- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సమీక్ష: జానపద కరదీపిక పూల జాతర
తెలంగాణ సంస్కృతికి పతాకగా నిలిచేది, పూజా వస్తువులైన పూలనే పూజించే సకల విశేషాల సమ్మేళన ప్రదాయిని 'బతుకమ్మ పండుగ'. తెలంగాణ పండుగల్లోనే మేటి పండుగగా నిలిచి తెలంగాణ కీర్తిని విశ్వవ్యాప్తం చేసిన ఈ పూల పండుగకు ప్రత్యేక ఆకర్షణ పాటలు. ఈ బతుకమ్మ పండుగ పాటల్లో కూడా ఆ ప్రాంత జానపద సాహిత్యం, స్థానిక పౌరాణిక, చారిత్రక, గాథలు మానవ సంబంధాలతో ముడిపడి జాలువారతాయి. నేటి ఆధునిక సమాజపు నవీన బతుకమ్మ పండుగలో పాట మూగబోతోంది అన్నది మాత్రం నిజం. కృత్రిమ తీరులో బతుకమ్మ పాటల హోరు శబ్దాలతో మార్మోగుతూ అసలు సిసలైన తెలంగాణ బతుకమ్మ పాట మృగ్యమైపోతున్న ప్రమాదపు వేళ తెలంగాణ సంస్కృతి మీద మక్కువతో తన జాతి పాటల సంపద కాపాడాలని సామాజిక స్పృహతో తెలుగు ఉపాధ్యాయురాలు 'కొమ్మాల సంధ్య' చేసిన అద్భుత సేకరణ కృషికి అక్షర రూపం ఈ 'పూల జాతర'.
ఈ బతుకమ్మ పాటల పుస్తకంలో శతక సంఖ్య సాంప్రదాయ తీరున మొత్తం 108 బతుకమ్మ పాటలు పొందుపరిచారు. బతుకమ్మ పాటలు పలుచబడిపోయిన నేటి ఆధునిక కాలంలో ఇన్ని పాటలను సేకరించడం నిజంగా అభినందనీయం, సంధ్య సేకరణ కృషికి తెలుగు జానపద బ్రహ్మ బిరుదు రాజు రామరాజు కృషి ప్రేరణగా నిలిచింది అనడం సబబు. ఇక ఈ బతుకమ్మ పాటల్లో రామాయణ, భారత, భాగవత, ఇతిహాసాల్లోని కొన్ని కొన్ని సంఘటనలు పాటలు కావడం సహజం, అవిగాక సమాజంలో స్త్రీలు ఎదుర్కొంటున్న వివక్ష, కుటుంబంలో, సమాజంలో వారు పడుతున్న పాట్లు గురించి కూడా బతుకమ్మ పాటలు ఉన్నాయనే కొత్త విషయం సంధ్య పూల జాతర స్పష్టం చేస్తుంది. బహుళ ప్రాచుర్యం పొందిన బతుకమ్మ పాటలతో పాటు చాలా మరుగున పడిన పాటలను కూడా వెలికి తీసిన రచయిత్రి పరిశోధన కృషి ప్రశంసనీయం.
కట్టమంచి వారి 'ముసలమ్మ మరణం' కావ్యం పోలిన స్త్రీ త్యాగ గాథలు, తెలుగు జానపద సాహిత్యం నిండా కోకొల్లలుగా కనిపిస్తాయి. అటువంటి ప్రాణత్యాగ గాథనే తెలంగాణకు చెందిన 'కట్ట మైసమ్మ' ఈ త్యాగ గాథకు చెందిన బతుకమ్మ పాటను తన సేకరణలో చేర్చడం ఈ పుస్తకానికి ఎంతో ప్రామాణికత చేకూరింది. తూర్పు దేశాన ఉయ్యాలో- తులసి వానలు కురిసే ఉయ్యాలో..../ కట్టమీద మైసమ్మ ఉయ్యాలో.... హారమడిగి నాది ఉయ్యాలో... అంటూ మొదలయ్యే ఈ బతుకమ్మ పాట ఒక ఇంటి చిన్న కోడలు ఆ ఊరి చెరువుకు ఆత్మార్పణమైన విషాద సంఘటనకు చెందిన కరుణరసాత్మక 'బతకమ్మ పాట'. అలాగే స్త్రీలకు మాత్రమే గల ప్రత్యేకమైన కొన్ని ధర్మాలకు సంబంధించిన పాటలు కూడా ఇందులో ఉండి మన సమాజంలో స్త్రీ ఔన్నత్యాన్ని చాటి చెబుతున్నాయి. ఇక పౌరాణిక గాథలైన శ్రీకృష్ణ జననం, సీత అన్వేషణ, మొదలైన బతుకమ్మ పాటలను మనం ఇందులో పుష్కలంగా చూడవచ్చు.
తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలపై కొనసాగించే ప్రామాణిక పరిశోధనలకు ఈ "పూల జాతర" పుస్తకం దారి దీపమై నిలుస్తుంది. ఈ ప్రామాణిక అనధికార పరిశోధనా పుస్తకం రూపకల్పనలో రచయిత్రి సంధ్య పడ్డ శ్రమ అడుగడుగునా అగుపిస్తుంది. బహుళ ప్రయోజనకరమైన ఈ పాటల పుస్తకంలోని పాటలను విభాగాల వారీగా విభజించి ఉంటే మరింత ప్రయోజనకరంగా ఉండేది. ఏది ఏమైనా కాలగర్భంలో కలిసిపోతున్న మూగబోతున్న బతుకమ్మ పాటలను ఇలా సేకరించి అక్షరీకరించి శాశ్వతత్వం చేకూర్చడం భావి సమాజానికి, పరిశోధకులకు, ఓ వరం. ఇంత చక్కని అక్షర కృషి చేసిన కొమ్మల సంధ్య నిజమైన అభినందనీయురాలు తెలంగాణ భావి పరిశోధకులు విధిగా చదవాల్సిన పుస్తకం ఈ పూల జాతర.
పుస్తకం పేరు:- పూల జాతర (బతుకమ్మ పాటలు)
రచయిత్రి:- శ్రీమతి కొమ్మాలసంధ్య,
99087 63172,
పుటలు:124,
వెల:- 150/-
సమీక్షకులు
డా:అమ్మిన శ్రీనివాసరాజు,
7729883223.
Also Read..
సంవేదన: అద్భుతమైన పాత్ర మధురవాణి