సమీక్ష: గౌరహరి దాస్ కథలు

by Ravi |   ( Updated:2023-02-20 03:07:02.0  )
సమీక్ష: గౌరహరి దాస్ కథలు
X

రియా నుంచి తెలుగులోకి సాహిత్యానువాదం ఎప్పటినుండో ఉన్నది. పురిపండా అప్పలస్వామి ఈ ఒరియా-తెలుగు అనువాదంలో అగ్రగణ్యులుగా ప్రసిద్ధికెక్కారు. గోపీనాథ్ మహంతి 'అమృత సంతానం', కాళింది చరణ్ పాణిగ్రాహి 'మట్టి మనుషులు' నవలలను అనువదించారు. అట్లాగే జయంత మహాపాత్ర కవిత్వాన్ని తెలుగు చేశారు డాక్టర్ యు.వి. నరసింహమూర్తి. ఈ మధ్యకాలంలో జ్ఞానపీఠ పురస్కారాన్ని పొందిన మేటి రచయిత్రి ప్రతిభారాయ్ నవల 'యాజ్ఞసేని' కూడా తెలుగులోకి అనువాదమయ్యింది. కవి సీతాకాంత మహాపాత్ర కవిత్వాన్ని నిఖిలేశ్వర్ అనువదించారు.

ఇప్పుడు ఈ కోవలో సాహిత్య అకాడెమీ పురస్కారం అందుకొని సుప్రసిద్ధులైన ప్రఖ్యాత ఒరియా కథకులు శ్రీ గౌర హరిదాస్ కథలను చక్కగా తెలుగు చేసి 'గౌర హరిదాస్ కథలు' అన్న పేరుతో మనకు అందించారు ప్రముఖ కథకులు, అనువాదకులైన మూర్తి కేవీవీఎస్. ఈయన గతంలో మేరియో పుజో 'గాడ్ ఫాదర్' ఆంగ్ల నవలని తెలుగులోకి ప్రతిభావంతంగా అనువదించి గాడ్ ఫాదర్ మూర్తిగా పేరు గాంచారు. సరళ తెలుగు నుడికారంలో ఈయన అనువదించిన గౌరహరి దాస్ ఒరియా కథలను చదివి మనం చక్కని అనుభూతిని పొందవచ్చు.

'గౌర హరిదాస్ కథలు' పుస్తకంలో మొత్తం 13 కథలు ఉన్నాయి. గాజుబొమ్మ, తండ్రి, పాపం, కసింద చెట్టు, ఇల్లు, ఏకుమేకు, అహల్య పెళ్లి, బంగారపు ముక్క, సరిపోయింది, ఊర్మిళ, నేరం-శిక్ష, మాయావృక్షం, చిన్న పంతులు అన్నవి ఆ కథలు. ఈ కథలన్నిటిలో మానవీయ కోణాలు, మానవీయ నైజాలున్నాయి. ఒక ప్రత్యేకమైన ఎత్తుగడ, ముగింపులతో సాగే కథా నిర్మాణంలో ముగింపుకొచ్చేటప్పటికి పాఠకుని మదిలో ఒక తటిల్లతలాంటి కదలిక, కళ్లలో కాసిన్ని కన్నీళ్లు వస్తాయి. మానవ అంతరంగాల్లోని సామాజిక నిర్మితిలోని బోలుతనాన్ని ఎత్తి చూపుతూ సాగే ఈ కథలన్నిటా రచయిత చూపు, సంస్కరణా దృష్టి విదితమౌతూనే ఉంటాయి. ఈ పదమూడు కథల సంకలనంలో అన్నీ మానవత్వపు గుబాళింపులతో కూడుకున్నవే అయినప్పటికీ ఇల్లు, బంగారపు ముక్క, సరిపోయింది, ఊర్మిళ, చిన్న పంతులు కథలు అంతర్జాతీయ ప్రమాణాలతో కాలానికి నిలబడే కథలుగా రూపు దిద్దుకున్నాయనే చెప్పాలి.

ఇల్లు కథ కలకాలం గుర్తుండిపోయే కథ! హ్యూమన్ ఎమోషన్స్, సున్నితమైన మానవ సహజమైన వాంఛలు, వయసుమళ్ళిన వారిలో కనిపించే ఐడెంటిటి క్రైసిస్.. ఇట్లాంటి మానవ సంవేదనల చుట్టూ తిరిగే ఈ కథ పఠిత మనసుని పట్టేస్తుంది. కథాగమనంలో ఏదో ఒక చోట మనం మనకి మంచిగానో, చెడ్డగానో కనిపిస్తాం కూడా. కథ వెంట మనం పరిగెడుతుంటాం, అదే సమయంలో మన మదిలో ఆత్మా చింతనా దౌడు ఒకటి సాగుతూ ఉంటుంది. అదే 'ఇల్లు' కథ ప్రత్యేకత! ఇక 'సరిపోయింది' కథని రచయిత చాలా చాకచక్యంగా చెప్పారు. ఈ కథలోని ఎడ్యుకేషన్ డిపార్ట్‌మెంట్లో డిప్యూటీ సెక్రటరీగా పనిచేసే అనుపమ్ పాత్ర స్వభావం, మనస్తత్వాన్ని చాలా గొప్ప ధ్వనితో చెప్పారు రచయిత.

'ఊర్మిళ' విధి వంచితురాలైన ఒక స్త్రీ దీనగాధ. పాఠశాల స్థాయిలో ఎంతో చురుకుగా, డామినెంట్‌గా, అందంగా, ఆరోగ్యంగా, నిక్కచ్చిగా ఉండే ఊర్మిళ, లెవెంత్ క్లాస్ ఫెయిల్ అవ్వడం, ఒక నకిలీ తాంత్రికుడి వలలో పడి తనతో లేచి పోవడం, చివరికి అంటే ఒక ఇరవై ఐదేళ్ళ కాలం గడిచిన తర్వాత ఒక హాస్పిటల్లో ఆయాగా జీవితాన్ని వెళ్లబుచ్చడం... ఇలా తన జీవితం గిరికీలు కొడుతూ కిందికి పడిపోతుంది. ఆయాగా ఉన్నప్పుడే ఈ కథని మనకి వినిపించే పాత్ర ఆసుపత్రిలో ఆమెని చూడటం, ఆశ్చర్యపోవడం జరుగుతుంది. ఎందుకంటే వీళ్ళిద్దరూ పాఠశాలలో క్లాస్ మేట్స్! ఊర్మిళ అప్పట్లో ఇతడిని తరగతిలో విపరీతంగా ఏడిపించేది.

ఆసుపత్రిలో ఆయాగా చేస్తున్న ఊర్మిళను చూసి "నువ్వు ఊర్మిళవు కదా!" అనడిగితే ఊర్మిళ ఎవరు నాపేరు బనలతా ఫరీదా అని అబద్ధం చెబుతుంది. ఊర్మిళ ఇంటికి కథ చెప్పే పాత్ర వెళ్ళినపుడు కూడా తను ఊర్మిళను కానని చెప్పి పంపేసి తలుపులు వేసుకుని ఆమె వెక్కి వెక్కి ఏడుస్తుంటే, ఆ ఏడుపు కథ చెబుతున్న పాత్రకే కాదు, కథ చదువుతున్న మనకీ వినిపిస్తుంటుంది. మనం కన్నీటి పర్యంతం అవుతాం, విధివంచితురాలైన నకిలీ మంత్రగాని చేతిలో మోసగించబడిన ఊర్మిళ ఇంటికి మనమూ ఒకసారి పోయి ఆమె కన్నీళ్లను తుడవాలనిపిస్తుంది. ఇంత చక్కని కథాసంకలనాన్ని ఎంతో శ్రమతో అనువదించి, కథల్లో బిగిని, వేగాన్ని సడలనీయకుండా తెలుగు పాఠకులకి అందించిన అనువాదకులు కేవీవీఎస్ మూర్తి ఎంతైనా అభినందనీయులు.

(ప్రతులకు నవోదయ బుక్ హౌస్, హైదరాబాద్. పేజీలు 144, వెల రూ. 150-)

సమీక్షకులు

అలజంగి మురళీధర్ రావు,

94403 35461

Also Read..

అంతరంగం: పాఠకుడు మహాపాఠకుడై వివరించిన కవిత్వ సారం



Advertisement

Next Story