అణగారిన వారి ఆర్తి ‘ముళ్ల చినుకులు’

by Ravi |   ( Updated:2023-03-26 19:30:54.0  )
అణగారిన వారి ఆర్తి ‘ముళ్ల చినుకులు’
X

న్నో పుస్తకాలు చదువుతుంటాం. మరెన్నో రచనలను నెమరువేసుకుంటూ ఉంటాం. కానీ కొన్ని కథలు, రచనలు మాత్రమే మనల్ని కదిలిస్తాయి. మనకు తెలిసిన పాత్రలు, మన చుట్టూ మెదులుతున్న మనుషులను పరిచయం చేస్తాయి. మనం ఎదుర్కొనే సమస్యలను, వాటికి పరిష్కరాలను సూచిస్తాయి. సరిగ్గా అటువంటి పుస్తకమే.. ‘ముళ్ల చినుకులు’. ఈ సంపుటిలోని కథలన్నీ వేటికవే ప్రత్యేకమే. ఈ వ్యవస్థలోని అతిపెద్ద సమస్య కులమే. దానిమీద మాట్లాడకుండా, దాటవేసి ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏ సమస్యకు పరిష్కారం దొరకదు. కానీ దురదృష్టవశాత్తు ఇప్పటివరకు ఎందరో మేధావులు, గొప్పవాళ్లు కులాన్ని దాచిపెట్టి సమస్యలను పరిష్కరించే ప్రయత్నాలు చేశారు. అందుకే గతకాలంలోని అభ్యుదయ రచనలు కూడా ఆ లోటుతో ఉన్నాయి. అడపదడపా కొన్ని రచనలు కులం ఉనికి ప్రశ్నించినా దాని ప్రభావం అంతంతే.

కానీ 'ముళ్ల చినుకులు' సంపుటి కొన్ని పాత ఆంక్షలను దాటుకొని ముందుకు వచ్చింది. కులపరంగా ఎదురవుతున్న అంతరాలను, సమస్యలను ఎత్తి చూపింది. ‘నిర్ణయం’ కథలో.. వర్ణ వ్యవస్థను బాగా చదువుకున్న అగ్రవర్ణ అభ్యుదయవాది కంటే.. పెద్దగా చదువుకోని మహిళే అర్థం చేసుకోగలదని చూపించారు. ‘తారలు చూపిన తార’, ‘శిరోముండనం’ ఇలా చాలా కథలు సమాజంలోని అనేక సమస్యలను ఎత్తి చూపాయి. చైతన్యవంతురాలైన ఓ అణగారిన మహిళ గొంతెత్తితే సాటి బాధితులు ఆమెకు మద్దతు తెలపకపోగా.. ఆమె మీదే తిరగబడటాన్ని తారలు చూపిన తారలో మనం చూడొచ్చు. జోగినీ వ్యవస్థ అనేది ఎంత అనాగరిక ఆచారమో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అయితే చాలా సందర్భాల్లో కాదు.. ప్రతి సందర్భంలోనూ జోగిని దేవుడి పెళ్ళాలుగా దళిత ఆడపిల్లలనే బలి చేస్తూ ఉంటారు. అందుకు ఒప్పుకోని ఓ ఆడపిల్లను అగ్రవర్ణ సమాజం ఏం చేసింది అన్నదే.. మావుళ్ళమ్మ కథ. ఈ కథ చివరికంటే చదివాక కళ్ల చెమ్మగిల్లుతాయి. అన్ని కథలకు చదివించే గుణముంది. చాలా కథల్లోని సన్నివేశాలు ఎప్పుడో ఓ సారి మన జీవితానికి కనెక్ట్ అవుతాయి. మనం బాధితులుగానో.. పీడితులుగానో ఈ కథల్లోని పాత్రలను చూసి ఉంటాము.

తెలుగు సాహిత్యంలో చాలా వరకు దళితుల సమస్యలను దళితేతరులే ప్రస్తావించారు. దళిత సమస్యలను నేరుగా కూడా వారు ప్రస్తావించలేదు. కానీ ముళ్ల చినుకుల్లోని 90 శాతం కథలను బాధిత వర్గం వాళ్లే రాశారు కాబట్టి.. వారి సమస్యలు పరిపూర్ణంగా ఈ పుస్తకంలో ఆవిష్కరించారు. రిజర్వేషన్లు దళితుల సమస్యలకు నిజంగానే పరిష్కారమా? వారికి రిజర్వేషన్లు కేటాయించడం.. ప్రభుత్వాలు ఉదారంగా ఇస్తున్నాయా లేక వేల ఏండ్లుగా వారికి చేసిన అన్యాయానికి కొద్ది పాటి ఊరటనిచ్చేలా మాత్రమే అవి ఉన్నాయా అన్న విషయం కూడా ఈ కథల్లో ప్రస్తావించారు. ఇన్నేండ్ల స్వతంత్ర భారతంలో నేటికి దళితుల పట్ల, నిమ్న వర్గాల పట్ల కొంత వివక్ష ఉంది. ఆ వివక్ష ఇంకా కొనసాగడానికి కారణాలను ఈ పుస్తకం డీల్ చేసింది. సామ్రాజ్యవాద దోపిడీ ప్రభుత్వంలో అణగారిన వర్గాలు కేవలం కొన్ని కులాల వాళ్లు మాత్రమే ఎందుకున్నారు అందుకు కారణాలు ఏమిటన్న విషయంపై కూడా ఈ పుస్తకం ప్రస్తావించింది. కథకు సంబంధించిన కొన్ని పడిగట్టు సంప్రదాయాలను కూడా 'ముళ్ల చినుకులు' కథా సంపుటి బ్రేక్ చేసింది. ఏ చిన్న సమస్యనైనా, సంఘటనైనా కథగా మలుచుకోవచ్చని ఇందులోకి కొన్ని కథలను చదివితే మనకు అర్థమవుతుంది.

ఇందులోని కథలన్నీ ప్రత్యేకమే కాబట్టి.. ఒక్కో కథ గురించి వివరించి, విడమర్చి చెప్పాల్సిన అవసరం లేదు. ‘ముళ్ల చినుకులు’ పాత సంప్రదాయాలను దాటుకొని ముందుకు వచ్చింది. దళిత కథలు, దళిత సాహిత్యం ఇంతకంటే బలంగా వచ్చి ఉండొచ్చు. అది నా దృష్టిలో లేకపోవచ్చు. కానీ ఈ సంపుటి మాత్రం.. ఎంతో ప్రత్యేకతను, నవ్యతను మూటగట్టుకున్నది. సాహిత్యం అంటే ఏ వర్గానికో, కులానికో, మతానికో, భావజాలానికో చెందింది కాదని నిరూపించింది. నిజానికి ఈ కథలను దళితుల కంటే దళితేతరులే ఎక్కువగా చదవాలి. అప్పడే అణగారిన వారి ఆర్తి అర్థమవుతుంది. కులాన్ని దాచిపెట్టి సమాజంలో పాతుకుపోయిన సమస్యలను పరిష్కరించడం నిజంగా అసాధ్యం. ఆ విషయాన్ని ఎంతో సూటిగా ఈ పుస్తకం విప్పి చెప్పింది. అందుకే ముళ్ల చినుకుల్లో తనివి తీరా తడవండి.

- అరవింద్ రెడ్డి మర్యాద

81793 89805

👉 Dishadaily Web Stories

Advertisement

Next Story

Most Viewed