శంఖం లోపలి చీమలు!

by Ravi |   ( Updated:2024-09-29 18:30:38.0  )
శంఖం లోపలి చీమలు!
X

బాగా చిన్నప్పుడు ఓ కథ చదివినట్టు జ్ఞాపకం. ఓ గురూజీ తన శిష్య పరమాణువుతో ఓ సాయం సంధ్య వేళ తీరం వెంట ఇసకలో నడుస్తో పోతున్నారు. యే తప్పూ చేయకపోయినా ఎందుకు కొందరు శిక్ష పొందుతున్నారో చెబుతూ పోతున్నారు గురూజీ.

"అదెలా గురూజీ?" ఏదైనా “పాపం” చేస్తేనే కదా శిక్ష అనుభవించాలి?"

నమ్మశక్యంగానట్టు ఆశ్చర్యంగా అడిగాడు శిష్యుడు.

గురూజీ చిరునవ్వు నవ్వి ఏదో చెప్పబోతున్నారు సమాధానంగా.

ఇంతలో గురూజీని అనుసరిస్తున్న శిష్యుడి కాలి బొటన వేలికి ఏదో చురుక్కున గుచ్చుకుంది.

"అబ్బా!" అంటూ కూలబడ్డాడు శిష్యుడు. "అయ్యా, ఏదో గుచ్చుకొని రక్తమోడుతోంది కాలు,”

దాన్ని చేతిలోకి తీసుకుని అనుమానంగా చూస్తూ, "అయ్యా, ఇదేదో శంఖంలా వుంది ఒకసారి చూడరా?" అన్నాడు.

గురూజీ కళ్ళింత చేసుకొని శంఖాన్ని పరీక్షగా చూస్తో, "శిష్యా ఇది దక్షిణావర్తి, దీని ప్రశస్తి గురించి తర్వాత చెబుతా… అందాకా అలా అట్టే పెట్టు" అంటూ ముందుకు కదిలేరు.

శిష్యుడు వెనకే కుంటుతో నడుస్తూ, ఇంకోవైపు శంఖాన్ని పట్టుకొని, చేతుల మీద పాకే చీమలు దులుపుతూ మహా చిరాగ్గా వస్తోన్నాడు. చీమలు బాగా కరుస్తున్నాయి. తట్టుకోలేని శిష్యుడు ఓపిక పట్టలేక ఉధృతంగా విరిగపడుతున్న అలల వైపుకు శంఖాన్ని గిరాటు కొట్టాడు.

గురూజీ వెంటనే, "అయ్యో ఎంత పనిచేశావ్, అదెంతో విలువైందో తెలుసా? దాన్ని సంపాదించడం ఎంత కష్టం! ఎంత పనిచేశావ్ శిష్యా!" అని వాపోయారు.

"పాపిష్టి చీమలు తెగకుట్టాయి గురువర్యా! అందుకే…వళ్ళు మండి విసిరాను" తప్పు చేసినట్టుగా నసుగుతూ అన్నాడు శిష్యుడు.

గురూజీ గుంభనంగా నవ్వేరు.

"నువ్వో ప్రశ్న వేశావ్, ఇందాక - తప్పు చేయకపోయినా శిక్ష ఏమిటి అని - " అన్నారు గురూజీ.

"మీరు దానికి సమాధానం చెప్పనేలేదు" శిష్యుడన్నాడు.

"అక్కడికే వస్తున్నా, నిన్ను కుట్టిన చీమలు నీ చేతుల్లో చచ్చాయి. బానే వుంది, కానీ శంఖం లోపల ఉండిపోయిన చీమలు అదుగో ఆ అలల్లో నిన్ను కుట్టకుండానే చస్తూ ఎందుకు శిక్ష అనుభవిస్తున్నాయ్?"

గురువు గారు గంభీరంగా విరిగిపడే అలవైపు చేయెత్తి చూపుతూ శిష్యుడి వైపు సాలోచనగా చూసేరు.

శిష్యుడు తల పంకించాడు ఏదో అర్థమైనట్టు.

శిష్యుడికి జ్ఞానోదయమైంది.

*

గుళ్లో ఆవు మాంసం విసిరిన వాడు భద్రంగా ఎలా ఉండగలడో,

ఏ పాపం చేయని నిరుపేదల ఇళ్లన్నీ ఎందుకు నేలమట్టమవుతాయో,

మసీదులో పంది మాంసపు ముక్క విసిరిన వాడు చక్కగానే ఎలా ఉంటాడో,

ఆ పక్కనే నిరుపేదల ఇల్లు నిర్దాక్షిణ్యంగా ఎందుకు కూల్చివేయబడతాయో,

ఎప్పుడో పిక్ పాకెట్ చేసిన పాపానికి,

వాడి కుటుంబం ప్రతీ దొంగతనాన్నీ మీదేసుకు ఎందుకు తిరుగుతుందో -

ఆకలి దప్పులతోనో జబ్బుతోనో, ఏదో ఒక వీధి కుక్క పిక్క పట్టుకుంటే,

వీధి కుక్కలన్నీ నిర్దాక్షిణ్యంగా రాత్రికి రాత్రే ఎందుకు మాయమైపోతాయో,

మంచి కోసం ఎత్తిన గొంతులూ, ఎగిసిన పిడికిళ్ళూ ఎందుకు తెగి పడతాయో,

పాపం పుణ్యం తెలీని పసిబిడ్డలు యుద్ధాల్లో ఎందుకు ఛిద్రమౌతారో,

కాముకుల వికృత క్రీడలకు ఎర కాబడతారో -

శిష్యుడికి అర్థం అయింది!

అయినా నిర్లజ్జగా “పాపం, పుణ్యం” అనే తప్పుడు సూత్రీకరణల్ని ఎందుకు మోసుకు తిరుగుతామో కూడా అర్థం అయింది.

వి. విజయకుమార్

85558 02596

Advertisement

Next Story