అంతరంగం: ఆకస్మికంగా ఆగిపోతున్న హృదయాలు!

by Ravi |   ( Updated:2023-05-21 19:30:43.0  )
అంతరంగం: ఆకస్మికంగా ఆగిపోతున్న హృదయాలు!
X

టీవలి కాలంలో ఆకస్మికంగా గుండెలు ఆగిపోయి మనుషులు విలవిలా కుప్పగూలిపోతున్నారు. ఎకాఎకిన ఆగిన హృదయ కవాటాలలో ప్రాణాలు గాలిలో కలుస్తున్నాయి. అంతకు ముందు గుండె సంబంధ వ్యాధి లేకున్నా, బీపీ, షుగర్ వ్యాధులు లేకున్నా ఒక్కసారే గాలిలో ప్రాణాలు తేలిపోతున్నాయి. ఎందుకిలా అక్కడక్కడా జరుగుతున్నాయో పరిశోధన జరపాల్సిన విషయమే.

అందుకే ప్రాణాలు పోతున్నాయా?

కరోనా ప్రభావంతో చాలా మంది మృత్యువాత పడ్డారు. కరోనాకు టీకా కనిపెట్టిన తర్వాత వాటిని తీసుకున్న వాళ్లు ఇలా అయిపోతున్నారు అనే ప్రచారం జరుగుతోంది. శాస్త్ర సాంకేతిక విజ్ఞానం పెరిగిన దశలో కరోనాకు కోవాగ్జిన్/ కోవిషీల్డ్ టీకాలు పూర్తికాలం పరీక్షలు నిర్వహించకుండానే ఆదరాబాదరా మమ అనిపిచ్చి జనం మీదికి వదిలారా అని కొందరు ప్రశ్నిస్తున్నారు. అయినా ప్రతిదానికీ ఒక లెక్క ఉంటుంది. ఆ పద్ధతి ప్రకారమే శాస్త్రవేత్తలు పరీక్షలు నిర్వహించి తీరుతారు కానీ ప్రస్తుత ప్రపంచంలో పెట్టుబడి వ్యాపార లాభాల వ్యవస్థ అన్నింటినీ అధిగమించిపోతోంది. మనదేశంలో కానీ, ఎక్కడైనా రాజకీయ ప్రభుత్వాలను నడిపించే శక్తి బడా పారిశ్రామికవేత్తలకు ఉంటుంది. కాలగమనంలో కరోనా సోకిన తర్వాత వాడిన శక్తివంతమైన మందుల దాడికి శరీరం తట్టుకోలేక ఇలా సెలవు కోరుకుంటోందా? వీటికి శాస్త్రీయ కోణంలోనే విశ్లేషించాల్సి ఉంది. కానీ ఇటీవలి కాలంలోనైతే ఒకసారి గుండె నొప్పితో కుప్పగూలిన కేసులు చాలా కనబడుతున్నాయి. మనకు ఆరోగ్య స్పృహ, మందుల స్పృహ చాలా తక్కువ. వైద్యం పెద్ద వ్యాపారం అయిపోయిన తర్వాత మానవ శరీరం మీద వ్యాధులు లేకున్నా వచ్చినట్లు ఆసుపత్రుల పాలు చేస్తున్న హాస్పిటల్స్ యజమాన్యాలున్నాయి. దేశంలో విద్య వైద్యం ఉచితంగా అందాల్సి ఉండగా ఈ రెండూ ప్రైవేటు వ్యక్తుల చేతిలో ఉండటం వల్ల మందుల ఉత్పత్తికి, వాడకానికి నిషేధం, నియంత్రణ లేకపోవడం వల్ల ఫార్మా రంగం కోట్లకు పడగలెత్తి రాజకీయ పార్టీలను వాటి ద్వారా ప్రభుత్వాలను నడిపిస్తున్నాయి. వాటి పరోక్ష నియంత్రణలోకే మనుషుల ఆరోగ్యాలు పోతున్నాయి.

టార్గెట్ల కోసం..

అసలు మనుషుల ఆరోగ్య జీవనశైలి వ్యాయామం ఆహారశైలి నియంత్రణల దృక్పథం పట్ల ప్రజలకు చైతన్యం లేకుండా పోయింది. ఏ రకమైన ఆహారం తీసుకోవాలి? అందులో ఏమి ఉంటుంది? మనిషి ఎదుగుదలకు ఏది కావాలి? ఫ్యాట్ ఎంత ఉండాలి? కార్బోహైడ్రేట్స్ ఎంత ఉండాలి? ప్రోటీన్స్ ఎంత ఉండాలి? ఏది ఎక్కువైతే ఏం కొంప మునుగుతోంది? ఎందులో చక్కెర ఎక్కువ మోతాదు ఉంటుంది? ఏది తినవద్దు, ఏం తినాలి అనే అవగాహన చైతన్యం అందరి చదువుల పాఠ్యపుస్తకాల్లో లేవు. ఎక్కడా నేర్పరు. ఆ అవకాశం లేదు. విటమిన్ డి లోపం వల్ల బొక్కలకు సంబంధించి ఎన్ని రోగాలు వస్తాయి. మరి ఈ విటమిన్ డి ఎండలో తిరిగితే ఉచితంగానే దొరుకుతది. ఎవరూ చెప్పరు మనకు తెల్వది. వైద్యుని దగ్గరకి పోతే యాజమాన్యం టార్గెట్ వల్ల విపరీతంగా మందులు రాస్తారు. అవీ అమ్ముడు పోవాలి. మందుల కంపెనీల టార్గెట్ అదొక లెక్క. ఇవన్నీ మింగితే వచ్చిన రోగం తగ్గి ఇంకో వ్యాధి మొదలవుతుంది. ఇలా గొలుసుకట్టు వ్యవస్థ మనుషుల మధ్య అల్లుకున్నది.

నేటి మనిషి ఒక వినియోగదారుడు అయ్యిండు. ఒక సరుకు కొనుగోలు చేసే మనిషిగా తనను మార్చాలి. ఏ ఉత్పత్తి వస్తువు అయినా అమ్ముడు పోవాలి. అది మనిషికి అవసరమా కదా? అనేది కాదు, వాని చేత ఆ వస్తువు కొనిపించాలి. అందుకే కదా పెద్ద పెద్ద ఐఐటీల్లోంచి బయటకు వచ్చిన ఎంబీఏ లు ఉన్నది. ప్రపంచంలో భారతదేశంలోనే ఎక్కువ మానవ వనరులున్న దేశం ఇక్కడే. సరుకులు అమ్ముకోవాలి కొనిపించాలి. మనిషి మైండ్‌ను ట్యూన్ చేయించాలి, మందులు వస్తువులు అన్ని రకాలు వ్యాపారం ఇక్కడ నిర్వహించాలి. ఏది తినకూడదో అదే తింటున్నారు ఏది చెయ్యకూడదో అదే చేస్తున్నాం. ఆ తర్వాత విపరీతమైన పని ఒత్తిడి తట్టుకోలేకపోవడం, మందు తాగడం ఆఖరుకు హృదయం బరువెక్కి తనకు తానే స్విచ్ ఆఫ్ చేసుకుంటున్నది.

అన్నవరం దేవేందర్

94407 63479

Advertisement

Next Story

Most Viewed