జీవ కళ కోల్పోతున్న జిందగీ!

by Ravi |   ( Updated:2024-08-25 19:00:58.0  )
జీవ కళ కోల్పోతున్న జిందగీ!
X

విరుద్ధంగా వికృతంగా జీవితాలు కొనసాగుతున్నాయి. ఏకీకృత వ్యాపార వ్యవస్థ విస్తృతమై గ్లోబలైజేషన్‌గా వ్యాపించిన తర్వాత మనిషి ముఖంలో కళ లేదు. అంతా ఒత్తిడి, ఒకరి మీద ఒకరి అజమాయిషి. తలకెక్కుతున్న అహంకారం. ప్రేమరాహిత్యం, పైస కమాయించే మనస్తత్వం పెరిగి పెనువేసుకుపోతుంది.

ఉదయం లేచింది మొదలు..

నగర జీవితం బహు వంకరగానే ఉంటుంది. ఏ వృత్తిలోని వారైనా తెల్లవారు లేచింది మొదలు ఏ అర్ధరాత్రో నిద్ర పట్టే వరకు ఫోన్లో మునిగి పనిచేసుకుంటూ పోవాల్సిందే. కాయ కష్ట శ్రమజీవనం అంతర్దానమై ఉరుకులు పరుగులకే కాలం కరిగిపోతుంది. నోట్లో కెమికల్ నిండుకున్న టూత్ పేస్ట్ వేయడంతోనే తెల్లవారుతుంది. ఆ రసాయనం కడుపులోకి పోయి తన పని తను చేస్తుంది. ఆ తర్వాత కొన్నాళ్లకు దంత వైద్యుడో గ్యాస్ట్రో ఎంటరాలజిస్టో అవసరం ఉంటుంది. తర్వాత ఖనిజ లవణాల రహిత ఆర్‌ఓ వాటర్ తాగడంతోనే మోకాళ్ల అరుగుదల తనకు తెలవకుండానే మొదలవుతుంది. మరికొన్నాళ్లు పోతే మోకాళ్ల, కీళ్ల ఆర్తో వైద్యులతో అవసరం ఏర్పడుతుంది. తర్వాత తాగే ‘టీ’లో మైక్రాన్లుగా నిండి ఉన్న ప్లాస్టిక్ సూక్ష్మం లోపలికి చేరుతుంది. ఎలాగూ అన్ని పాకెట్ పాలల్లో అనివార్యంగా కల్తీ కలుస్తుంది. చాయ్ తాగిన తర్వాత టిఫిన్ చేస్తాం. అందులో నూనె కథ అదొక వేదన. కిలో పల్లి గింజలకు 170 రూపాయల వరకు ఉంటది. దాన్ని ఏ యంత్రంలోనైనా నూనెగా మారిస్తే పావు కిలోకి ఎక్కువ రాదు. మరి 110 రూపాయలకే పల్లి నూనె పాకెట్లు ఎట్లా ఇస్తారు? ఈ రహస్యం ఎవరికి తెలియదు. అన్ని వంట నూనెల కథ ఇంతే. ఇందులో కచ్చితంగా మరొక కల్తీ నూనె కలుస్తుంది. ఆ నూనెలు వాడుకొని వాడుకొని కొన్ని రోజులకు శరీరంలో ఏ భాగమైనా ఖరాబు అయితే వైద్యుల దగ్గరికి పరిగెత్తడమే.

మధ్యాహ్నం..

ఆ తర్వాత మధ్యాహ్న భోజనాలు అక్కడ ఇదే నూనె. మళ్లీ కల్తీ కూరగాయలు, ఆకుకూరలు. ఏ రైతూ చెట్లకు మందు కొట్టి క్రిమి సంహారకమందు విచ్చలవిడిగా వేయకుండా పంటలు పండించడు. అట్ల తయారయింది వ్యవసాయం. మనం తినే పాలకూరలో, కొత్తిమీరలో కూడా క్రిమిసంహారక మందుల అవశేషాలు ఉంటాయి. చికెన్ తిన్నా అది అంతే. కోడి పిల్లలు తొందరగా ఎదగాలని వాటికి ఇంజక్షన్లు వేస్తారు. ఆ మందులన్నీ చికెన్ ద్వారా మన కడుపులోకి చేరుకుంటాయి. మటన్ కూడా అంతే సేమ్ ఇదే కథ. గొర్లకు ఫామ్స్ తయారయ్యాయి. ఈ మధ్య చేపలు కూడా ఇలా తొందరగా పెంచడం మన పొట్టలోకి అందించడం. చాలా సులువుగా జరుగుతుంది. మనం అన్నం తినే బియ్యం కూడా తెల్లగ సన్నగా ఉన్న వాటినే ఇంటికి తెచ్చుకుంటాం. బియ్యం తెల్లటి పాలిష్ ఉంటే కండ్లకు మంచిగా కనపడుతాయి. కానీ వాటి మీద బి విటమిన్ ఎగిరిపోతది. మల్ల అందులో కూడా పిండి పదార్థాలుగా ఉన్న అన్నం ఎక్కువ తిని ప్రోటీన్లుగా ఉన్న పప్పులు కూరలు తక్కువ కలుపుకుంటాం. ఇది ఇట్లాగే కొనసాగి కొనసాగి డయాబెటిక్ వైద్యుల సంఖ్య పెరిగిపోతుంది.

అంతా తరుముతున్న జీవితం

చల్లని చెట్ల గాలి విడిచిపెట్టి కిటికీలు బంద్ చేసి ఎయిర్ కండిషన్‌లో నిదురించి బయట ఉద్గారాలను పెంచి గాలి కాలుష్య వ్యాపారం పెరిగిపోతుంది. ఈ అపసవ్య జీవన విధానాలకు మల్ల వైద్యో నారాయణ హరి అంటూ వెళితే అక్కడ మొదలవుతుంది. ఇదో మల్టీ నేషనల్ మందుల కంపెనీల కథ. జనులకు అవసరమైన మందులు అవసరాలకు కాక మందుల కంపెనీల అమ్మకాలు ఆటోమేటిక్‌గా పెరిగిపోతాయి. కార్పొరేట్ వైద్య ఆస్పత్రులు కూడా పెరుగుతాయి. అవసరం ఉన్న మందులు అవసరం లేని మందులు ప్రిస్క్రిప్షన్లోకి రాయబడతాయి. సంపాదన ధ్యేయంగా పెరిగిన వస్తువ్యామోహం ప్రకృతి విరుద్ధ జీవనశైలి పెరిగిపోతున్న కాలం. ఇదంతా కుటుంబాలు వ్యక్తులు ఎవరికి వారు తెచ్చుకున్నది కాదు. అగ్రశ్రేణి గుత్త బహుళ కంపెనీ వ్యాపారులు వ్యూహాత్మక వలవేసి ఇలా నడిపిస్తున్నారు కావచ్చు. అందుకే మనిషి ముఖం మీద నవ్వే కళ లేకుండా పోయింది. చిరునవ్వుల పలకరింపులు మాయమయ్యాయి. అంతా తరుముతున్న జీవితం. పని ఒత్తిడి. మీది వాడు కింది వాన్ని, వానికింది వాడు మరి కింది వాన్ని. పని పని అర్జెంట్ అర్జెంట్ అని ప్రెషర్ నింపడం. ప్రభుత్వ ప్రైవేటు అన్నిట్లో ఈ ఒత్తిడి అణచివేత ఉంటూనే ఉంటుంది. ఒక ధ్యాన ప్రశాంతత , ఒక ఆత్మిక ఆనందం, మరొక మానవత్వ పరిమళం కనపడాల్సిన రోజులు రావాలి.

-అన్నవరం దేవేందర్

94407 63479

Advertisement

Next Story

Most Viewed