజ్ఞ అదేనేమో మరి!!
మంగారి రాజేందర్ జింబో
94404 83001