- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
యాత్ర... జీవన వికాసానికొక ఆయుర్వేద మాత్ర
జీవితానికి ప్రవాహ చలనశీలత కల్గితేనే మానసిక వికాసం లేదంటే నిలువ నీరులెక్కనే ఉంటది. తిరగడం ముఖ్యం. ప్రయాణంతోనే అధ్యయనం ఆలోచనలు తీగలు సాగుతాయి. ఇటీవల మేము మిత్రులతో కల్సి ఒక ట్రావెల్ ఏజెన్సీ ద్వారా జమ్మూకాశ్మీర్ యాత్ర చేసినం. కాశ్మీర్ ఒక బహు సుందర దృశ్యం. మంచుపర్వతాల మీద నడుస్తుంటే మనసూ దేహం గాలిలోనే తిరుగుతున్న ఆనందం కల్గుతుంది. గుల్‌మార్గ్ గొండోలాపైన ఆఫర్వత్ అంచులదాకా కలియతిరిగినం. కాశ్మీర్ అనగానే ఒక యుద్ధ వాతావరణం కనులముందు తిరుగుతుంది. లోలోన లీలగా భయాలున్నా యాత్రనందం ముందుకు నడిపింది. శ్రీనగర్ నిండా పోలీసుల పహారానే. అక్కడి జాతీయ రహదారి పొడుగునా ఫర్లాంగుకు ఒకరుగా సీఆర్‌పీఎఫ్ జవాన్లు కన్పిస్తారు. అంతటా చెక్‌పోస్ట్ బందోబస్తులు ఉండే ఉంటాయి.
మంచిర్యాలకు చెందిన కృష్ణమోహన్ నిర్వహించిన యాత్రలో జగిత్యాలకు చెందిన ఎలుగేటి రాజేంద్ర ప్రసాద్ ద్వారా కరీంనగర్ నుంచి మేమిద్దరం దంపతులం మరో ఐదు జంటలం కల్సి హమ్ సఫర్ ఎక్స్‌ప్రెస్‌లో జమ్ముకాడికి బయలుదేరాం. అక్కడి నుంచి కాట్రా నగరం. కాట్రాను ఆనుకొనే ఉంటుంది వైష్ణోదేవి ఆలయం. ఇక్కడికి చేరాలంటే గుర్రాల మీద లేదా నడక, హెలికాప్టర్‌ల మీద వెళ్ళాలి. ఆ కొండలు ఎక్కడం బహు సుందర ఆనందం అన్పిస్తది. మేము ఆశ్విక సారధులం పదమూడు కిలోమీటర్లు గుర్రాల మీద స్వారీ చేయడం వల్ల నడుములు టింగుమన్నాయి. వైష్ణోదేవి ఆలయం హిమాలయ పర్వత శ్రేణిలోని త్రికూట పర్వతాల్లో ఉంది. 24 గంటలు ప్రవేశం వల్ల జనం అధికంగా ఉన్న ఇబ్బంది ఉండది.
అంతా శీతల వాతావరణం.. ఆ కొండలు గుట్టలు పర్వతాల సానువులు చూస్తేనే ఆనందం తన్నుకువస్తుంది. చాలామంది నడుస్తూనే చేరుతారు. గుర్రం మీద కూర్చున్నంక నడిపించే ఆయన మనముందూ వెనకే ఉంటాడు. తనూ రోజూ 13 కిలోమీటర్లు నడవడం చాలా కష్టమైన జీవితం. కాట్రానగరం నుంచి శ్రీనగర్ దారి పొడవునా పర్వత సానువులు మంచు గుట్టలు మైమరపిస్తాయి. ఇది ఆరుగంటలకు పైన బస్సుదారి ఉదంపూర్, రాంబస్, బన్‌హిల్, అనంతనాగ్ మీదుగా శ్రీనగర్ చేరుకోవాలి. ఇందులో 44వ నంబర్ జాతీయ రహదారి కలుస్తుంది. ఇంకా నిర్మాణంలోనూ ఉంది. లోయలు కన్పిస్తాయి వాహనం ఎక్కడ పడిపోతుందా, ఎక్కడ మనం వార్తలుగా మారుతామో అనిపిస్తది. ట్రాఫిక్ ఒకేవైపు నడిపిస్తారు ఇక్కడ అన్నిదారులు పోలీసుల కంట్రోల్‌లోనే ఉంటాయి. ప్రయాణం దూరం తక్కువ అయినా బస్సు ముందుకు పోవడం కష్టం చుట్టూ పరుచుకున్న మంచు కొండలు, ఆకాశాన్ని కిటికీల గుండా చూడటం వల్ల అలసట ఉండదు. అంతా ఉత్సాహమే.
శ్రీనగర్ చేరిన తర్వాత మరింత గజగజ చలి. చలికోట్లు తీసికొని లాడ్జ్‌లో రెండు రెండు రగ్గులు కప్పుకుంటేనే కానీ వనుకు పోదు. శ్రీనగర్‌లో దాల్ సరస్సు చూడ ముచ్చటైనది. దాని పొడవే 8 కిలోమీటర్లు. నగరంలో ఏ రోడ్‌పైన ప్రయాణించినా ఒక పక్క దాల్ సరస్సు కన్పించాల్సిందే. ఇంత విశాలమైన సరస్సులో ఎంతోమందికి బోట్ నడపడంలోనే ఉపాధి. శ్రీనగర్ అంతా కాశ్మీరీతనం కన్పిస్తది స్థానికంగా తయారు చేసిన ఉలెన్ జాకెట్లు, కోట్లు, స్వెట్టర్లు, హాండ్ లెదర్ బ్యాగులు కన్పిస్తాయి. బాగా సంపన్న జీవనశైలి కన్పించదు. పెద్ద పెద్ద ఉన్నత శ్రేణి వాహనాలు కన్పించవు. ఇంకా సైకిల్లు, గుర్రాలు, రిక్షాలు సైతం కన్పిస్తాయి. నగరంలో ఎక్కువగా కాశ్మీరీ స్త్రీలు కన్పించలేదు. మార్కెట్‌లో, దుకాణాల్లో ఎక్కువగా పురుషులే కన్పిస్తారు. యాత్రికులు బసచేసిన హోటల్ల వద్దకు శాలువాలు, స్వెటర్లు, మంకీ క్యాపుల అమ్మకానికి బిలబిల మంటూ వస్తారు. వాల్లు చెప్పిన ధర కంటే సగం వరకు అడిగితే ఇస్తారు. ఎక్కువ ఖరీదు ఏమి ఉండదు. కాశ్మీరీలకు ఎవరికీ బొర్రలు కన్పించవు. ఎవరిని చూసినా ఎర్రగా నిటారుగా ఏడు ఫీట్లపైన హైట్‌తో కన్పిస్తారు. అందరికీ పొడవు ముఖం, పొడవు ముక్కు.. ఎవరిని చూసినా ఒక్కతీరే అన్పిస్తరు.
కాశ్మీర్‌లో కవా అనే గ్రీన్ టీ లాగా ఉంటది. ప్రతి హోటల్‌లో ఇది ప్రత్యేకం. కమ్మగా ఉంటుంది. ఇది కుంకుమ పువ్వు గులాబీరేకులు, గ్రీన్ టీ ఆకులు ఇంకేవో కొన్ని కలిసి చేస్తారు. ఇక్కడ చాయ్ అంత బాగుండదు. పాడి పరిశ్రమ లేదు. బర్లు, ఆవులు కన్పించవు. పాలు అన్నీ ‘అమూల్’ వాల్లవి, టెట్రా ప్యాక్‌లో నచ్చిన పాలే. వ్యవసాయం ప్రధానంగా ఆపిల్ తోటలు, అప్రికాట్ తోటలు, ఆవాలు పండిస్తారు. కేసరి పంటలు ఎటుచూసినా అగుపిస్తాయి. కాశ్మీరీ కేసరి (సాఫ్రాన్) డ్రై ప్రూట్స్ ఎక్కువగా అమ్ముతారు. కాశ్మీర్‌లో నగరాల ద్వారా ప్రయాణిస్తుంటే ఎక్కువగా అస్తర్ కారే చేయని ఇండ్లు కన్పిస్తాయి. నిరుద్యోగులు ఎక్కువగా ఉండి చిన్న చిన్న వ్యాపారాలు చేసికుంటారు. ఎప్పటికీ కాశ్మీర్ అల్లకల్లోల పరిస్థితి పోలీసుల పహారాలోనే వ్యసనాలు నడుస్తాయి.
లాల్ చౌక్ అంటే మన దగ్గర హైదరాబాద్‌లో ఒకప్పటి కోటి సుల్తాన్ బజార్ లెక్కకన్పిస్తది. అన్ని వస్తువులు ఉంటాయి కొన్నిచోట్ల బేరం ఆడవచ్చు. మోసం ఉండవచ్చు కానీ ఎక్కువగా ఉండదు. అసలు వైన్‌షాపులే కన్పించవు. నిషేధం లేదు కానీ చాలా దూరంలో అక్కడక్కడా ఉంటాయట. ఇక్కడ మందు ఎక్కువగా వినియోగంలో లేదు. చికెన్ సెంటర్లు కూడా తక్కువగా కన్పిస్తాయి. ఎందుకంటే కోళ్ళ పరిశ్రమ లేదు. అందరికీ చలికోట్లు పొడవుగా ఉంటాయి. ఊర్లర్ల ఇప్పటికీ గ్రామస్తులు ఒక దగ్గర గుమిగూడి మాట్లాడుకునే దృశ్యాలు కన్పిస్తాయి. రహదారులన్నీ ఇరుకు ఇరుకుగా ఉంటాయి. శ్రీనగర్‌లో కూడా సందులు గొందులు ఇరుకు కొంత మురికి కనిపిస్తుంది. విశాలమైన దారులు లేవు. మా ప్రయాణం అరవైమందికి పైగా యాత్రికులతో ఉత్సాహంగా సాగింది. మా బృందం ఆనందంగా వైష్ణోవి శ్రీనగర్, గుల్మర్గ్, సన్ మార్గ్, పహెగాం ప్రాంతాలు పర్యటించి ఊపిరి తిత్తులను ఉతికి ఆరేసుకున్నాము. మనసు మాత్రం తిరిగి కరీంనగర్‌కు వచ్చినా హిమాలయ పర్వతాల్లోనే తిరుగుతోంది.
అన్నవరం దేవేందర్
94407 63479