పుస్తక సమీక్ష: హృదయాన్ని తాకిన దాపటెద్దు

by Ravi |   ( Updated:2023-06-25 19:00:24.0  )
పుస్తక సమీక్ష: హృదయాన్ని తాకిన దాపటెద్దు
X

సమకాలీన జీవన విధానాలను, పలు సామాజిక సమస్యలను లోతుగా పరిశీలించి రచయిత దుర్గమ్ భైతి ‘దాపటెద్దు’ అనే కథల పుస్తకం ప్రచురించారు. ఇవన్నీ కూడా మన చుట్టూ మన నిత్యం చూస్తున్న సంఘటనలాగే అనిపిస్తాయి. అలాంటి సంఘటనలు ఆకళింపు చేసుకొని దుర్గమ్ భైతి ఈ కథలు రాశారు. ఇందులో ప్రతి కథ, చదివే పాఠకుడు లీనమైపోయి చివరివరకు చదివేలా ఉత్సుకత కలిగించేలా ఉంది. కథలో మన పాత్ర పరకాయ ప్రవేశం చేసి కథను నడిపించినట్టు మనకు ఒక గొప్ప అనుభూతిని కలిగిస్తుంది.

పశువులను..కుటుంబ సభ్యులుగా..

మాతృభాష పట్ల మమకారంతో, సాహితీ తృష్ణతో భైతి దుర్గయ్య అనేక సాహితీ సేవా కార్యక్రమాలను కూడా అక్షర సేద్యం ఫౌండేషన్ ద్వారా చేస్తున్నారు. 2017లో తనువంతా తనే కథతో కథా సాహిత్య రచనా రంగంలోకి అడుగిడిన భైతి దుర్గయ్య ఇప్పటివరకు 45 పైగా కథలను 'దుర్గమ్ భైతి' కలం పేరుతో రాశారు. ఒక రచయితకు ఉండాల్సిన సామాజిక బాధ్యతను గుర్తు చేసేలా ఈ కథలు ఉన్నాయి. ఇవన్నీ వివిధ పత్రికల్లో ప్రచురింపబడినవి. ఇందులో కొన్ని బహుమతి పొందిన కథలు కూడా ఉండడం విశేషం. సామాజిక సమస్యలే ఇతివృత్తంగా దుర్గమ్ భైతి ఈ కథలను రూపుదిద్దిన తీరు హృదయాన్ని తాకేలా ఉన్నాయి.

పసివాడి చదువు కథ పేదరికంలో ఉన్న రాజు అనే బాలుడు చదువుకోవాలనే తన కోరికను తీర్చుకొని ఏ విధంగా ఉన్నత స్థానానికి ఎదిగాడో తెలియజేస్తుంది. బాల కార్మిక వ్యవస్థను, భూస్వామ్య విధానపు పోకడను ఈ కథలో చక్కగా చూపారు రచయిత. రాజు చదువుకోవడం కొరకు ఎవరు సహాయం చేశారు, ఏ విధంగా చేశారో కథ చివరి వరకు చదివితేనే తెలుస్తుంది. కథ నడిపిన విధానం బాగుంది. చివరి అంకం చదువుతుంటే మన కళ్ళు చెమ్మగిల్లుతాయి.

దాపటి ఎద్దు కథ గ్రామీణ నేపథ్యంలో కొనసాగుతుంది. వ్యవసాయ రంగంలో యాంత్రికీకరణ వలన నేడు పశువులకు రైతులకు సంబంధం లేకుండా పోయింది కానీ ఒకప్పుడు పశువులను కూడా రైతులు తమ కుటుంబ సభ్యులుగానే భావించేవారు. ఈ కథలో రైతు కిట్టయ్య తనకు ఎంతో ఇష్టమైన దాపటి ఎద్దు రాముడిని వదులుకోవలసి వచ్చినప్పుడు అతడు పడే తపన మన హృదయాన్ని ద్రవింపజేస్తుంది. రైతు బిడ్డగా రైతు సమస్యలను కళ్ళకు కట్టినట్లు చూపారు రచయిత.

ప్రతి కథ అణిముత్యమే..

ఆఖరి కోరిక కథలో అక్క కోసం తమ్ముడు చేసిన త్యాగం ఉంది. సినిమా కథను తలపించేలా ఈ కథను తీర్చిదిద్దారు రచయిత. 'నేను.. మనిషినే కదా' కథ అమెరికా సంబంధం చూసి పెళ్లి చేయాలనే ఒక ఆడపిల్ల తండ్రి చేసే ప్రయత్నాన్ని తెలుపుతుంది. తల్లిదండ్రులు తాము చేయలేని వాటిని తమ పిల్లలు వాటిని సాధించడం ద్వారా ఏ విధంగా తృప్తిపడుతారో ఒక సగటు తండ్రి ఆలోచనకి అద్దం పట్టేలా ఉంది ఈ కథ. నేడు చిన్న మొత్తం సహాయం చేసి ఎంతో ప్రచారం చేసుకుంటున్న వారి తీరును నిరసిస్తూ రాసిన ఎంత మంచి వారండీ అనే లఘు కథ ఆలోచనాత్మకంగా ఉంది. 'అభాగ్యుని ఊయల' కథ పచ్చని పంట పొలాల మధ్య పరిశ్రమలు పెట్టడం వలన కలిగే నష్టాలను, డబ్బు వలన కుటుంబ సంబంధాలు ఎలా దెబ్బతింటాయో హృదయాన్ని హత్తుకునేలా తెలియజేసింది.

వేటికవే సాటి గల మొత్తం 22 కథలు ఇందులో ఉన్నాయి. ప్రతి కథ ఒక ఆణిముత్యమే. ఇవన్నీ కూడా పాఠకుడికి హృదయాన్ని తట్టిలేపేలా ఉన్నాయి. కథలన్నీ ఆలోచింపజేసే విధంగా, ఒక సమస్యకు పరిష్కారాన్ని చూపేలా ఉన్నాయి. గురువు గారికి ఒక బహుమతి, నాన్న ఒక జన్మనివ్వు.., వలస ఖైదీ, పెంకుటిల్లు, సర్దుబాటు మొదలగు కథలన్నీ దేనికదే వస్తు వైవిధ్యతను కలిగి చదువరులను ఆకట్టుకునేలా ఉన్నాయి. ఇలాంటి మంచి మంచి కథలెన్నో దుర్గమ్ భైతి కలం నుండి రావాలని ఆశిస్తూ అభినందనలు. ఈ పుస్తకం వెల..125 రూపాయలు.

ప్రతులకు..

భైతి తార,

గ్రామం. రాముని పట్ల, మం. చిన్నకోడూర్,

జి. సిద్దిపేట.. 502 267

9959007914.

సమీక్షకులు..

కందుకూరి భాస్కర్,

9703487088

Advertisement

Next Story