పుస్తక సమీక్ష: ప్రేమామృత ఫలం సప్తపర్ణిక కావ్యం

by Ravi |   ( Updated:2023-07-09 19:15:16.0  )
పుస్తక సమీక్ష: ప్రేమామృత ఫలం సప్తపర్ణిక కావ్యం
X

సున్నిత సుకుమార భావాలను వ్యక్తపరిచే తత్వం కవి హృదయంలో ప్రత్యేకత. అలాంటివి ప్రత్యేకంగా మానవ జీవితంలో నిరాశా నిస్పృహలను అధిగమించటానికి ఒక ఔషధంగా కవితా వస్తువులను ఎంచుకొని సాహిత్యంలో తనవంతు కృషి చేస్తున్న కవయిత్రి నోమల వనితారాణి. కరీంనగర్ జిల్లా కేంద్రానికి చెందిన వనిత ఎమ్.ఏ వరకు చదువుకున్నారు. 8 సంవత్సరాలు ప్రైవేట్ ఉపాధ్యాయురాలుగా పనిచేసి ప్రస్తుతం గృహిణిగా బాధ్యతలు నెరవేరుస్తూ సాహిత్యం ద్వారా తన మొదటి కవితా సంపుటి ‘సప్త వర్ణిక’తో సాహితీ ప్రపంచంలోకి పుస్తక రూపంగా భవిష్యత్తు తరాలకు బాసటగా భద్రపరుస్తుంది.

తన కవనాన్ని సాధించిన తీరు

తన కవితా సంపుటి సప్త వర్ణికలో చంద్రకళనై అనే కవితలో ధవళ కాంతుల మేనిపై మెరిసే వేళలో ... బాహ్య ప్రపంచంలో స్త్రీ ప్రత్యేకతను తెలియజేస్తూ లోపల ప్రపంచంలో తన వ్యక్తిత్వాన్ని మార్చుకొని పలువురికి బాసటగా నిలవాలని తెలియజేస్తుంది. సంసారం ఓ మనోహర కావ్యం కవితలో.... కోటి కలలతో కొత్త జీవన గమనపు బాట పట్టిన దాంపత్య గువ్వలు అంటూ.. నవ యువ జంటకు దాంపత్య విలువలను తెలియజేస్తూ ఇద్దరి మధ్య ఉన్న చిరుకోపాలను క్షమించుకుంటూ జీవన చదరంగంతో ఒక్కటిగా ముందుకు సాగాలని తెలియజేస్తుంది. అలాగే, పుస్తకంలో నాకో పేజీ.... కవితలో.... నీ జీవితపుటను పొందుపరచుకోగలవుగా ఓ మనసా.... అంటూ మనిషి జీవితంలో ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొన్నప్పటికీ గమ్యం చేరే క్రమంలో నీ బాధ్యతలను విస్మరించకుండా నీ విలువలను కాపాడుకుంటూ తనకు తానుగా ఒక ప్రత్యేక స్థానాన్ని జీవితంలో ఏర్పరచుకోవాలి అంటూ తన కవనాన్ని సాధించిన తీరు ఉత్తమంగా కనిపించడం కవయిత్రి ప్రత్యేకత.

ప్రతీ అంశానికి ప్రత్యేక శీర్షికలతో..

ఇలా కవనంలో ప్రత్యేకమైన అంశాలను తీసుకుని కవితా వస్తువులను ఒక క్రమబద్ధీకరణమైన శీర్షికలతో అక్షర రూపం చేస్తూ సాహితీ లోకానికి తనదైన కోణంలో తెలియజేయడం వనితారాణి ప్రత్యేకత. ధీశాలి, నీ చుట్టే ప్రాణం, నాకు గుర్తే, తొలకరి, బాల్యం, నవ క్రాంతి, ఎండమావులు, మగువ, అంతులేని కథ, ఓ అమ్మతనం, ఆడపిల్లంటే.... ఇలా 60 కవితలతో ఎంచుకున్న అంశానికి ప్రత్యేక శీర్షికలతో సప్త వర్ణిక కవితా సంపుటిని పొందుపరిచింది. సాహిత్యంపై తన ప్రత్యేక అభిమానాన్ని తెలియపరుస్తూ తన కవన ప్రత్యేకతను తెలియచేసింది. ఇలాంటి మరిన్ని కవితా సంపుటిలు ముందు ముందు తన కలం నుండి వెలువడాలని అభినందనలు అందజేస్తున్నాను.

-డా. చిటికెన కిరణ్ కుమార్

సమీక్షకులు, విమర్శకులు

94908 41284

Advertisement

Next Story