సముద్రం ముందు...

by Ravi |   ( Updated:2024-09-01 18:30:59.0  )
సముద్రం ముందు...
X

సముద్రం ముందు నిటారుగా నిలిచి తదేకంగా చూస్తుంటే.. మనసంతా మహాసముద్రం. ఉద్యమ ఊరేగింపులా ఉరికురికి వస్తున్న అలలు. అలల మీద అలలు. అలల వెనుక అలలు. ఆ రవ్వడి ఆ సవ్వడి ఆ రాకడ ఆ పోకడ ఒక మహా జల ర్యాలీ. ఎగిసిపడే నీటి తత్వ దర్శనమే ఒక సందర్భం. పరుగు పరుగున వస్తున్న నీళ్ల రవ్వల్లో ఎగురుతున్న పతాకాల జోరు. ఎక్కడో దూరం నుంచి దగ్గరి దగ్గరికి, కనుచూపు మేర నుంచి వలయాలు వలయాలుగా చుట్టుకొని చుట్టుకొని తిరిగి లేచి తీరం చేరుతున్న పవనాలు. ఆ ప్రవాహపు హోరు నుంచి వర్ధిల్లాలి...వర్ధిల్లాలి... అన్నట్టు లీలగా నినాదాల తరంగాలు.

సముద్ర తీర దృశ్యాన్ని చూస్తే..

సముద్రాన్ని ఎన్నిసార్లు చూసినా దాని ముందు పసిపిల్లలమై గాలిలో తేలిపోవుడే. విశాఖ బంగాళాఖాత ఆకాశం మీద తిరుగుతున్న మేఘాలను సులువుగా చేతితో నిమరవచ్చు. అప్పుడు మనసూ దేహం దూదిపింజం లెక్క అల్కగ పరిగెత్తుకొస్తున్న అలల తడి స్పర్శ కాళ్లకు తగిలి దేహంలోకి సన్నని విద్యుత్ వ్యాపనం. నిలుచున్న అంచున అరి పాదాల కింద పరుచుకుంటున్న నీళ్లకు కదిలి కరిగిపోతున్న ఇసుక ఒక గమ్మత్తు అనుభూతి. ఉపరితలం మీంచి అలలు వంకలు వంకలుగా ఆదివాసీ అమ్మాయిల థింసా నృత్యాల వలె వయ్యారాలు. తీర దృశ్యాన్ని చూస్తూ నిలబడితే రెండు కళ్లు ఎంతకూ సరిపోవు. తడిస్తే కూడా తనివి తీరదు. ఇసిరిసిరి వస్తున్న అలల వలలో చిక్కి తడిసిపోయి ఎగిరితేనే ఆనందం అంచుల దాకా చేరవచ్చు. అలల సవ్వడిలో కలిసి ఎగిసి కేరింతలు కొట్టినా కుతి తీరదు. సముద్రంలో సముద్రమై గంతులు ఏసినా మతి నిండదు.

అసలు ఈ సముద్రం మొస మర్రకుంట ఎందుకు తన్లాడుతంది? ఆవలి పక్క నుంచి నీళ్లను ఎవలో ఈ వలికి తరుముతండ్రు. తీరం దాటేదాకా పరుగు పందెంలో పాల్గొన్నట్టు జట్లు జట్లుగా కెరటాల పరుగులు. రాత్రీ పగలు వెలుగూ నీడా అసలే లేదు. కడలి కడుపులో ఎల్లవేళలా కల్లోలమే. అలల సవ్వడికి ఎదురెళ్లి సముద్ర స్నానం చేయడమే ఒకానొక మహత్కార్యం.

- అన్నవరం దేవేందర్

94407 63479

Advertisement

Next Story

Most Viewed