- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
తెలంగాణ అంటే తాగుడేనా!?
తాగుడు తప్పుకాకపోవచ్చు గానీ తాగడమే జీవితం కాదు గదా! ఆనందం అంటే మందు తాగడం అన్నంత కన్పిస్తుంది కొన్ని సినిమాల్లో! తెలంగాణ భాష సంస్కృతులతో సినిమాలు పాటలు ఇటీవల కాలంలో విస్తృతంగా వస్తున్నవి. వాటిని తెలంగాణే కాదు తెలుగు దేశమంతా ఇష్టంగా చూస్తున్నారు. కానీ ఇటీవల వస్తున్న కొన్ని సినిమాల్లో మందు తాగడమే ప్రధానంగా కన్పిస్తుంది. పాటల్లో ఫైటింగ్‌లో ఎక్కడ పడితే అక్కడ తాగుడు సన్నివేశం పెట్టారు తెలంగాణ నేటివిటితో వచ్చే సినిమాల్లో ఎప్పుడు పడితే అప్పుడు, ఎక్కడ పడితే అక్కడ తాగడం, సందర్భం లేకున్నా మందులో మునిగిపోవడం చూస్తుంటే ఈ సినిమా వాళ్ళు తెలంగాణ అంటేనే ‘తాగుడు’ సంస్కృతితో పరిచయం చేస్తున్నారా? అనిపిస్తుంది. ఇటీవల రెండు మూడు సినిమాల్లో ఇలానే కన్పించింది. సింగరేణి నేపథ్యంలో తీసిన సినిమాల్లో దీన్ని మరీ అతిగా చూపించారు.
ఎక్కడ పడితే అక్కడ దొరకడంతో...
సింగరేణి అన్ని ప్రాంతాల నుంచి వలస వచ్చిన గ్రామీణ శ్రామికుల ప్రాంతం. యాభై ఏండ్లుగా సింగరేణి కార్మికుల కుటుంబాల నుంచి ఎందరో ఉన్నత విద్యావంతులై జీవితంలో స్థిరపడిపోయారు. శ్రామిక వర్గ చైతన్యంతో ప్రశ్నించే తిరుగుబాటు చేసే సామాజిక రాజకీయాలను అర్థం చేసుకునే తరం అక్కడ నుంచి ఎదిగింది. కళా సామాజిక సాహిత్య రంగంలో కూడా సింగరేణి బెల్ట్ తక్కువదేమీ కాదు. అట్లాంటి ప్రాంత నేపథ్యంలో సినిమా అంటే మద్యమే అన్నట్టుగా ఉండటం లేని సంస్కృతిని తెలంగాణకు అపాదించినట్టు కన్పిస్తుంది.
మిగతా ప్రాంతాలతో పోల్చుకుంటే ‘తాగడం’ అనేది ఇటీవల కాలంలో లెక్కలు చూస్తే ఇక్కడ కొంత ఎక్కువైనట్టున్నది. ఇది కూడా భవిష్యత్‌లో ప్రమాదకరమైనది. ప్రతి ఊరిలో అనుకూలంగా బెల్ట్ షాపులు నగరాల్లోనూ, ఎక్కడ పడితే అక్కడ వైన్ షాపులు వెలిశాయి. ఇందుకు తోడు ఎక్సైజ్ శాఖకు అమ్మకాలు ఎక్కువ జరిపేందుకు టార్గెట్లు పెట్టడం దారుణంగానే ఉన్నది. విపరీతంగా తాగడం వల్ల రోడ్డు ప్రమాదాలు, కొట్లాటలు అనారోగ్యాలకు ప్రజలు గురవుతున్నారు. ఎక్కడికక్కడ డబ్బులు దుర్వినియోగం అవుతున్నాయి. ఎక్కడ పడితే అక్కడ సరుకు అందుబాటులో ఉండటం వల్ల మనసు అటే ‘గుంజే’ ప్రమాదం ఉంది.
సినిమాను.. ఒక్క కల్చర్‌కు కట్టి చూపొద్దు
తాగుడు ఇప్పుడు విద్యార్థుల వరకు పాకిపోయింది. టెన్త్, ఇంటర్మీడియట్ పిల్లలు కూడా చుట్టూ సమాజాన్ని చూసి ఫ్యాషన్‌గా మొదలుపెట్టి అలవాటుగా మార్చుకుంటున్నారు. సరిగ్గా ఈ సందర్భంలోనే తెలంగాణ భాష సంస్కృతిలో వస్తున్న సినిమాల్లో తాగడం ఒక ప్రధానం చేయడం వల్ల మారాల్సిన సమాజం మరింత కొనసాగిస్తుంది. ఒకప్పుడు కొన్ని సినిమాల్లో రాయలసీమ అంటే ఫ్యాక్షనిస్ట్‌లు అన్నట్టు చూపించే వాళ్లు. పగలు, పంచాయితీ, ఫ్యాక్షన్ రాజకీయాలు, చావులు ఇవన్నీ హీరోయిజంగా వచ్చిన సినిమాలు చూస్తే రాయలసీమ అంటే మొత్తం ఫ్యాక్షన్ సంస్కృతిలా అనుకునేట్లు అయింది. సమాజంలో ఎన్ని కథలు, జీవితాలు ఉంటాయి. పేదరికం, మోసాలు, వలసలు, వ్యవసాయంలో నష్టపోవడం, పోరాటాలు, ప్రేమలు ఎన్ని ఉంటాయి. అందులో ఫ్యాక్షన్ ఒకటి కావచ్చు గానీ అట్లనే తెలంగాణ సినిమాను కూడా ఒక్క కల్చర్‌కు కట్టి చూపెట్టడం తగదు.
అన్నవరం దేవేందర్
94407 63479